అంతా తూచ్.. సినిమా టికెట్‌ ధరలు పెంపుపై మాట మార్చిన మంత్రి కోమటిరెడ్డి

by Prasad Jukanti |

సినిమా ఇండస్ట్రీ విషయాలను పట్టించుకోవడం లేదని మాట్లాడిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తాజాగా యూ టర్న్ తీసుకున్నారు.

అంతా తూచ్..  సినిమా టికెట్‌ ధరలు పెంపుపై మాట మార్చిన మంత్రి కోమటిరెడ్డి
X

దిశ, డైనమిక్ బ్యూరో: సినిమా టికెట్ ధరల పెంపుపై (Film Ticket Price Hike) సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy Venkat Reddy) మాట మార్చారు. తాను సినీ పరిశ్రమ గురించి పట్టించుకోవడమే మానేశానని టికెట్ ధరల పెంపు గురించి వస్తున్న జీవోలకు నాకు ఎలాంటి సంబంధం లేదని మొన్న సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి ఇవాళ అందుకు భిన్నంగా మాట్లాడారు. టికెట్ ధరల పెంపు విషయంలో అంతా కూర్చొని మాట్లాడుకున్న తర్వాతే నిర్ణయం తీసుకున్నామని అన్నారు. పుష్ప-2 ఘటన తర్వాత టికెట్ ధరల పెంపునకు అనుమతి ఇవ్వబోమని నేను, ముఖ్యమంత్రి ప్రకటించిన మాట వాస్తవమేనని అయితే ఆ తర్వాత తామంతా మాట్లాడుకుని నిర్ణయాన్ని సవరించుకున్నామన్నారు. ఒక వేళ టికెట్ ధరలు పెంచాల్సి వస్తే 20 శాతం సినీ కార్మికుల సంక్షేమానికి ఇవ్వాలనే షరతుతో టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతి ఇస్తున్నామన్నారు. ఇందుకు అనుగుణంగా ఇటీవల కొన్ని సినిమాలకు హైక్ ఇస్తే కోర్టు అభ్యంతరం వ్యక్తం చేసిందని ఆ సమయంలో తాను హైదరాబాద్ లో లేనన్నారు. అయితే తనకు తెలియకుండానే టికెట్ ధరలు పెంచుతున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేయడంపై మాజీ మంత్రి హరీశ్ రావు స్పందిస్తూ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పరిస్థితి చూస్తే జాలేస్తోందని అన్నారు. హరీశ్ రావు చేసిన ఈ వ్యాఖ్యలపై తాజాగా ఓ న్యూస్ చానల్ తో మాట్లాడుతూ ఈ విధంగా స్పందించారు.

మిమ్మల్ని చూస్తే జాలేస్తోంది:

మంత్రిని చూస్తే జాలేస్తోందన్న వ్యాఖ్యలపై స్పందించిన కోమటిరెడ్డి.. మా మీద కాదు మిమ్మల్ని చూస్తేనే మాకు జాలేస్తోందన్నారు. పదేళ్లు అధికారంలో ఉండి ఒక్క ఎంపీ సీటు గెలవలేదని, సిద్దిపేటలో కూడా రెండువేల మెజారిటీ బీజేపీకి వచ్చిందన్నారు. సర్పంచ్ ఎన్నికల్లో 20 శాతం కూడా గెలవలేదని విమర్శించారు. ఇది సర్కారా సర్కసా అని హరీశ్ రావు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని వారి మాటలకు సమాధానం ఇచ్చేందుకు మాకు సమయం లేదన్నారు. బీఆర్ఎస్ నేతలకు పని లేదని అందువల్లే ప్రతిరోజు విమర్శలు చేస్తోందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రుల శాఖల్లో జోక్యం చేసుకోరని వైఎస్ఆర్ మాదిరిగా అందరిని కలుపుకుపోతారని చెప్పారు.

మంత్రిగారు ఇదేం పని:

కాగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వెంకట్ రెడ్డి రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పేరు. ఉమ్మడి రాష్ట్రంలోనే మంత్రిగా చేసిన కోమటిరెడ్డి తెలంగాణ ఏర్పడ్డాక తొలిసారి కేబినెట్ లోకి అడుగుపెట్టారు. అయితే విషయం ఏదైనా తన రూట్ సపరేటు అని చాటుకునే కోమటిరెడ్డి వైఖరి ఇటీవల సొంత పార్టీ నేతలు, అభిమానులకు షాక్ ఇస్తోంది. ముందు ఏది పడితే అది మాట్లాడటం ఆ తర్వాత నాలుక మడతెట్టడం రివాజు అన్నట్లుగా ఆయన తీరు మారిపోయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. సినిమా టికెట్ ధర పెంపు విషయంలో తన వద్దకు ఎవరూ రావడం లేదని నేనసలు ఆ శాఖను పట్టించుకోవడమే మానేశానని బహిరంగంగానే చెప్పిన కోమటిరెడ్డి ఇప్పుడు మాట మార్చడం చర్చగా మారింది. ఇదిలా ఉంటే గత నెలలోనూ మంత్రి వ్యవహరించిన తీరు ఇదే రకంగా విమర్శలు వ్యక్తం అయ్యాయి. పవన్ కల్యాణ్ కోనసీమ కొబ్బరి చెట్లు-నరదృష్టి వ్యాఖ్యలపై స్పందిస్తూ పవన్ కల్యాణ్ భేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసిన వెంకట్ రెడ్డి ఆ తర్వాత మూడు రోజులకే విజయవాడకు వెళ్లి మాట మార్చారు. అప్పటి పరిస్థితులను బట్టి తాను అలా మాట్లాడానని నేను ఎవరిని విమర్శించనంటూ కామెంట్ చేశారు. దీంతో ఒకే విషయంలో రోజుకా మాట పూటకో డైలాగ్ తో కోమటిరెడ్డి రాజకీయాల్లో తనకున్న బ్రాండ్ ను తానే విమర్శల పాలు చేసుకుంటున్నారనే టాక్ వినిపిస్తోంది.

Next Story