మెస్‌ ఇన్‌ఛార్జిపై కోఠి మహిళా కళాశాల విద్యార్థినుల ఫిర్యాదు

by Ramesh Naini |

కోఠి మహిళా విశ్వవిద్యాలయంలో మేస్‌ ఇన్‌ఛార్జి తమను వేధిస్తున్నాడంటూ విద్యార్థినులు షీ టీమ్స్‌కు నేరుగా ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.

మెస్‌ ఇన్‌ఛార్జిపై కోఠి మహిళా కళాశాల విద్యార్థినుల ఫిర్యాదు
X

దిశ, డైనమిక్ బ్యూరో: కోఠి మహిళా విశ్వవిద్యాలయంలో మేస్‌ ఇన్‌ఛార్జి తమను వేధిస్తున్నాడంటూ విద్యార్థినులు షీ టీమ్స్‌కు నేరుగా ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. అతడి ప్రవర్తన వల్ల హాస్టల్‌లో ఉండాలంటే భయంగా ఉందని పీజీ చదువుతున్న విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు తాజాగా బయటకొచ్చిన విద్యార్థినుల ఆడియోలు వైరల్‌గా మారాయి. మేస్‌ ఇన్‌ఛార్జిపై ఇప్పటికే పలుమార్లు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదని వారు ఆరోపించారు. గతంలో హాస్టల్‌ వార్డెన్‌, ప్రిన్సిపల్‌కు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని వాపోయారు. మహిళా విశ్వవిద్యాలయంలోనే ఇలాంటి వేధింపులు చోటుచేసుకోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని విద్యార్థినులు పేర్కొన్నారు.

తమ భద్రతపై సందేహాలు నెలకొన్నాయని, హాస్టల్‌ వాతావరణం భయానకంగా మారిందని చెప్పారు. ప్రిన్సిపల్‌ సైతం స్పందించి తగిన చర్యలు తీసుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమ పేర్లు బయట పెట్టవద్దని విద్యార్థినులు విజ్ఞప్తి చేశారు. షీ టీమ్స్‌కు ఫిర్యాదు చేస్తున్నట్లుగా ఓ విద్యార్థిని ఆడియో రికార్డు వైరల్‌ కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై సంబంధిత అధికారులు స్పందించి వెంటనే విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని విద్యార్థినులు కోరుతున్నారు.

Next Story