Komati Reddy : సీఎం రేవంత్ రెడ్డిపై కోమటిరెడ్డి మరోసారి హాట్ కామెంట్స్

by Prasad Jukanti |

ఎమ్మెల్యే కోమటిరెడ్డి తీరు కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాశంగా మారింది.

Komati Reddy :  సీఎం రేవంత్ రెడ్డిపై కోమటిరెడ్డి  మరోసారి హాట్ కామెంట్స్
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ పాలిటిక్స్ లో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Rajagopal Reddy) వ్యవహారం హాట్ టాపిక్ గా మారుతోంది. మంత్రి పదవిని ఆశించి భంగపడిన ఆయన ఇటీవల తరుచుగా చేస్తున్న వ్యాఖ్యలు పొలిటికల్ హీట్ పెంచుతున్నాయి. పదేళ్లు ముఖ్యమంత్రిగా తానే ఉంటానని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) చేసిన వ్యాఖ్యలపై ఇప్పపటికే ఎక్స్ వేదికగా ఇప్పటికే అభ్యంతరం చెప్పిన రాజగోపాల్ రెడ్డి తాజాగా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘మనకీ మంచిరోజులు రాబోతున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరు తప్పు మాట్లాడినా నిర్మోహమాటంగా చెప్పేస్తాననని తాను ఏదైనా ఓపెన్ గానే మాట్లాడతానన్నారు. మొన్న రేవంత్ రెడ్డి మాటలు తప్పని చెప్పానని తప్పు చేస్తే అది నేనైనా మరెవరైనా ఒక్కటేనన్నారు. ఓ యూట్యూబ్ చానల్ తో మాట్లాడిన ఆయన.. రైతుభరోసా అందరికీ రాలేదని కొందరికే వచ్చిందని అంగీకరించారు. మిగతా వారికి కూడా రైతుభరోసా ఇవ్వాలని ప్రభుత్వానికి ఉందని కానీ ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి వల్ల ఆలస్యం అవుతున్నదన్నారు.

కొరకరాని కొయ్యగా కోమటిరెడ్డి!:

ఇటీవల కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీరు కాంగ్రెస్ పార్టీలో దుమారం రేపుతోంది. మంత్రి పదవి ఆశించినా దక్కకపోవడంతో ఆయన ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నారని సొంతపార్టీలోనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అయితే రాజగోపాల్ రెడ్డి మాత్రం వెనక్కి తగ్గడం లేదు. మొన్న ముఖ్యమంత్రిపై కామెంట్స్ చేసిన ఆయన రెండు రోజుల క్రితం నాకు మంత్రి పదవి ముఖ్యం కాదని తనకు తన నియోజకవర్గం ప్రజలే ముఖ్యం అన్నారు. ఇప్పుడు మనకు మంచి రోజులు రాబోతున్నాయని వ్యాఖ్యానించారు. అంతటితో ఆగకుండా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 9 రోజుల్లో రూ.9 వేల కోట్లు రైతుభరోసా కింద అన్నదాతల ఖాతాల్లో వేశామని చెప్పుకుంటుంటే రాజగోపాల్ రెడ్డి మాత్రం అందరికీ రైతుభరోసా అందలేదని చెప్పడం ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడమేననే టాక్ పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. రాజగోపాల్ రెడ్డి తీరు అధికార పక్షంలో రానురాను కొరకరాని కొయ్యగా మారుతోందనే చర్చ రాజకీయ వర్గాల్లో వ్యక్తం అవుతోంది. మరి కోమటిరెడ్డి బ్రదర్ ను సీఎం రేవంత్ రెడ్డి ఎలా కంట్రోల్ చేయబోతున్నారనేది ఉత్కంఠగా మారింది.

Next Story