కార్పొరేషన్ బరిపై యూత్ క్రేజ్.. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల్లో తీవ్ర పోటీ

by Vemula.Srinu Prasad |

కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు యువకులు పెద్ద సంఖ్యలో ఉత్సాహం చూపుతున్నారు. బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్, సీపీఐ, సీపీఎం పార్టీల్లో కొంతకాలంగా పార్టీనే నమ్ముకొని పనిచేస్తున్న వారు, పార్టీ అనుబంధ యువజన, విద్యార్థి విభాగాలలో బాధ్యతలు నిర్వహిస్తున్న టికెట్ ఆశిస్తున్నారు.

కార్పొరేషన్ బరిపై యూత్ క్రేజ్.. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల్లో తీవ్ర పోటీ
X

కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు యువకులు పెద్ద సంఖ్యలో ఉత్సాహం చూపుతున్నారు. బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్, సీపీఐ, సీపీఎం పార్టీల్లో కొంతకాలంగా పార్టీనే నమ్ముకొని పనిచేస్తున్న వారు, పార్టీ అనుబంధ యువజన, విద్యార్థి విభాగాలలో బాధ్యతలు నిర్వహిస్తున్న టికెట్ ఆశిస్తున్నారు. తమ బయో డేటాను, తాము పార్టీలో పోషించిన పాత్ర, ఉద్యమాలు, కార్యక్రమాలు తదితర వివరాలను జోడించి టికెట్ కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. కార్పొరేషన్‌లో కనీసం 25 శాతం యువతకే టికెట్లు కేటాయించాలని కోరుతుండగా, దీనికి సీనియర్లు అడ్డుకట్ట వేస్తున్నారని సమాచారం. కార్పొరేషన్ బరిలో ఉండటమంటే ఆర్థిక ఖర్చుతో పాటు, కలుపుకుపోయే గుణం కలిగిన వారు, ఎంతో కొంత వ్యక్తిగత ఇమేజ్ ఉండాలని అప్పుడే విజయావకాశాలు ఉంటాయని పలు పార్టీల అగ్ర నాయకత్వం భావిస్తోంది. ఈ క్రమంలో దరఖాస్తు చేసుకుంటున్న వారందరికీ అవకాశం వస్తుందా ? రాదా ? దీనిపై అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందనే విషయమై ఉత్కంఠ నెలకొంది.

దిశ, కొత్తగూడెం ప్రతినిధి : భావి ప్రధాని రాహుల్ గాంధీ అని కాంగ్రెస్ పార్టీ, కాబోయే సీఎం కేటీఆర్ అని ఆయా పార్టీల నాయకులు గతంలో, ప్రస్తుతం ప్రచారం చేసుకుంటుండటం వింటూనే ఉన్నాం. వారంత యువకులే అని వారి నాయకత్వంలోనే దేశం, రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఆయా పార్టీల నాయకులు ప్రచారం చేస్తూనే ఉన్నారు. ప్రస్తుత రాజకీయాల్ని కూడా యువనాయకుల చుట్టే తిరుగుతున్నాయి. బీజేపీ, కాంగ్రెస్, బీ ఆర్ఎస్, సీపీఐ, సీపీఎం పార్టీలో గత కొంతకాలంగా పార్టీనే నమ్ముకుని పనిచేస్తున్న వారు, పార్టీ అనుబంధ యువజన, విద్యార్థి విభాగాలలో బాధ్యతలు నిర్వహిస్తున్నారు కూడా. పార్టీలో అనేక మంది ఉన్నారు. వీరిలో కొంత మంది నాయకులు కార్పొరేషన్ బరిలో నిలిచేందుకు ఉత్సాహం చూపుతున్నారు. టిక్కెట్లు సైతం ఆశిస్తున్నారు. అయితే ఆ ఉత్సాహానికి సీనియర్లు అడ్డుకట్ట వేస్తున్నారనే ఆరోపణలు ఇప్పుడు బలంగా వినిపిస్తున్నాయి. కనీసం కార్పొరేషన్‌లో, మున్సిపాలిటీలలో కనీసం 25 శాతం అయిన యువతకే కేటాయించాలంటూ కోరుతున్నారు. ఈ వ్యవహారం కొన్ని పార్టీలకు ఇప్పుడు తలనొప్పిగా మారింది.

స్టూడెంట్ యూనియన్..

