పుష్కర తెలంగాణ.. ముష్కరుల పాలైంది : కేటీఆర్ తీవ్ర విమర్శలు

by Naga Rani Yarlagadda |

పుష్కర తెలంగాణ ముష్కరుల పాలైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు.

పుష్కర తెలంగాణ.. ముష్కరుల పాలైంది : కేటీఆర్ తీవ్ర విమర్శలు
X

దిశ, వెబ్‌డెస్క్: 14 ఏళ్ల పాటు పోరాడి సాధించుకున్న తెలంగాణకు నేటికి పుష్కర కాలం పూర్తయిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. పుష్కరకాల తెలంగాణ.. నేడు ముష్కరుల పాలైందని విమర్శించారు. రాష్ట్ర 12వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ భవన్ లో నిర్వహించిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చాక అనేక సంక్షేమ పథకాలు చేశామని చెప్పుకుంటున్న సీఎం రేవంత్ రెడ్డి.. నాలుగుసార్లు రైతు బంధు ఎగ్గొట్టారని ఆరోపించారు. సెక్యూరిటీ లేకుండా సీఎం, మంత్రులు బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరునెలల్లో PRC ఇస్తామని చెప్పిందని, రెండున్నరేళ్లయినా దాని ఊసే లేదన్నారు.

కేసీఆర్ పోరాటంతోనే తెలంగాణను సాధించుకున్నామని, కేసీఆర్ చచ్చుడో.. తెలంగాణ వచ్చుడో అనే నినాదంతో అందరినీ ఒప్పించి రాష్ట్రాన్ని తెచ్చుకున్నామన్నారు. నెత్తురుపారిన నేలల్లో సాగునీటిని పారించిన నేత కేసీఆర్ అని కొనియాడారు. అలాంటి కేసీఆర్ గురించి నేడు కొందరు అల్పులు ఇష్టారీతిన మాట్లాడుతున్నారని వాపోయారు. తెలంగాణ తల్లి నెత్తిన ఉన్న కిరీటాన్ని ఎత్తుకెళ్తుంటే చూస్తూ ఊరుకోబోమని, తెలంగాణను కాపాడుకునేందుకు అందరూ పునరంకితం కావాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. తెలంగాణ భవన్లో ఉన్న బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలతో ప్రతిజ్ఞ చేయించారు.

"సుసంపన్నమైన ప్రకృతి సంపద, మహోజ్వల చరిత్ర కలిగిన ఈ పవిత్ర తెలంగాణ నేలపై జన్మించినందుకు నేనెంతో గర్విస్తున్నా.. కేసీఆర్ నాయకత్వంలో ఎందరో అమరవీరుల త్యాగాలతో సాధించుకున్న తెలంగాణ.. దశాబ్ద కాలంలోనే సమగ్ర అభివృద్ధి సంక్షేమాలతో సస్యశ్యామలంగా వర్థిల్లింది. నా తెలంగాణ రాష్ట్రాన్ని నేను గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటాను. కానీ నేడు అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన నయవంచక పాలనలో మన రైంతాంగం, అన్ని వర్గాల ప్రజలు కష్టాల పాలయ్యారు. తెలంగాణ వ్యతిరేక శక్తుల కుట్ర వల్ల మన అస్తిత్వానికి, ఆత్మగౌరవానికి, ముప్పు పొంచి ఉన్నది. ఈ విపత్కర పరిస్థితుల్లో తెలంగాణ అస్థిత్వ రక్షణే నా ప్రథమ కర్తవ్యంగా భావిస్తూ.. మరో ప్రజా పోరాటానికి నన్ను నేను పునరంకితం చేసుకుంటున్నాను. తెలంగాణ తల్లి సాక్షిగా.. భారత రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ సాక్షిగా, తెలంగాణ అమరవీరుల సాక్షిగా.. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ వ్యతిరేకుల కుట్రల్ని చేధించి, మన తెలంగాణను రక్షించుకుందాం అనే నినాదంతో ఉద్యమిస్తానని మనసా, వాచా, కర్మణా, ప్రతిజ్ఞ చేస్తున్నాను" అని ప్రతిజ్ఞ చేయించారు.

Next Story