- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ISKCON: ఇస్కాన్ దేవాలయం నిర్మాణంతో ఆధ్యాత్మిక సేవలు : కొండా సురేఖ
నలగండ్లలో నిర్మించబోయే అతిపెద్ద ఇస్కాన్ దేవాలయం నిర్మాణానికి సంబంధించిన భూమి పూజ కార్యక్రమం దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చేతుల మీదుగా వైభవంగా జరిగింది.

దిశ, తెలంగాణ బ్యూరో: సైబరాబాద్ పరిధిలోని నలగండ్లలో నిర్మించబోయే అతిపెద్ద ఇస్కాన్ దేవాలయం నిర్మాణానికి సంబంధించిన భూమి పూజ కార్యక్రమం రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చేతుల మీదుగా అంగరంగ వైభవంగా జరిగింది. ఇస్కాన్ సంస్థ ప్రతినిధులు మంత్రి కొండా సురేఖకు ఘన స్వాగతం పలికారు. అర్చకులు వేద మంత్రాల నడుమ కొండా సురేఖ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఇస్కాన్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఆధ్యాత్మికత, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోందని తెలిపారు. భారతీయ సంస్కృతిని ప్రపంచవ్యాప్తంగా విస్తరించడంలో వారి పాత్ర గొప్పదని కొనియాడారు. వారు కృష్ణతత్వాన్ని బోధించడంతో పాటుగా పేదవారికి ఆకలి తీర్చడం ఎంతో గొప్ప విషయమన్నారు.
ఈ దేవాలయ నిర్మాణానికి సంబంధించిన భూమి పూజ కార్యక్రమంలో నేను పాల్గొనడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని తెలిపారు. గత ప్రభుత్వంలో దేవాలయ నిర్మాణానికి సంబంధించిన భూమి కోసం కాళ్లు అరిగేలా తిరిగారని అయినా వారికి స్థలం కేటాయించలేదని ఆరోపించారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజుల్లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవ తీసుకొని ఇస్కాన్ దేవాలయం నిర్మాణం కోసం 6000 గజాల భూమిని 22 సంవత్సరాల పాటు లీజ్‌పై కేటాయించినట్లు తెలిపారు. ఇస్కాన్ దేవాలయం నిర్మాణంతో ఆధ్యాత్మిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు మరింత విస్తరించి సమాజానికి మేలు జరుగుతుందన్న విశ్వాసం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి, నాయకులు జగదీశ్వర్ రెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఇస్కాన్ భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






