బిగ్‌షాట్స్ కనుసన్నల్లో ఖానామెట్..! అసైన్డ్ భూముల్లో యథేచ్ఛగా హైరైజ్ బిల్డింగ్స్

by Kema Shiva Kumar |   (  Updated:2025-10-31 02:07:19  IST  )

రాష్ట్రంలో అసైన్డ్ భూములు అమ్మొద్దు.. కొనొద్దు.. కానీ రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ అధికారులు డబుల్ గేమ్ ఆడుతున్నారు.

బిగ్‌షాట్స్ కనుసన్నల్లో ఖానామెట్..! అసైన్డ్ భూముల్లో యథేచ్ఛగా హైరైజ్ బిల్డింగ్స్
X

దిశ, తెలంగాణ బ్యూరో/శేరిలింగంపల్లి: రాష్ట్రంలో అసైన్డ్ భూములు అమ్మొద్దు.. కొనొద్దు.. కానీ రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ అధికారులు డబుల్ గేమ్ ఆడుతున్నారు. ఓ దగ్గరేమో క్రయవిక్రయాలు నిషేధం అంటారు. మరోచోట మొదట ఏజీపీఏ.. ఆ తర్వాత వరుసగా సేల్ డీడ్స్. ఈ వింత ధోరణే అక్రమార్కుల పాలిట వరంగా మారింది. దీంతో హైటెక్ సిటీ దగ్గర రిజిస్ట్రేషన్లు జోరుగా సాగుతున్నాయి. దీని వెనుక అంతులేని అవినీతి ఉందన్నది వాస్తవం. అందుకే మొయినాబాద్, శంకర్‌పల్లి, షాబాద్ మండలాల్లో ప్రజాప్రయోజనాల పేరిట అసైన్డ్ భూములను ప్రభుత్వం సేకరిస్తున్నది. అసైనీలకు నామమాత్రంగా కొంత స్థలాన్ని కట్టబెట్టేందుకు ఒప్పందాలు చేసుకుంటున్నది. కానీ, హైటెక్ సిటీ పక్కనే ఉన్న అసైన్డ్ ల్యాండ్స్‌లో మాత్రం అనుమతులు లేకుండా హైరైజ్ బిల్డింగ్స్ నిర్మిస్తుంటే రెవెన్యూ, జీహెచ్ఎంసీ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, రెరా, విజిలెన్స్, ఏసీబీ అధికారులు పట్టించుకోవడం లేదు. ఎందుకంటే వాటి వెనుక బడా లీడర్లు ఉన్నారన్న విమర్శలొస్తున్నాయి. ఈ బిల్డింగ్ యజమానుల బంధుగణమే అందుకు సాక్ష్యంగా నిలుస్తోంది. ఒక్కో బిల్డింగ్ యజమాని, ఆయన స్వస్థలం, బంధుమిత్రుల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ మంత్రుల రిలేషన్స్ కనిపిస్తాయి. తాము ఫలానా బంధువులం అని చెప్పగానే రెవెన్యూ యంత్రాంగం కేవలం నోటీసులతో వెనక్కి తగ్గుతున్నారని సమాచారం. శేరిలింగంపల్లి మండలం ఖానామెట్ అసైన్డ్ ల్యాండ్స్ వెనుక పెద్దఎత్తున పొలిటికల్ మాఫియా ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందుకే నిర్మాణం మొదలు పెట్టినప్పటి నుంచి పూర్తయ్యే వరకు ఏ శాఖ అధికారి కూడా అటువైపు వెళ్లడం లేదు. ఆ తర్వాత ఫిర్యాదులొచ్చినా కూల్చే సాహసం చేయట్లేదు. ఇదే ఖానామెట్ అసైన్డ్ భూముల అసలు కథ..

