తెరపైకి కృష్ణా, గోదావరి జలాల రగడ.. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్న ఉత్తమ్

by Kema Shiva Kumar |   (  Updated:2025-12-27 01:51:52  IST  )

వచ్చేనెల 1న రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కృష్ణా, గోదావరి జిల్లాలపై కీలకమైన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు.

తెరపైకి కృష్ణా, గోదావరి జలాల రగడ.. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్న ఉత్తమ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: వచ్చేనెల 1న రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కృష్ణా, గోదావరి జిల్లాలపై కీలకమైన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ముఖ్యంగా నదీజలాల అంశంపై కాంగ్రెస్ నేతలకు ముఖ్యంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు వివరించనున్నారు. ప్రజాభవన్ వేదికగా నిర్వహించే ఈ పీపీటీలో రాష్ట్ర జలవిధానంపై ప్రభుత్వ వైఖరి, గత పాలనలో జరిగిన నిర్ణయాలు, ప్రస్తుతం ఎదురవుతున్న సవాళ్లపై సమగ్రంగా వివరించనున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హాజరుకానున్నారు.

ప్రధానంగా కృష్ణా, గోదావరి నదీజలాలపై అసెంబ్లీలో ప్రజలకు పూర్తిస్థాయిలో వివరించే లక్ష్యంతో.. గత ప్రభుత్వం చేసిన ద్రోహాన్ని వివరించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నది. అలాగే 2, 3వ తేదీల్లో గోదావరి, కృష్ణా జలాలపై అసెంబ్లీలో ఉత్తమ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సైతం ఈ సబ్జెక్టుపై అవగాహన ఉండాలనే ఉద్దేశంతో వారికి ఒకరోజు ముందుగానే ప్రజెంటేషన్ లో వివరించనున్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో జలాల విషయంలో జరిగిన రాజీలను అసెంబ్లీలో గట్టిగా ప్రస్తావించేందుకు, పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఒకే వాయిస్‌తో మాట్లాడేందుకు ఈ ప్రజెంటేషన్‌ను కీలకంగా భావిస్తున్నారు.

పీపీటీలోని ముఖ్యాంశాలు

- కృష్ణా, గోదావరి నదీజలాలపై తెలంగాణకు ఉన్న హక్కులు.

- ఆంధ్రప్రదేశ్‌తో కొనసాగుతున్న జల వివాదాల తాజా పరిస్థితి.

- బ్రిజేష్‌కుమార్ ట్రైబ్యునల్ ముందున్న కేసుల స్థితి.

- గత ప్రభుత్వ నిర్ణయాలతో తెలంగాణకు జరిగిన నష్టం.

- ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు.

- కొత్త ప్రాజెక్టులు, లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంలపై ప్రభుత్వ దృష్టి.

Next Story