రెవెన్యూ కార్యాలయంలో అటకెక్కిన వాల్టా చట్టం

by Ratna Kumari |

మండల రెవెన్యూ కార్యాలయంలో ది వాటర్ ల్యాండ్ అండ్ ట్రీస్ యాక్ట్ 2002 వాల్టా చట్టం అటకెక్కింది.

రెవెన్యూ కార్యాలయంలో అటకెక్కిన వాల్టా చట్టం
X

దిశ, కారేపల్లి : మండల రెవెన్యూ కార్యాలయంలో ది వాటర్ ల్యాండ్ అండ్ ట్రీస్ యాక్ట్ 2002 వాల్టా చట్టం అటకెక్కింది. అధికారుల నిర్లక్ష్యం, బోర్ బావులు త్రవ్వి లక్షల రూపాయలు పోగు చేసుకుంటున్న బ్రోకర్లకు వరంగా మారింది. భూగర్భ జలాలు ఇంకిపోకుండా బోరు బావులు చెరువుల తవ్వకాలను జరపాలంటే పక్కాగా వాల్టా చట్టం ప్రకారం.. తహశీల్దార్ ముందస్తు అనుమతులు ఉండాలి. అదేవిధంగా విద్యుత్ సరఫరాకు వీలుగా ఉన్నట్లు విద్యుత్ శాఖపరమైన క్లియరెన్స్ నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఉండాలి. అదేవిధంగా భూగర్భ జల వనరుల శాఖ అనుమతులు తప్పనిసరిగా ఉండాలి. వాల్టా చట్టం 2002 ప్రకారం.. ఏదైనా సాధారణ బోర్ బావి డ్రిల్ వేసే ముందు రెండు బోర్ల మధ్య 100 మీటర్ల దూరం ఉన్నట్లు తప్పనిసరిగా గుర్తించిన పిమ్మటనే నూతన బోర్ త్రవ్వకానికి అనుమతులు ఇవ్వాల్సిఉంటుంది.

మంచినీటి అవసరాలకు ఉపయోగపడుతున్న బోర్ బావి సమీపంలో బోర్ బావి డ్రిల్ త్రవ్వకానికి అయితే 250 మీటర్లు దూరం తప్పనిసరిగా పాటించిన తర్వాతే కొత్త బోర్లను అనుమతులు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ సింగరేణి మండలంలో మాత్రం ఇవేవీ కూడా అమలు కావడం లేదనేది బహిరంగ నిజం. గత 20 ఏళ్లుగా అక్రమ మార్గాన బోర్ వెల్ కార్యకలాపాలను నిర్వహిస్తున్న సదరు బ్రోకర్ లక్షల రూపాయలు తన వెనకేసుకున్నాడు.సొంతంగా ఓ విలాసవంతమైన భవనం కూడా నిర్మించుకున్నాడు.ప్రభుత్వ నిబంధనలు తనకు అన్నీ తెలిసిన కూడా ఏ రెవెన్యూ అధికారి కూడా తన వద్దకు వచ్చి అనుమతులకు సంబంధించిన కాగితాలు అడగరనే ధీమాతో రాత్రి,పగలు అనే తేడా లేకుండా విచ్చలవిడిగా భూమాతకు కన్నాలు పొడుస్తున్నాడు. భూగర్భ జలాలు అడుగింటి పోతున్న సరే, ఒక వ్యక్తికి నూతనగా బోర్ డ్రిల్ వేసే క్రమంలో మరొక వ్యక్తికి అన్యాయం జరిగిన సరే తన వ్యాపారం మాత్రం పదిలంగా, మూడు పువ్వులు ఆరు కాయలు అనే విధంగా కాసుల విరిసిల్లాలని భావించి అడ్డగోలుగా బోర్ బావులను తవ్వేస్తున్నాడు.

రెవెన్యూ శాఖ పై సర్వత్రా అనుమానాలు

కళ్ళ ముందే విచ్చలవిడిగా బోర్ బావుల త్రవ్వకాలు జరుపుతున్నా సరే ఇవేవీ తమకు పట్టవు అనే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అధికారులు కార్యాలయానికే పరిమితం అవుతూ కాలం వెళ్లదీస్తున్నారు.వాల్టా చట్టం అమలు, భూగర్భ జల వనరుల పరిరక్షణకు సంబంధించిన వాల్టా చట్టాన్ని అటకెక్కించారు. రెవెన్యూ శాఖ పరిధిలోకి వచ్చే వాల్టా చట్టం అమలుతో తమకేమీ సంబంధం లేదు అనే విధంగా,నిమ్మకు నీరేత్తినట్టుగా వ్యవహరిస్తూ అధికారులు సర్వత్రా విమర్శల పాలవుతున్నారు. మరోవైపు రెవెన్యూ శాఖ అధికారులు తన జోలికి రారు అంటూ బహిరంగంగానే ఈ బ్రోకర్ కామెంట్ చేస్తున్న తీరు చూస్తుంటే రెవెన్యూ శాఖ పట్ల ప్రజల్లో అనేక అనుమానాలు రెట్టింపవుతున్నాయి.ఇటీవల ఓ తండాలో పట్టపగలే బోరు బావి తవ్వకానికి పాల్పడుతున్న క్రమంలో రెవెన్యూ అధికారులు నామమాత్రంగానే జోక్యం చేసుకున్నారని,సదరు బ్రోకర్ రెవెన్యూ గ్రామ పాలన అధికారిపైనే చిందులేసాడని సమాచారం.ఈ క్రమంలోనే తనపై ఎవరైనా ఫిర్యాదు చేసిన సంబంధిత ఫిర్యాదుదారుడి వివరాలను గోప్యంగా ఉంచాల్సిన రెవెన్యూ అధికారులే తనకు లీకులు ఇస్తారని చెబుతూ కాలర్ ఎగరేసుకుంటున్న పరిస్థితులు నెలకొన్నాయి.రెవెన్యూ శాఖ ప్రతిష్టను బహిరంగంగానే భంగపరుస్తున్న సదరు బ్రోకర్ పై చర్యల్లో భాగంగా రెవెన్యూ శాఖ ఏమైనా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తుందా? లేదా మొద్దునిద్ర విడకుండా ఎలాంటి చర్యలు తీసుకోకుండా సదరు బ్రోకర్ వ్యాఖ్యలకు బలాన్ని చేకూరుస్తారా? అనేది వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది.

Next Story