తెలంగాణ మోడల్ పాలన అదేనా? సీఎం కేసీఆర్ పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఫైర్

by Disha Web Desk 4 |
తెలంగాణ మోడల్ పాలన అదేనా? సీఎం కేసీఆర్ పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఫైర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: ముఖ్యమంత్రి కేసీఆర్ నిత్యం చైనా, బంగ్లాదేశ్, పాకిస్తాన్ దేశాలతో భారత్ ను పోలుస్తున్నారని, ఆయనకు అక్కడి పరిస్థితులు అంత బాగున్నాయనకుంటే ఆయన కుటుంబంతో కలిసి రెండు నెలల పాటు పాకిస్తాన్ లోకానీ, బంగ్లాదేశ్ లో కానీ వెళ్లి ఉండాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. అప్పుడు కానీ ఏ దేశ పరిస్థితి బాగుందో లేదో అనే క్లారిటీ కేసీఆర్ కు వస్తుందని ఎద్దేవా చేశారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం పండిట్ దీన్ దయాళ్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ తో పాటు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

హుజూరాబాద్ ఎన్నికల తర్వాత కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోడీపై టీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు. ఇక్కడ ఆయన పార్టీకి చెందిన నాయకులనే అపాయింట్ మెంట్ ఇవ్వని వ్యక్తి.. దేశాన్ని ఉద్ధరిస్తానని వేరే రాష్ట్రాల నాయకుల్ని కలవడం విడ్డూరంగా ఉందని విమర్శలు చేశారు. ఇతర రాష్ట్రాల నేతలను కలిసి వచ్చిన ప్రతిచోట కేసీఆర్ కు అవమానమే జరిగిందన్నారు. సీఎం కేసీఆర్ తో భేటీ మాటలను ఎవరూ నమ్మడం లేదని, భేటీ అయిన వ్యక్తులే కేసీఆర్ వ్యాఖ్యాలను ఖండిస్తున్నారన్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దిగజారిందని కిషన్ రెడ్డి అన్నారు. రూ.5 లక్షల కోట్ల అప్పుల్లో తెలంగాణ ఉందన్నారు. ఇంకా అప్పులు కావాలంటూ కేంద్రాన్ని బ్లాక్ మెయిల్ చేస్తున్నారన్నారు. ఎన్నో పథకాలకు డబ్బులిచ్చే పరిస్తితి రాష్ట్రంలో లేకుండా పోయిందని మండిపడ్డారు. జీహెచ్ఎంసీలో పనులు చేసే చిన్న కాంట్రాక్టర్లకు కూడా డబ్బులు ఇవ్వలేని దుస్థితి నెలకొందన్నారు.

కాంట్రాక్టర్లు జీహెచ్ఎంసీ ఆఫీస్ ఎదుట ధర్నా చేసి డబ్బులు అడగాల్సిన స్థితికి ప్రభుత్వం తీరు చేరుకుందన్నారు. కేసీఆర్.. కేంద్రానికి నీతులు వల్లించాల్సిన పని లేదని, రాష్ట్రం పరిస్థితులు చక్కదిద్దుకుంటే చాలని సెటైర్లు వేశారు. గ్రామాలకు కేంద్రం నుంచి వచ్చే నిధుల కోసం సర్పంచ్ లను రాష్ట్ర ప్రభుత్వం బెదిరిస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. సర్పంచ్ లు నరకం అనుభవిస్తున్నారని వాపోయారు. ధరణిని ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్నామని చెప్పిన కేసీఆర్.. దానివల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులను ఎందుకు గుర్తించడం లేదని ప్రశ్నించారు. కొండను తవ్వి ఎలుకను పట్టుకున్నట్లుగా ధరణి తీరు తయారైందని విమర్శలు చేశారు. ధరణితో కుంభకోణాలు, ఆక్రమణలు, అక్రమాలు తప్పా ప్రజలకు ఉపయోగపడటం లేదని ధ్వజమెత్తారు. 4 లక్షల మందికి ధరణి కారణంగా అన్యాయం జరిగిందని దరఖాస్తులు పెట్టుకున్నారన్నారు.

రాష్ట్రంలో ప్రభుత్వ భూముల కబ్జా యథేచ్ఛగా సాగుతున్నా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను కేంద్రంపై నెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతి, అహంకార పాలన సాగిస్తున్నారన్నారు. హుజూరాబాద్ కోసం దళిత బంధు, మునుగోడు కోసం గిరిజన బంధును తీసుకొచ్చారని, అయితే కేసీఆర్ కు చిత్తశుద్ధి ఉంటే ముందు దళితులందరికీ దళిత బంధు ఇవ్వాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ వచ్చిన తర్వాత రేషన్ కార్డులు ఇవ్వలేని అసమర్థ ప్రభుత్వం కేసీఆర్ ది అని దుయ్యబట్టారు. తెలంగాణ వచ్చి ఎనిమిదేండ్లు పూర్తయినా ఆంధ్రప్రదేశ్ పేరుతోనే రేషన్ కార్డులున్నాయన్నారు. జెన్ కో, ట్రాన్స్ కో, డిస్కంలు కూడా అప్పుల్లో కూరుకుపోయాయని, రాష్ట్ర ప్రభుత్వం ఇలానే వ్యవహరిస్తే విద్యుత్ ఉత్పత్తి చేయలేని పరిస్థితి నెలకొనడం ఖాయమన్నారు.

మోటార్లకు మీటర్లు పెడతామని కేంద్రం ఎక్కడా చెప్పలేదని, డిస్కంలను అప్పుల్లోంచి బయటపడేయడమే కేంద్రం లక్ష్యమని చెప్పారు. విద్యుత్ సంస్థలు నష్టపోతే కరెంట్ సరఫరా నిలిచిపోతుందని, అలాంటి సమస్యలు రావొద్దనేదే కేంద్రం తాపత్రయంగా చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కేవలం ఆయన కుటుంబం, ప్రగతి భవన్ గురించి మాత్రమే ఆలోచిస్తాడని, తాము మేకిన్ ఇండియా గురించి ఆలోచిస్తామని కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణలో 5 లక్షల మందికి ముద్ర లోన్స్ ఇచ్చిన ఘనత కేంద్రానిదని ఆయన చెప్పారు. బీసీ, ఎస్సీ మైనారిటీ కార్పొరేషన్ లో ఈగలు తోలుకునే వాళ్ళు కూడా లేరని, వాటి పరిస్థితి మరీ అధ్వానంగా తయారైందని ఆగ్రహం వ్యక్తంచేశారు. కేసీఆర్ కుటుంబం పెద్ద డ్రామా కంపెనీ గా రాష్ట్రానికి తయారైందన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే గిరిజనలకు 10 శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఇక మంత్రి కేటీఆర్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని సెటైర్లు వేశారు. కేవలం రెండు రోజులు అసెంబ్లీ నిర్వహించడం తెలంగాణ మోడల్ పాలనా అంటూ ఫైరయ్యారు.

Next Story

Most Viewed