ఈ నెల 29న దీక్షా దివస్‌ ఘనంగా నిర్వహించాలి.. పార్టీ శ్రేణులకు కేటీఆర్‌ కీలక సూచనలు

by Ramesh Naini |

రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 29న దీక్షా దివస్‌ను ఘనంగా నిర్వహించనున్నట్లు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ తెలిపారు.

ఈ నెల 29న దీక్షా దివస్‌ ఘనంగా నిర్వహించాలి.. పార్టీ శ్రేణులకు కేటీఆర్‌ కీలక సూచనలు
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 29న దీక్షా దివస్‌ను ఘనంగా నిర్వహించనున్నట్లు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ తెలిపారు. ‘తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో’ అనే గొప్ప త్యాగ నిరతితో దీక్షను చేపట్టి స్వరాష్ట్ర రాష్ట్రాన్ని సాధించుకున్నామని చెప్పారు. శనివారం పార్టీ నేతలతో టెలీ కాన్ఫరెన్స్​ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పేర్కొంటూ.. దీక్షా దివస్‌ను పెద్ద ఎత్తున నిర్వహించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ నెల 26వ తేదీన అన్ని జిల్లాల పార్టీ కేంద్రాల్లో ముఖ్య నాయకులతో సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేసి ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, కార్పొరేషన్ మాజీ చైర్మన్లు సహా ఇతర కీలక నాయకులందరినీ ఆహ్వానించాలని ఆదేశించారు. నవంబర్ 29న పార్టీ ఘనంగా నిర్వహించే దీక్షా దివస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కార్యాచరణ ప్రణాళికను రూపొందించామన్నారు.

28వ తేదీ సాయంత్రం లోగా జిల్లా కేంద్రాలు, పట్టణాలను బ్యానర్లు, ఫ్లెక్సీలతో అలంకరణ పూర్తి చేయాలని, జిల్లాలోని ముఖ్య నాయకులందరికీ ప్రత్యేకంగా సమాచారం ఇచ్చి వెయ్యి మంది కీలక పార్టీ నేతల హాజరు అయ్యే విధంగా చూడాలన్నారు. మొదటగా తెలంగాణ తల్లికి, అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించిన తర్వాత, కార్యక్రమం ప్రారంభానికి గుర్తుగా కేసీఆర్ భారీ కటౌట్‌కు పాలాభిషేకం చేయాలని సూచించారు. దీక్షా దివస్ సందర్భంగా జరిగిన అనేక కీలక సంఘటనలు, వివిధ పరిణామాలపై ఫోటో ప్రదర్శనను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలన్నారు. ఈ ఫోటోలను పార్టీ కేంద్ర కార్యాలయం జిల్లాకు పంపిస్తుందని వీటితో పాటు, స్థానిక జిల్లాల్లో దీక్షా దివస్ సందర్భంగా జరిగిన సంఘటనల ఫోటోలు, మీడియా కవరేజ్ క్లిప్పింగ్‌లతో మరొక ఉప విభాగాన్ని కూడా ఏర్పాటు చేయాలన్నారు. కేవలం రాజకీయ ఉపన్యాసాలు కాకుండా, ఆనాటి ఉద్యమ స్మృతులను, ముఖ్యంగా దీక్షా దివస్ వివరాలను అందించేలా మాట్లాడే వక్తలను ఆహ్వానించాలని, వారి సమయాన్ని ఇప్పుడే నిర్ధారించుకోవాలని సూచించారు. దీక్షా దివస్ రోజున పండ్ల, అన్నదానం లాంటి సామాజిక కార్యక్రమాలు చేపట్టవచ్చన్నారు. హైదరాబాద్‌లోని నిమ్స్ హాస్పిటల్‌లో రోగులకు పండ్ల పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.

Next Story