ఆ విత్తనాలు నకిలీవి కావు

by Disha Web Desk 15 |
ఆ విత్తనాలు నకిలీవి కావు
X

దిశ, వైరా : తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో రైతులకు సబ్సిడీపై పంపిణీ చేసిన జీలుగు విత్తనాలను నకిలీ విత్తనాలుగా పరిగణించవద్దని వైరా మండల వ్యవసాయ అధికారి శ్రీరామోజి పవన్ కుమార్ అన్నారు. రైతులు అభ్యంతరం తెలిపిన జీలుగు విత్తనాలను ఆయన మంగళవారం పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు పంపిణీ చేసిన జీలుగు విత్తనాలు రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ సరఫరా చేసిందని చెప్పారు. అయితే ఈ విత్తనాల్లో నలుపు రంగు విత్తనాలు, పుచ్చు విత్తనాలు ఉండటంతో రైతులు నకిలీ విత్తనాలుగా అపోహ పడ్డారని పేర్కొన్నారు. రైతుల ఫిర్యాదు మేరకు సోమవారం గ్రామం వెళ్లి ఆ జీలుగు విత్తనాలను పరిశీలించానని వివరించారు.

ఈ విత్తనాలు తమకు వద్దని రైతులు స్పష్టం చేయటంతో వైరా సొసైటీ కి ఆ జీలుగు విత్తన బస్తాలు రిటర్న్ చేయించామన్నారు. అనంతరం రైతులకు మరలా జీలుగు బస్తాలను పంపిణీ చేశామని తెలిపారు. నల్ల రంగుతో పాటు పుచ్చు గా ఉన్నాయని రైతులు అభ్యంతరం తెలిపిన విత్తనాలను వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మొలక శాతం పరిశీలించిన తర్వాతే పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఈ విత్తనాలు మొలక శాతం తక్కువగా ఉంటాయనే అపోహతోనే రైతులు ఆ బస్తాలను తిరిగి సొసైటీకి అప్పగించారని చెప్పారు. రైతులు అభ్యంతరం తెలిపిన విత్తనాల్లో కూడా 85 శాతం మొలక శాతం ఉందని స్పష్టం చేశారు. రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో సబ్సిడీపై పంపిణీ చేసిన జీలుగు విత్తనాల గురించి రైతులు ఎవరు అధైర్య పడవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.


Next Story

Most Viewed