- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నీటివిడుదలకు ఉత్తర్వులు జారీ చేసిన కృష్ణా యాజమాన్య బోర్డు
కృష్ణా జలాల కేటాయింపులపై రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాల నడుమ పంపకాలపై కేఆర్ఎంబీ త్రిసభ్య కమిటీ ఇటీవల కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: కృష్ణా జలాల కేటాయింపులపై రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాల నడుమ పంపకాలపై కేఆర్ఎంబీ త్రిసభ్య కమిటీ ఇటీవల కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల తాగునీటి అవసరాలపై సమాలోచనలు చేసి.. ప్రస్తుత జలాశయాల్లో ఉన్న నిల్వలు, రెండు రాష్ట్రాల అవసరాలు, ఇప్పటికే జరిగిన వినియోగం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని నీటి కేటాయింపులు ఖరారు చేసింది. మిగిలిన వేసవి కాలానికి సంబంధించి నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల నుంచి తాగునీటి విడుదలపై ప్రధానంగా చర్చించారు. తాజాగా.. నీటి కేటాయింపులపై కృష్ణా యాజమాన్య బోర్డు తెలుగు రాష్ట్రాలకు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఆగస్టు 15వ తేదీ వరకూ కేటాయింపులు జరపాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. దీంతో తెలంగాణకు నాగార్జునసాగర్ నుంచి 16 టీఎంసీలు, శ్రీశైలం నుంచి 4.5 టీఎంసీలు కలిపి మొత్తం 21 టీఎంసీలు, ఏపీకి సాగర్ నుంచి 10 టీఎంసీల నీటిని విడుదల చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. కాగా.. ప్రస్తుతం వేసవి తీవ్రతను పరిగణలోకి తీసుకున్న బోర్డు.. ఈ నీటిని కేవలం తాగునీటి అవసరాలకు మాత్రమే వాడాలని, సాగునీటికి మళ్లించకూడదని సూచించింది.
శ్రీశైలం జలాశయం నీటిమట్టం 810 అడుగులకు, నాగార్జునసాగర్ నీటిమట్టం 510 అడుగులకు దిగువకు పడిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని రెండు రాష్ట్రాలకు కమిటీ సూచించింది. అదనంగా నీటి నిల్వలు పెరిగితే, మరిన్ని జలాల విడుదల కోసం త్రిసభ్య కమిటీని ఆశ్రయించవచ్చని పేర్కొంది. అలాగే శ్రీశైలం నుంచి తెలంగాణకు కేటాయించిన నీటిని కేవలం తాగునీటి అవసరాలకే వినియోగించాలని, ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఉత్పత్తి కోసం ఈ నీటిని ఉపయోగించరాదని కేఆర్ఎంబీ స్పష్టం చేసింది. నీటి వినియోగం, విడుదలపై రెండు రాష్ట్రాల చీఫ్ ఇంజినీర్లు సంయుక్త నివేదికలు సమర్పించాలని ఆదేశించింది.






