- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
BREAKING : బీసీ రిజర్వేషన్ బిల్లుకు కేటీఆర్ మద్దతు.. సీఎం రేవంత్ రెడ్డికి చాలెంజ్
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ (Telangana Assembly) ఆమోదం తెలిపింది. మంత్రి సీతక్క (Minister Seethakka) పంచాయతీ రాజ్ లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ బిల్లును అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు.

దిశ, వెబ్‌డెస్క్: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ (Telangana Assembly) ఆమోదం తెలిపింది. మంత్రి సీతక్క (Minister Seethakka) పంచాయతీ రాజ్ లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ బిల్లును అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. ఈ బిల్లుపై చర్చ ప్రారంభమవ్వగా.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ (KTR) కీలక వ్యాఖ్యలు చేశారు. పంచాయతీరాజ్ బిల్లులో రాజకీయ, సామాజిక స్థితిగతులు లేవన్నారు. గతంలో యూపీఏ ప్రభుత్వంలో తాము భాగస్వాములుగా ఉన్నామని గుర్తు చేశారు. బీసీల రిజర్వేషన్ బిల్లును అమలు చేయడం తమకు ఇష్టం లేదని సీఎం చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందించారు. రాష్ట్రంలో ఓబీసీ మంత్రిత్వ శాఖ పెట్టాలని కేసీఆర్ (KCR) సూచించారని కేటీఆర్ తెలిపారు. అలాగే బీసీలకు బీఆర్ఎస్ పార్టీ స్పీకర్, కౌన్సిల్ చైర్మన్ పదవులను ఇచ్చింది, బీసీని మొదటి అడ్వొకేట్ జనరల్ గా చేసింది కేసీఆర్ ప్రభుత్వమేనని తెలిపారు. తమ పార్టీలో 3 ప్రొటోకాల్ పొజిషన్లను బీసీలకే ఇచ్చామని స్పష్టం చేశారు. చట్టసభల్లోనూ రిజర్వేషన్లు ఇవ్వాలని తీర్మానం చేశామని పేర్కొన్నారు.
బీసీలకు న్యాయం జరగాలంటే రాజ్యాంగ సవరణ జరగాలని, 50 శాతం సీలింగ్ తీసేలా రాజ్యాంగ సవరణ చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్లపై సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఇప్పటికే నాలుగుసార్లు మాట మార్చారని, సీఎం చిత్తశుద్ధి ఏ స్థాయిలో ఉందో ప్రజలు గమనిస్తూనే ఉన్నారన్నారు. బీసీ సబ్ ప్లాన్ చట్టంపై చర్చ జరిపేందుకు సభ నిర్వహించాలని కేటీఆర్.. మంత్రి పొన్నం ప్రభాకర్ ను కోరారు. దీనికి స్పందించిన పొన్నం ప్రభాకర్.. కచ్చితంగా ఒకరోజు దీనిపై చర్చిస్తామని తెలిపారు. బీసీ రిజర్వేషన్ బిల్లులో (BC Reservation Bill) ఏ లోపాలున్నా, ఎలాంటి సూచనలున్నా చెప్పాలని కోరారు. బీసీ రిజర్వేషన్ బిల్లుపై రాష్ట్రవ్యాప్తంగా సర్వే జరిగినపుడు కేటీఆర్ కూడా పాల్గొని ఉంటే బాగుండేదన్నారు. ఏదేమైనా ఈ బిల్లుపై ఏకాభిప్రాయంగా ముందుకు వెళ్లాలని మంత్రి సూచించారు.
చట్టాలను శాస్త్రీయంగా అమలు చేస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవని కేటీఆర్ బదులిచ్చారు. అయితే తాము చేసిన ఇంటింటి సర్వేలో రాష్ట్రంలో ఉన్న బలహీనవర్గాల సంఖ్య 52 శాతంగా తేలిందని, కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన సర్వేలో 6 శాతం ఎలా తగ్గింది? తాము పాల్గొనకపోతేనే 6 శాతం తగ్గుతుందా ? అని ప్రశ్నించారు. 42 శాతం బీసీ రిజర్వేషన్ బిల్లుకు తమ సపోర్ట్ ఉంటుందని, ప్రభుత్వానికి 100 శాతం తమ మద్దతు ఉంటుందన్నారు. కానీ.. ఆ బిల్లులో ఎలాంటి మార్పులు చేస్తే బాగుంటుందో చెప్పే ప్రయత్నం చేస్తున్నామని కేటీఆర్ పేర్కొన్నారు. ఇప్పటివరకూ సీఎం రేవంత్ రెడ్డి 52 సార్లు ఢిల్లీకి వెళ్లారని, ఆయనకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా బీసీ రిజర్వేషన్ బిల్లు అమలుకోసం అక్కడే ఆమరణ నిరాహార దీక్ష చేయాలని సవాల్ చేశారు. ప్రధాని మోదీ, రాహుల్ కలిసి చర్చిస్తే.. అరగంటలో దీనికి పరిష్కారం లభిస్తుందన్నారు.






