- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భారీగా పడిపోయిన మిర్చి ధర.. తాలుకంటే అసలే అధ్వానం
తల్లాడ మండలంలో మిర్చి కోతలు ప్రారంభమయ్యాయి. గత ఐదు నెలల క్రితం సాగుచేసిన మిర్చి మొదటి కోతకు వచ్చాయి.

అరుగాలం శ్రమించి, వేలకు వేలు పెట్టుబడి పెట్టి సాగు చేసిన మిర్చి రైతులకు.. ప్రస్తుతం మార్కెట్లో వ్యాపారులు పెడుతున్న ధరలు దడపుట్టిస్తున్నాయి. తల్లాడ మండలంలో రైతులు 6వేల ఎకరాల్లో మిరప తోటలు సాగు చేశారు. ఈ ఏడాది మంచి దిగుబడి వస్తుందని భావించినా.. తెగుళ్లు ఉక్కిరి బిక్కిరి చేశాయి. ఎకరం మిరప సాగుకు రూ.లక్షకు పైగా ఖర్చు వచ్చింది. ప్రస్తుతం కోతలు చేపట్టిన రైతులు విక్రయించేందుకు మార్కెట్ కు తీసుకెళ్తే అక్కడ వ్యాపారులు జెండా పాటగా ధర రూ.14వేలు ఉన్నప్పటికీ క్వింటాకు రూ.11వేలకు మించి కొనుగోలు చేయడం లేదు. పేరుకు జెండా పాట కానీ ఒకరిద్దరికి మాత్రమే వ్యాపారులు ధర పెడుతున్నట్లు రైతులు చెబుతున్నారు. ఈ ధరతో పెట్టుబడి, కూలీల కోత ఖర్చు దక్కే పరిస్థితి లేదని లబోదిబొంటున్నారు. ఓ వైపు అనుకున్నంత దిగుబడి రాలేదని దిక్కుతోచని స్థితిలో ఉన్న రైతులకు ఇప్పుడు పతనమైన ధరలతో దిగాలు చెందుతున్నారు. గతేడాది తాలుపంటకు పలికిన ధర సైతం ఈఏడాది నాణ్యమైన పంటకు దక్కడం లేదని వాపోతున్నారు.
దిశ, తల్లాడ: తల్లాడ మండలంలో మిర్చి కోతలు ప్రారంభమయ్యాయి. గత ఐదు నెలల క్రితం సాగుచేసిన మిర్చి మొదటి కోతకు వచ్చాయి. గత ఏడాది జూలై నెలకు ఆగస్టు మొదటి వారంలో సాగుచేసిన మిర్చి తోటలో ఐదు నెలల వరకు ఎలాంటి చీడపీడలు ఆశించకుండా ఏపుగా పెరిగాయి. మంచి దిగుబడులు వస్తాయని రైతులు ఎంతగానో ఆశపడ్డారు. కానీ వరుస తెగుళ్లు మిరప రైతులను ఉక్కిరి బిక్కిరి చేశాయి. వాటిని కాపాడుకునేందుకు రైతులు పెట్టుబడులు విపరీతంగా పెట్టారు. వేసిన దగ్గర నుంచి కోతల వరకు పెట్టుబడులు భారీగా పెరిగాయి. ఎకరం మిరప సాగు రూ. లక్షకు పైగా ఖర్చు వచ్చింది. దిగుబడులు మాత్రం ఎకరానికి 10క్వింటాళ్ల లోపే వస్తుండటంతో పెట్టుబడులు సైతం వచ్చే పరిస్థితి లేదని రైతులు వాపోతున్నారు.
పండించిన పంటకు ధర స్థిరంగా లేక పోవడంతో అన్నదాతలు కలవరానికి గురవుతున్నారు. కింటా మిరప ప్రస్తుతం జెండా పాటగా ధర రూ. 14వేలు ఉన్నప్పటికీ గ్రామాల్లో మాత్రం క్వింటాకు రూ.11వేలకు మించి కొనుగోలు చేయడం లేదు. క్వింటా మిరపకాయలు కోతలకు రూ.రూ3వేల ఖర్చు వస్తుంది. పెట్టుబడి కూలీలు కోత ఖర్చులను కలిపితే సాగుకు చేసిన అప్పులు తీరే పరిస్థితి లేదని రైతులు లబోదిబొంటున్నారు.
ఇతర రాష్ట్రాల నుంచి కూలీలు వలస..
తల్లాడ మండలంలో 6వేల ఎకరాల్లో మిరప తోటలు సాగు చేశారు. తేజస్విని సన్న రకాలు, లావు రకాలు సాగు చేశారు. మండలంలో సన్నరకాలకే ఎక్కువగా సాగు చేశారు. ఈ ఏడాది రబి వరి నాట్లకు కూలీలు వెళ్లడంతో మండలంలో మిర్చి కోతలకు కూలీల కొరత ఏర్పడింది. దీంతో రైతులు ఇతర రాష్ట్రాల నుంచి కూలీలను పిలిపించుకుంటున్నారు.
తాలు కంటే అధ్వానంగా అసలు ధర.. ఆపతి వెంకట రామారావు, రైతు అన్నారుగూడెం
పోయిన ఏడాది తాలుపంటకు పలికిన ధర సైతం ఈఏడాది నాణ్యమైన పంటకు పలకడం లేదు. ఈ ఏడాది దాదాపు రెండు ఎకరాల్లో మిర్చి పంట సాగు చేశాను. పంట దిగుబడి సైతం తగ్గింది. క్వింటాల్ రూ.20వేలు పలికితే పెట్టుబడులు పూడే అవకాశం ఉండేది. కానీ మార్కెట్లో రోజురోజుకూ మిర్చి ధర తగ్గడంతో చాలా బాధగా ఉంది. పేరుకు జెండా పాట కానీ ఒకరిద్దరు రైతులకు మాత్రమే వ్యాపారులు పెడుతున్నారు. ప్రభుత్వం మిర్చి రైతులను ఆదుకోవాలి. వరిధాన్యం కొనుగోలు కేంద్రాల మాదిరి మిర్చి కొనుగోలు కేంద్రాలు సైతం ఏర్పాటు చేస్తే బాగుంటుంది.
కౌలుకు తీసుకొని అప్పులు పాలయ్యా.. గాదే శ్రీనివాసరావు, రైతు మంగాపురం
భూమి కౌలుకు తీసుకొని మిర్చి పంట సాగు చేసి ఇప్పుడు అప్పులపాలయ్యా. ఒక్క ఎకరానికి రూ.25వేలు కౌలు, పెట్టుబడి రూ.50వేలు అయ్యింది. ఎకరానికి రూ.75వేలు రావాలి. కానీ ప్రస్తుతం మార్కెట్లో అలాంటి పరిస్థితి లేదు. మార్కెట్‌కు తీసుకువచ్చిన నెంబర్ వన్ మిర్చి క్వింటాకు రూ.13,500మాత్రమే పలికింది. యార్డ్‌లో పంట నాణ్యతను బట్టి వ్యాపారులు మంచిధర పెట్టడం లేదు.






