దసరా రోజు పూలకించిన సీఎం రేవంత్ రెడ్డి సొంత గ్రామం

by Bhoopathi Nagaiah |

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాకతో కొండారెడ్డిపల్లి గ్రామం అంతా సందడిగా మారింది.

దసరా రోజు పూలకించిన సీఎం రేవంత్ రెడ్డి సొంత గ్రామం
X

దిశ, మహబూబ్ నగర్ బ్యూరో/వంగూరు : రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సొంత గ్రామం వంగూరు మండలంలోని కొండారెడ్డిపల్లి గ్రామంలో గురువారం జరిగిన దసరా ఉత్సవాలలో పాల్గొన్నారు. మధ్యాహ్నం తర్వాత ప్రత్యేక హెలికాప్టర్ లో కొండారెడ్డిపల్లి గ్రామానికి చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ, నేతలు కేబీఎన్ రెడ్డి, చారకొండ వెంకటేష్, వేమారెడ్డి , గ్రామస్తులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఘనస్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక వాహనంలో ఊరేగింపుగా ఆంజనేయస్వామి ఆలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై పూల వర్షం కురిపించి తమ అభిమానాన్ని చాటుకున్నారు.

ఆయన సాయంత్రం వరకు కుటుంబ సభ్యులతో గడిపారు. సాయంత్రం ముఖ్యమంత్రి తన సోదరులు తిరుపతి రెడ్డి, కృష్ణారెడ్డి, మనవడు రియాన్స్ రెడ్డితో కలిసి జమ్మి చెట్టు కు పూజలు చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి.. అన్ని విధాల అభివృద్ధి జరగాలి అని ఆకాంక్షించారు. కార్యక్రమాలకు హాజరైన వారికి, గ్రామస్తులకు ముఖ్యమంత్రి పండగ శుభాకాంక్షలు తెలిపి, రాత్రి 8 గంటల సమయంలో కొడంగల్ నియోజకవర్గానికి రోడ్డు మార్గాన బయలుదేరి వెళ్లారు. ఎన్నికల నియమావళి అమలులో ఉన్న కారణంగా అధికార యంత్రాంగం కార్యక్రమాలకు దూరంగా ఉన్నప్పటికిని ఉమ్మడి పాలమూరు జిల్లా నుండి పెద్ద ఎత్తున కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తరలివచ్చారు. ముఖ్యమంత్రి రాకతో కొండారెడ్డిపల్లి గ్రామం అంతా సందడిగా మారింది.

Next Story