- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

దిశ, దమ్మపేట : మండల రెవెన్యూ పాలన అస్తవ్యస్తంగా మారింది. సామాన్యుడికి పెద్ద దిక్కుగా ఉండాల్సిన తహశీల్దార్ కుర్చీ గత మూడు నెలలుగా ఖాళీగా దర్శనమిస్తోంది. ఉన్నతాధికారుల నిర్లక్ష్యం వల్ల దమ్మపేట మండల ప్రజలు తమసమస్యల పరిష్కారం కోసం కార్యాలయం చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. ప్రస్తుతం ఇంచార్జి డిప్యూటీ తహశీల్దార్‌గా వాణి బాధ్యతలు నిర్వర్తిస్తున్నప్పటికీ, పూర్తిస్థాయి అధికారి లేకపోవడంతో కీలకమైన ఫైళ్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.
ఏడాదిలో కొన్ని నెలల పాటు ‘ఖాళీ’నే
దమ్మపేట తహశీల్దార్ కార్యాలయానికి ‘ఇంచార్జి’ గండం పట్టుకుంది. గడిచిన ఏడాది కాలంలో కొన్ని నెలల పాటు కార్యాలయం ఇంచార్జి పాలనలోనే సాగిందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. రెగ్యులర్ తహశీల్దార్ లేకపోవడంతో కార్యాలయంలో పరిపాలన గాడి తప్పింది. గతంలోనూ ఇదే పరిస్థితి ఉండగా, ఇప్పుడు మళ్లీ అదే రిపీట్ అవుతోంది. ఉన్న సిబ్బందిపై అదనపు భారం పడటంతో ప్రజలకు సకాలంలో సేవలు అందడం లేదు.
జనం గోస పట్టదా ?
తహశీల్దార్ లేకపోవడం వల్ల సామాన్యులు పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతం. భూముల మ్యుటేషన్లు, వారసత్వ మార్పిడి, పెండింగ్‌లో ఉన్న సర్వే నంబర్ల సవరణ వంటి పనులు పూర్తి స్థాయి అధికారి సంతకం లేక మూలన పడ్డాయి. రైతులకు పట్టాదారు పాస్‌పుస్తకాలు అందక పెట్టుబడి సాయం, రుణాలు పొందలేక అవస్థలు పడుతున్నారు. మండలానికి బాధ్యుడు లేకపోవడంతో కిందిస్థాయి సిబ్బంది పై పర్యవేక్షణ కరువైంది. దీంతో పనుల కోసం వచ్చే ప్రజలకు సరైన సమాచారం ఇచ్చేవారు లేక ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
రావడానికి అధికారుల వెనకడుగు ?
మరోవైపు ఈ మండలానికి రావడానికి అధికారులు సైతం వెనకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో ఇక్కడ పెద్ద ఎత్తున జరిగిన అక్రమ భూబదలాయింపుల వ్యవహారం ఇప్పుడు అధికారులను కలవరపెడుతోంది. పాత ఫైళ్లను ఎక్కడ తవ్వుతారో, గతంలో జరిగిన వివాదాస్పద నిర్ణయాలకు తామే బాధ్యత వహించాల్సి వస్తుందేమోనని పలువురు తహసీల్దార్లు ఇక్కడ పనిచేయడానికి ఆసక్తి చూపడం లేదని సమాచారం. ఈ క్రమంలో అక్రమార్కులకు అండగా నిలిచిన పాత పాపాలు నేడు సాధారణ ప్రజల పాలిట శాపంగా మారాయని మండల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి వెంటనే రెగ్యులర్ తహసీల్దార్‌ను నియమించాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.






