నల్లగొండలో కోమటిరెడ్డి మార్క్ అభివృద్ధి.. తెల్లవారుజాము నుంచే యాక్షన్‌లోకి

by Kema Shiva Kumar |   (  Updated:2026-02-17 02:24:12  IST  )

నల్లగొండను సూపర్ స్మార్ట్ సిటీగా మార్చేందుకు మంత్రి కోమటిరెడ్డి ప్రకాశం బజార్‌లో రోడ్ల వెడల్పు, ఆక్రమణల తొలగింపు పనులను స్వయంగా పర్యవేక్షించారు.

నల్లగొండలో కోమటిరెడ్డి మార్క్ అభివృద్ధి.. తెల్లవారుజాము నుంచే యాక్షన్‌లోకి
X

దిశ, వెబ్‌డెస్క్/నల్గొండ టౌన్: జిల్లా కేంద్రాన్ని ‘సూపర్ స్మార్ట్ సిటీ’గా మార్చడమే లక్ష్యంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy Venkat Reddy) అభివృద్ధి పనుల్లో వేగం పెంచారు. నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో జరుగుతున్న రోడ్డు వెడల్పు, పారిశుధ్య పనులను మంత్రి స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్నారు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రక్రియ ముగిసి, మేయర్ ఎన్నిక పూర్తి కాగానే మంత్రి కోమటిరెడ్డి నగర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. మంగళవారం తెల్లవారుజామున 4 గంటల నుంచే ఆయన అధికారులతో కలిసి నగరంలోని ప్రధాన వీధుల్లో పర్యటించారు. ముఖ్యంగా అత్యంత రద్దీగా ఉండే ప్రకాశం బజార్ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా పనులను ముమ్మరం చేశారు.

ప్రకాశం బజార్‌లో ఆక్రమణల తొలగింపు..

నగరంలో ప్రధాన వ్యాపార కూడలి అయిన ప్రకాశం బజార్‌ (Prakasam Bazar)లో రోడ్లు ఇరుకుగా ఉండటంతో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని గుర్తించిన మంత్రి, సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారు. జేసీబీలతో ఆక్రమణలను తొలగించి, రోడ్లను వెడల్పు చేసే పనులను దగ్గరుండి పర్యవేక్షించారు. రద్దీని దృష్టిలో ఉంచుకుని డివైడర్లను తొలగించాలని, తక్షణమే సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టాలని ఆదేశించారు. ఇకపై విద్యుత్ తీగల ఇబ్బంది లేకుండా భూగర్భ విద్యుత్ వ్యవస్థను (Underground Cabling) ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. రోడ్డు వెడల్పు వల్ల పూలు, పండ్ల వ్యాపారులు ఉపాధి కోల్పోకుండా మంత్రి మానవీయ కోణంలో నిర్ణయం తీసుకున్నారు. వ్యాపారులందరికీ ప్రత్యామ్నాయం చూపిస్తామని అన్నారు. పాత కలెక్టరేట్ కార్యాలయ స్థలంలో తక్షణమే సిసి ఫ్లోరింగ్ పూర్తి చేసి, వారికి కేటాయించాలని అధికారులను ఆదేశించారు.

హర్షం వ్యక్తం చేస్తున్న స్థానికులు..

ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కాని ట్రాఫిక్ (Traffic) సమస్యపై మంత్రి కోమటిరెడ్డి స్పందించిన తీరు పట్ల స్థానిక వ్యాపారులు, ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నల్లగొండను స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దే ఈ అభివృద్ధి యజ్ఞంలో తామంతా మద్దతుగా ఉంటామని వ్యాపార సంఘాల ప్రతినిధులు ప్రకటించారు. ఈ పర్యటనలో మున్సిపల్, ఆర్ అండ్ బీ, ఎలక్ట్రిసిటీ, టౌన్ ప్లానింగ్ విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Next Story