మాదాపూర్‌లో వీరంగం

ప్రభుత్వ భూముల పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్నాం.. ఎక్కడ అన్యాక్రాంతం జరిగినా ఉపేక్షించేది లేదంటూ తరచూ రెవెన్యూ అధికారులు చెబుతూ ఉంటారు. కానీ ఇదంతా కేవలం పేదల విషయంలో మాత్రమే. కానీ, బడాబాబులు ఎకరాలకు ఎకరాలు కబ్జాలు చేస్తున్నా రెవెన్యూ యంత్రాంగం చోద్యం చూస్తుందే కానీ చర్యలు తీసుకోరన్న విమర్శలున్నాయి. అందుకు ఖానామెట్ భూముల కబ్జాలే నిదర్శనం. గతంలో మాదాపూర్ పరిధిలో ప్రభుత్వ భూముల్లో పేదలు వేసుకున్న గుడిసెలను అధికార యంత్రాంగం రాత్రికి రాత్రి బుల్డోజర్లతో నేలమట్టం చేసింది. కానీ పెద్దల జోలికి మాత్రం వెళ్లేందుకు మీనమేషాలు లెక్కిస్తున్నది. ఖానామెట్ గ్రామ పరిధిలో రూ. వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను కొందరు చెరపడుతున్నా రెవెన్యూ యంత్రాంగం ఎందుకో మిన్నకుండి చూస్తున్నది. గజం రూ.లక్షలు పలికే ఖానామెట్‌లో ప్రభుత్వ భూములు కబ్జాలకు గురయ్యాయి. అందులోనే అనేక వాణిజ్య సముదాయాలను నిర్మిస్తూ అద్దెలకు ఇచ్చుకుంటూ నెలకు రూ.లక్షల్లో సంపాదిస్తున్నారు కబ్జాదారులు.

వియ్యంకుల పేరిట..

ఖానామెట్ సర్వే నం.41లో గతేడాది ఓ వాణిజ్య భవన నిర్మాణం పూర్తయ్యింది. దాని యాజమాని స్వస్థలం ఆంధ్రా. బంధుగణం ఎవరని ఆరా తీస్తే ఓ ఎమ్మెల్యేకు స్వయాన వియ్యంకుడు. అందుకే పునాది రాయి పడ్డప్పటి నుంచి అధికారులెవరూ అటువైపు కన్నెత్తి చూడలేదు. ఇప్పుడేమో ఆ వాణిజ్య భవనం అధికారుల వ్యవహార శైలిని, అధికారాన్ని వెక్కిరిస్తున్నది. ఇలా ప్రతి బిల్డింగ్ వెనుక ఓ మంత్రి, ఓ మాజీ మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేల పేరు వినబడుతోంది. అందుకే కూల్చివేతల మాట అటుంచితే కనీసం అసైన్డ్ భూములు వారికి ఎలా వచ్చాయో లెక్కలు తీసిన దాఖలాలు లేవు. తాము అసైన్డ్ భూములు కొన్నామంటే.. ఆ రిజిస్ట్రేషన్ చేసిన సబ్ రిజిస్ట్రార్, మ్యుటేషన్ చేసిన తహశీల్దార్, నిర్మాణపు అనుమతులు జారీ చేసిన టౌన్ ప్లానింగ్ అధికారులపై ఎలాంటి చర్యలు ఇప్పటివరకూ లేవు. అదే సామాన్యులు గుడిసెలు వేస్తే పెద్ద సంఖ్యలో బుల్డోజర్లు, పోలీసు బందోబస్తు వచ్చేస్తుందన్న విమర్శలు శేరిలింగంపల్లి డిప్యూటీ తహశీల్దార్, డిప్యూటీ కలెక్టర్, రాజేంద్రనగర్ ఆర్డీవో, రంగారెడ్డి కలెక్టర్ల మీద వినిపిస్తున్నాయి.

ప్రభుత్వ భూములు కబ్జాదారుల పాలు..

శేరిలింగంపల్లి మండలం ఖానామెట్ సర్వే నెం.41లో కొందరు నిరుపేదలకు సర్కారు గతంలో అసైన్డ్ భూములు కేటాయించింది. అయితే, కాలక్రమంలో ఆ భూములు చేతులు మారాయి. ఇప్పుడవన్నీ అర్హుల వద్ద కాకుండా కొందరు బడాబాబుల చేతుల్లోకి వెళ్లాయి. అసైన్డ్ భూముల నిబంధనల ప్రకారం.. అసైనీలకు ఇచ్చిన భూములను అమ్మడం కానీ, కొనడం కానీ చేయరాదు. కానీ మాదాపూర్ ప్రాంతంలో ఐటీ రంగ అనుబంధ సంస్ధలు విరివిగా రావడం, రియల్ఎస్టేట్ భూమ్ పెరగడంతో ఇక్కడి స్థలాలకు ఫుల్ డిమాండ్ పెరిగింది. ఇదే క్రమంలో ఖాళీ స్థలం కనిపిస్తే అక్కడ వాలిపోయారు కొందరు పెట్టుబడిదారులు. ఇదే సమయంలో అసైన్డ్, ప్రభుత్వ స్థలాల ఆక్రమణలు జరిగిపోయాయి. రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యంతో ఏకంగా రికార్డుల్లో పేర్లు సైతం మారాయి. ఇప్పుడు ప్రభుత్వ స్థలాల్లో కబ్జాదారులు పగా వేసి విలువైన భూములను చేజిక్కించుకున్నారు.

