- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రేవంత్ రెడ్డి ప్రతిపాదన అంబేద్కర్ విధానానికి వ్యతిరేకం: డీలిమిటేషన్‌పై కిషన్ రెడ్డి స్పందన
నియోజకవర్గాల పునర్విభజన (Delimitation) అంశంపై సాగుతున్న చర్చల నేపథ్యంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: నియోజకవర్గాల పునర్విభజన (Delimitation) అంశంపై సాగుతున్న చర్చల నేపథ్యంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. డీలిమిటేషన్ ప్రక్రియ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి అన్యాయం జరగదని, దేశంలోని అన్ని రాష్ట్రాలకు సమన్యాయం చేయాలన్నదే కేంద్ర ప్రభుత్వ విధానమని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపాదించిన హైబ్రిడ్ నమూనాను కిషన్ రెడ్డి తప్పుపట్టారు. అసలు అలాంటి నమూనా ఎక్కడా లేదని ఆయన కొట్టిపారేశారు. "తెలంగాణలో కూడా ఇదే హైబ్రిడ్ విధానాన్ని అమలు చేస్తారా? జనాభా ప్రాతిపదికన కాకుండా వేరే లెక్కలు తీస్తే.. రేపు ఆదిలాబాద్‌కు సీట్లు తగ్గించి, హైదరాబాద్‌కు పెంచుతారా?" అని ముఖ్యమంత్రిని నిలదీశారు. రేవంత్ రెడ్డి ప్రతిపాదనలు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయాలకు, విధానాలకు వ్యతిరేకమని కిషన్ రెడ్డి విమర్శించారు. జనాభా ప్రాతిపదికన కాకుండా ఆర్థిక వనరుల ఆధారంగా సీట్లు కేటాయించడం ప్రజాస్వామ్య విరుద్ధమన్నారు.
ఆదాయం ప్రాతిపదికన కుదరదు...
తెలంగాణ ఆదాయంలో 70 శాతం హైదరాబాద్ నుంచే వస్తోంది. అలాగని 70 శాతం సీట్లు హైదరాబాద్ పరిసరాల్లోనే ఉండాలా? అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి చెప్పినట్లు ఆర్థిక వనరులు, ఇతర అంశాలను ప్రాతిపదికగా తీసుకుంటే దక్షిణాది కంటే గుజరాత్ వంటి రాష్ట్రాలకే ఎక్కువ సీట్లు వస్తాయని ఆయన ఎత్తిచూపారు. కేంద్రం తీసుకునే ఏ నిర్ణయమైనా అన్ని ప్రాంతాల ప్రయోజనాలను కాపాడేలా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ వితండ వాదాన్ని రేవంత్ రెడ్డి పక్కనబెట్టి బిల్లుకు సహకరించాలని కిషన్ రెడ్డి సూచించారు. జనగణనతో పాటే కులగణన కూడా చేపట్టబోతున్నాం. ఈ ప్రక్రియకు చాలా సమయం పట్టే అవకాశం ఉందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.






