పంచాయతీ పోరులో ఆర్టీసీ కార్మికులకు 'ఓటు' కరువు

by Nallavelli.Anjaneyulu |

దిశ, ఖమ్మం : ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత కీలకమైన ఓటు హక్కును వినియోగించుకోవడంలో

పంచాయతీ పోరులో ఆర్టీసీ కార్మికులకు ఓటు కరువు
X

దిశ, ఖమ్మం : ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత కీలకమైన ఓటు హక్కును వినియోగించుకోవడంలో ఆర్టీసీ కార్మికులకు నిరాశే ఎదురవుతోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు తమ ఓటు వేసే అవకాశాన్ని కోల్పోతున్నారు. రీజియన్ పరిధిలో సుమారు 2,500 నుంచి 3,000 మందికి పైగా (అంచనా) పర్మనెంట్ ఔట్‌సోర్సింగ్ సిబ్బంది పని చేస్తున్నారు. వీరిలో డ్రైవర్లు, కండక్టర్లే అత్యధికం. గతంలో ప్రతి ఎన్నికల సమయంలోనూ ఎన్నికల నిర్వహణ సిబ్బందితో పాటు, రవాణా బాధ్యతలు నిర్వర్తించే ఆర్టీసీ ఉద్యోగులకు సంస్థ 'పోస్టల్ బ్యాలెట్' సౌకర్యం కల్పించేది. కానీ, ఈసారి పంచాయతీ ఎన్నికల్లో ఆ వెసులుబాటు కల్పించకపోవడంతో కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఏడు డిపోల పరిధిలో ప్రభావం :

ఖమ్మం రీజియన్ పరిధిలోని ఖమ్మం, సత్తుపల్లి, మధిర, ఇల్లందు, కొత్తగూడెం, భద్రాచలం, మణుగూరు డిపోల పరిధిలో పనిచేసే డ్రైవర్లు, కండక్టర్లు, ఇతర సిబ్బంది ఈసారి ఎన్నికల్లో ఓటు వేయలేకపోతున్నారు. ఎన్నికల సామాగ్రిని, పోలింగ్ సిబ్బందిని తరలించేందుకు చాలా మంది డ్రైవర్లు ఎన్నికల విధుల్లో బిజీగా ఉండగా, మరికొందరు రెగ్యులర్ రూట్లలో డ్యూటీలు నిర్వర్తిస్తున్నారు. వీరంతా పోలింగ్ రోజున తమ సొంత గ్రామాలకు వెళ్లి ఓటు వేసే పరిస్థితి లేదు.

అధికారుల నుంచి స్పందన కరువు

తమకు రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును వినియోగించుకోవడం ఎలా అని ఆయా డిపోల అధికారులను,మేనేజర్లను కార్మికులు ప్రశ్నించగా.. వారి నుంచి ఎలాంటి స్పష్టమైన సమాధానం రావడం లేదని తెలుస్తోంది.పోస్టల్ బ్యాలెట్ విషయంలో అధికారుల నుంచి సానుకూల స్పందన లేకపోవడంతో ఫలితం లేకుండా పోయిందని కార్మికులు వాపోతున్నారు.ఎన్నికల విధుల్లో భాగస్వాములవుతున్న తమకు ఓటు హక్కును దూరం చేయడం సరికాదని వారు అభిప్రాయపడుతున్నారు.

కార్మికులకు గ్రామాల్లో ఓటు ఉంటే ముందు మా దృష్టికి తేవాలి : ఆర్టీసీ రీజనల్ మేనేజర్ సరిరామ్

ఆర్టీసీలో పని చేసే కార్మికులకు గ్రామాల్లో ఓట్లు ఉంటే ముందుగా ఆయా డిపో మేనేజర్లు దృష్టికి తీసుకొని వస్తే వారి వెసులుబాటు ప్రకారంగా డ్యూటీలు వెయ్యడం జరుగుతుంది. సాధారణంగా ఎన్నికల్లో డ్యూటీకి వెళ్లే కార్మికులకు ఓటు హక్కు వినియోగించుకునే విధంగా పోస్టల్ బ్యాలెట్ లను అందుబాటులో ఉంచుతాము. ప్రస్తుతం ఎన్నికల్లో ఇలాంటి సమస్య మా దృష్టికి రాలేదు.

Next Story