తెల్లంకు అసమ్మతి సెగ.. సొంత పార్టీలోనే ప్రత్యర్థులు

by Disha Web Desk 20 |
తెల్లంకు అసమ్మతి సెగ.. సొంత పార్టీలోనే ప్రత్యర్థులు
X

దిశ, భద్రాచలం : భద్రాచలం నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి తెల్లం వెంకట్రావుకు సొంత పార్టీలోనే ప్రత్యర్థులు తయారయ్యారు. ఎట్టకేలకు టిక్కెట్ సంపాదించిన బీఆర్ఎస్ పార్టీలోని అసమ్మతి వల్ల గెలుపు అంత సులువు కాదనే చెప్పాలి. పొంగులేటి అనుచరునిగా ఉన్న తెల్లం వెంకట్రావు బీఆర్ఎస్ కి రాజీనామా చేసి కాంగ్రెస్ కండువా కప్పుకోవడంతో, బీఆర్ఎస్ లోని ద్వితీయ శ్రేణి నాయకులు బోదెబోయిన బుచ్చయ్య, మానే రామకృష్ణ, కాపుల కృష్ణార్జునరావులకు ఆశలు చిగురించాయు. అప్పటి నుండి భద్రాచలం టిక్కెట్ కోసం ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. తెల్లం వెంకట్రావు మళ్ళీ యూ టర్న్ తీసుకుని బీఆర్ఎస్ తీర్ధం తీసుకున్నారు. భద్రాచలం టిక్కెట్ తనకు కేటాయుంచే ఒప్పందం మీద తెల్లం బీఆర్ఎస్ లో జాయిన్ అయినా బోదెబోయిన బుచ్చయ్య, తెల్లంకు టిక్కెట్ ఇవ్వవద్దని చివరి వరకు ప్రయత్నం చేశారు. ఆదివారం నియోజకవర్గంలోని నాలుగు మండలాల పార్టీ అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలతో విప్ రేగాను కలిసిన బోదెబోయిన బుచ్చయ్య అండ్ కో.. సోమవారం బలప్రదర్శనగా వెళ్లి మంత్రి పువ్వాడను కలిశారు. అయినా తెల్లంకు టిక్కెట్ రాకుండా అడ్డుకోలేకపోయారు.

అసమ్మతి సెగలను ఆర్పేవారెవరు..?

తెల్లం కాంగ్రెస్ లో చేరకముందు చిన్నచితక గ్రూపులు ఉన్నా.. అవి పట్టింపు కాదు. ఇప్పుడు మండలానికి ఒక అభ్యర్థి తయారయ్యాడు. తెల్లం బీఆర్ఎస్ లోకి రీ ఎంట్రీ వలన అసమ్మతి రెట్టింపు అయ్యింది. బీఆర్ఎస్ నేతలను ఒకే తాటిమీదకు తీసుకురావాలంటే అధిష్టానం దిగి రావాల్సిందే. టిక్కెట్ ఆశించిన వారిని బుజ్జగించాలంటే ఏవో ఒక నామినేటెడ్ పోస్టులు హామీతో బేరం కుదుర్చుకోవాలసిందే. లేకపోతే బుచ్చయ్య బీఆర్ఎస్ రెబల్ అభ్యర్దిగా పోటీచేసే అవకాశం ఉంది. దీంతో బీఆర్ఎస్ పార్టీ ఓట్లు చీలిపోయి కాంగ్రెస్ పార్టీ గెలుపు సునాయాసం అవుతుంది.

Next Story

Most Viewed