విద్యార్థి, యువజన విభాగాలు జాతీయ, ప్రాంతీయ పార్టీలలో కీలక భూమిక పోషిస్తాయి. ఎంతో మంది యువ నాయకులు విద్యార్థి విభాగాలలో నెరవేర్చి చట్ట సభలకు వెళ్లిన వారు అనేకమంది ఉన్నారు. అన్నీ జాతీయ, ప్రాంతీయ పార్టీల్లోనూ ఈ విధానం కొనసాగుతూనే ఉంది. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు పోషించిన పాత్ర, ఆ తర్వాత ప్రభుత్వం వారికి కల్పించిన స్థానం, అదే విధంగా కాంగ్రెస్ పార్టీ పది సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ పార్టీలో యువ నాయకులు పోషించిన బాధ్యతలు కండ్ల ముందు కనబడుతూనే ఉన్నాయి. పార్టీ కోసం కష్టపడ్డ తమను ఏనాటికైనా పార్టీ ఆదరించక పోతుందా? అనే ఒక ఆశతో పని చేస్తున్న యువకులు ఉన్నారు. అయితే ప్రస్తుతం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు యువకులు పెద్ద సంఖ్యలో కూడా ఉత్సాహం చూపుతున్నారు. కానీ వారికి అవకాశం వస్తుందా ? రాదా ? అనేది అధిష్టాన నిర్ణయంపై ఆధారపడి ఉంది. కాంగ్రెస్ పార్టీ ఇటీవల ప్రకటించిన డీసీసీ అధ్యక్షుల జాబితాలో పార్టీని నమ్ముకున్న వారికే అందులో సీనియర్లకు ఎక్కువ శాతం పదవులను కట్టబెట్టింది. బీఆర్ఎస్ పార్టీలోనూ యువత కొదువలేదు. అనేక మంది యువకులకు అవకాశాలు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. అదే ఆశ ఇప్పుడు పార్టీ కోసం కష్టపడుతున్న వారికి ఉత్సాహాన్నిస్తుంది. మా కోసం కొన్ని టిక్కెట్లు కేటాయించకపోతారా అనే ఆశల పల్లకిలో యువకులు ఉన్నారు.

టికెట్ కోసం దరఖాస్తులు..

కాంగ్రెస్, బీఆర్ఎస్ వంటిపార్టీలలో సాధారణంగా టికెట్ దక్కించుకోవడం కొంచెం కష్టమే. అయినప్పటికీ పెద్ద సంఖ్యలో యువకులు తమ బయో డేటాను, తాము పార్టీలో పోషించిన పాత్ర, ఉద్యమాలు, కార్యక్రమాలు తదితర వివరాలను జోడించి టికెట్ కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. ఒక్క అవకాశం ఇవ్వాలని కోరుతూ.. నాయకులను వేడుకుంటున్నారు. అయితే గత మూడు, నాలుగు సార్లు పోటీ చేసినవారు, రెండు మూడు సార్లు గెలిచిన వారిని ఈ సారి పక్కన పెట్టి తమ పేరును పరిగణలోకి తీసుకోవాలని యువకులు కోరుతున్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పట్టించుకోకుండా తమ రాజకీయ భవిష్యత్తు కోసం పార్టీ వదిలి వెళ్లిన వారు, పార్టీ అధికారంలోకి రాగానే మళ్లీ వచ్చి చేరిన వారిని దూరం పెట్టీ జెండా భుజాన వేసుకుని కాసులకు భయపడక పనిచేసిన వారికి అవకాశం ఇచ్చి చూడాలని నాయకులకు స్పష్టంగా చెబుతున్నారు. పార్టీని నమ్ముకొని యువకులైన తమకు టికెట్ ఇస్తే పార్టీని మరింత బలోపేతం చేసేందుకు అవకాశం చేసే అవకాశం ఉంటుందని, గెలిచిన, ఓడిన పార్టీని నమ్ముకుని ఉంటామని, యువతలో ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించిన వారవుతారని యువకులు స్పష్టం చేస్తున్నారు.

అధిష్టాన నిర్ణయం ఏంటో..?

కార్పొరేషన్ బరిలో ఉండటమంటే ఆర్థిక ఖర్చుతో పాటు, కలుపుకుపోయే గుణం కలిగిన వారు, ఎంతో కొంత వ్యక్తిగత ఇమేజ్ కూడా ఉండాలని అప్పుడే విజయావకాశాలు ఉండే అవకాశం ఉంటుందని పార్టీ అగ్ర నాయకత్వం భావిస్తుంది. కానీ పార్టీని నమ్ముకున్న యువకులను కాకుండా, ఇతర పార్టీల నుంచి వచ్చిన సీనియర్లకు, అప్పుడే పార్టీలో చేరిన కొత్త ముఖాలకు టిక్కెట్లు కేటాయిస్తే పార్టీని నమ్ముకున్న యువత పరిస్థితి ఏంటనేది ఇప్పుడు అగ్ర నాయకులను వేధిస్తున్న ప్రశ్న. బీజేపీ, సీపీఎం, సీపీఐ లాంటి పార్టీలలో కొంత యువత నుంచి ఒత్తిడి తక్కువ ఉండొచ్చు కానీ బీఆర్ఎస్, కాంగ్రెస్ లలో యువకుల టికెట్ల కోసం తీవ్ర ఒత్తిడిని ఉందని పార్టీ నాయకులు చెబుతున్నారు.

Next Story