అసైన్డ్ భూములపై అనేక ఫిర్యాదులు..

ఖానామెట్ అసైన్డ్ భూముల అన్యాక్రాంతంపై రెవెన్యూ అధికారులకు తరచూ అనేక ఫిర్యాదులు అందుతూనే ఉన్నాయి. ఖానామెట్, అయ్యప్ప సొసైటీలో అనేక నిర్మాణాలు సాగుతున్న నేపథ్యంలో చాలావరకు అసైన్డ్ భూముల్లోనే నూతన నిర్మాణాలు వెలుస్తున్నాయని, అసైన్డ్ భూములను చెరబట్టి అందులో కమర్షియల్ కాంప్లెక్స్‌లు, ఇతర కట్టడాలు చేపట్టారని అటు రెవెన్యూ, ఇటు జీహెచ్ఎంసీ అధికారులకు పలువురు ఫిర్యాదులు చేశారు. అయినా రెవెన్యూ అధికారులు ఎందుకో సరైన చర్యలు తీసుకోలేదనే చెప్పాలి. ఇటీవల ఓ ఆర్టీఐ యాక్టివిస్ట్ మంజునాథ కన్స్ట్రక్షన్ కంపెనీ అధినేత చిత్తూరు అమర్ నాథ్ రెడ్డి అనే వ్యక్తిపై ఫిర్యాదు చేశారు. అలాగే, గత ఏడాది ఇదే మంజునాథ కన్స్ట్రక్షన్‌పై సీపీఎం నాయకులు చల్లా శోభన్ సైతం ఫిర్యాదు చేశారు. వీరేగాక చాలామంది రెవెన్యూ అధికారులకు ఫిర్యాదులు చేశారు.

నోటీసులు ఇవ్వడం వరకే పరిమితం..

శేరిలింగంపల్లి మండల పరిధిలోని అనేక ప్రభుత్వ భూములు కబ్జాలకు గురవుతున్నాయి. ఖానామెట్‌లో మాత్రం ఒకే వ్యక్తి చేతిలో ఎకరాల కొద్దీ అసైన్డ్ భూములు ఉండటం గమనార్హం. ఖానామెట్ భూముల కబ్జాలపై తరచూ ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఆయా వర్గాల నుండి వస్తున్న ఫిర్యాదులపై అధికారుల స్పందన కూడా అంతంత మాత్రమే. ఇటీవల ఓ ఆర్టీఐ కార్యకర్త చేసిన ఫిర్యాదుపై స్పందించిన రెవెన్యూ అధికారులు మంజునాథ కన్స్ట్రక్షన్ అమర్ నాథ్ రెడ్డికి నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకున్నారు.

కబ్జాదారులపై రెవెన్యూ అధికారుల ప్రేమ : సీపీఎం నాయకుడు చల్లా శోభన్

ఖానామెట్‌లో లబ్దిదారులకు కేటాయించిన అసైన్డ్ భూములు ఇప్పటికే చేతులు మారాయి. ఎకరాల కొద్దీ అసైన్డ్ భూములను దొంగ డాక్యుమెంట్లతో కబ్జా చేసి అందులో నిర్మాణాలు చేపడుతున్నారు. దీనిపై అనేకమార్లు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదులు చేశాం. అయినా కబ్జాకోరులతో అంటకాగుతున్న రెవెన్యూ అధికారులు వారిపై వల్లమాలిన ప్రేమ చూపడం అనేక అనుమానాలకు తావిస్తోంది. కబ్జాదారులపై వెంటనే చర్యలు తీసుకోవాలి.

Next Story