ముంచుకొస్తున్న ఖరీఫ్ సీజన్.. పంట పెట్టుబడి కోసం అన్నదాతల అరిగోస

by Kema Shiva Kumar |

వానాకాలం సీజన్​ ప్రారంభం కానుండడంతో పంట పెట్టుబడుల కోసం అన్నదాతలు అప్పుల వేటలో పడ్డారు.

ముంచుకొస్తున్న ఖరీఫ్ సీజన్.. పంట పెట్టుబడి కోసం అన్నదాతల అరిగోస
X

దిశ, తెలంగాణ బ్యూరో: వానాకాలం సీజన్​ ప్రారంభం కానుండడంతో పంట పెట్టుబడుల కోసం అన్నదాతలు అప్పుల వేటలో పడ్డారు. పంట కాలం​ముంచుకొస్తుండటంతో చివరి సమయానికి అప్పులు పుట్టవని ముందుగానే వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. గతంలో ప్రభుత్వం నుంచి పెట్టుబడి సాయం అందడంతో రైతులకు అప్పుల తిప్పులు ఉండేవికాదు. ప్రస్తుతం అన్నదాతలకు సాయం అందడంపై అనుమానాలు ఉండటంతో ముందుస్తుగా వారికి దొరికిన చోట వడ్డీ ఎక్కువైనా రుణాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో రైతులు వరి, పత్తి విత్తనాలు కొనుగోలు చేశారు. మరికొందరు రైతులు బ్యాంకుల వద్ద పంట రుణాలు తీసుకునేందుకు అధికారులను ఆశ్రయిస్తున్నారు. గతంలో రుణాలు తీసుకొని సకాలంలో చెల్లించామని, ప్రస్తుతం రుణాలు ఇవ్వాలని బ్యాంకర్లను కోరుతున్నారు. రైతు భరోసా ప్రభుత్వం పంపిణీ చేస్తే ఇలాంటి బాధలు ఉండవని అంటున్నారు. ఇప్పటికే గత వానాకాలం పెట్టుబడి సాయం నాలుగు విడుతలో మూడున్నర ఎకరాలకుపై పంపిణీ చేశారు. యాసంగి సీజన్​పెట్టుబడి సాయం ఇప్పట్లో రావడం కష్టమని రైతులు వడ్డీ వ్యాపారులు చుట్టూ తిరిగే పరిస్థితి వచ్చింది.

వానాకాలంలో సాగు ఇలా..

వానాకాలం 2025లో 66.80 లక్షల ఎకరాలలో వరి, 6 లక్షల ఎకరాలలో మొక్కజొన్న, 50 లక్షల ఎకరాలలో ప్రత్తి, 9 లక్షల ఎకరాలలో సోయా చిక్కుడు సాగయ్యే అవకాశముందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. అందుకోసం 16.70 లక్షల క్వింటాళ్ల వరి విత్తనాలు, 0.48 లక్షల మొక్కజొన్న, 89 లక్షల పత్తి ప్యాకెట్లు, 1.35 లక్షల క్వింటాళ్ల సోయాచిక్కుడు విత్తనాలు జిల్లాలకు సరఫరా చేస్తోంది.

రుణమాఫీ కాని రైతుల అరిగోస

రాష్ట్రంలో గడిచిన వానాకాలం, యాసంగి సీజన్‌లో బ్యాంకులు 39.60 లక్షల మంది రైతులకు రూ.66,350 కోట్ల పంట రుణాలు మంజూరు చేశాయి. వాటిలో రూ.2లక్షల లోపు రుణాలను ప్రభుత్వం మాఫీ చేసింది. వారంతా మళ్లీ రుణాల కోసం బ్యాంకుల బాటపట్టారు. రుణాలు మాఫీ కానీ అన్నదాతలు ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. ప్రభుత్వం కొంతమందికే రుణమాఫీ చేయడంపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రూ.2 లక్షలకుపైగా రుణాలు ఉన్న రైతులు రెండు లక్షలకు పైగా ఉన్న డబ్బులు చెల్లిస్తే ఆ లోపు ఉన్న రుణం మాఫీ చేస్తామని ప్రభుత్వం ప్రకటన చేయడంతో చాలా మంది రైతులు అప్పు చెల్లించారు. మూడు నెలల తరువాత వ్యవసాయ శాఖ మంత్రి రెండు లక్షలకుపైగా రుణాలు మాఫీ చేయడం లేదని అసెంబ్లీలో వెల్లడించారు. రుణాలు మాఫీ కాక, కొత్త అప్పు పుట్టక రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. గత పదేళ్లు ఏనాడూ రుణాల కోసం ఇంత కష్టాలు పడలేదని, ఈ వానాకాలం నుంచి అధిక వడ్డీలకు అప్పులు తీసుకోక తప్పడం లేదని వాపోతున్నారు.

రైతు భరోసా ఇలా..

మొదటి విడుతలో ఎకరం వరకు 17.03 లక్షల మంది రైతులకు 9.29 లక్షల సాగుభూమికి రూ.557.54 కోట్లు, రెండో విడుతలో 13.23 లక్షల మంది రైతులకు 18.19 లక్షల ఎకరాలకు రూ.1091.95 కోట్లు, మూడో విడుతలో 10.13 లక్షల మంది రైతులకు 21.12 లక్షల ఎకరాలకు రూ.1269.32 కోట్లు జమ చేసింది.

Next Story