- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, కొత్తగూడెం ప్రతినిధి: ఎండనక వాననక ఓ చిరువ్యాపారి, కూరగాయల వ్యాపారి, పండ్ల వ్యాపారి, పూల వ్యాపారి, ఓ హోటల్ బండి నిర్వహకుడు, ఓ భవన నిర్మాణరంగ కార్మికుడు ఒక రోజంతా కష్టపడితే వచ్చేది ఎంత..? ఓ ప్రైవేట్ ఉద్యోగి, ఓ ప్రభుత్వ ఉద్యోగి నెలంతా కష్టపడి సంపాదించేది ఎంత..? అదే నెలంతా కష్టపడి పనిచేసే బదులు 'మాట్కా' అడి జాక్ పాట్ తగిలితే ఒక్క రోజులోనే నెలంతా కష్టపడి ఎంత సంపాదిస్తామో సులువుగా అంత మొత్తంలో సంపాదించవచ్చు. నెలలో ఒక్క జాక్ పాట్ అయినా తగలకపోదా..? అనుకుంటూ అటు డబ్బులను, సమయాన్ని వృథా చేసుకుంటూ వ్యసనాలకు బానిసలవుతూ ఎంతో మంది విలువైన జీవితాన్ని కోల్పోతున్నారు. సులభంగా డబ్బులు సంపాదించడం ఎలా..? అనే విషయంపై ప్రస్తుత ప్రపంచంలో కొంతమంది ధీర్ఘాలోచనలు చేస్తూ ఆ దిశగా అడుగులు వేస్తూ అడ్డదారులు తొక్కుతూ జీవితాన్ని, కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేసుకుంటున్నారు. ప్రస్తుతం భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో యువత, చిరువ్యాపారులు, చిరు ఉద్యోగులు, విద్యార్ధులు 'మట్కా' అనే జూదం మత్తులో పడి ఆగాధంలోకి నెట్టివేయబడుతున్నారు. మట్కాను నిర్మూలించాల్సిన 'నిఘా' వ్యవస్థ కండ్లు, చెవులు, నోరు మూసుకొని మాముళ్ళ మత్తులో పడి చోద్యం చూస్తున్నారని ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.
మట్కా' కు పేర్లు - బలవుతున్న మధ్యతరగతి ప్రజలు
''మట్కా' జూదానికి అలవాటుపడిన మధ్యతరగతి ప్రజలు ప్రతీరోజు ఇదే వ్యాపకంగా మారి సమయాన్ని, డబ్బును వృధా చేసుకుంటూ గడిపేస్తున్నారు. ఖమ్మం జిల్లా, మహబూబాబాద్ జిల్లాలో పోలీస్ యంత్రాంగం దాదాపుగా ఈ మట్కా జూదాన్ని తుడిచిపెట్టినప్పటికీ భద్రాద్రికొత్త గూడెం జిల్లాలో బుకీలు ఈ దందాను చాటుమాటున గుట్టుగా కొనసాగిస్తున్నారు. కళ్యాణి, శ్రీదేవి, టైమ్ బజార్, మెయిన్ బజార్ పేర్లతో నిర్వాహకులు ప్రతీ రోజు ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు ఈ మట్కా నెంబర్ల దందాను బుకీల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. మట్కాలో ఒక నంబర్‌కు బుకీలకు నిర్ణీత సమయంలో నగదు చెల్లిస్తే అరగంలోపే ఓపెన్ నెంబర్, గంటలోపు క్లోజింగ్ నెంబర్, పానా(సింగిల్, డబుల్) నెంబర్ అంటూ నిర్వహకులు ప్రకటిస్తున్నారు. అదృష్టం కొద్ది మట్కా ఆడే వారు నగదు చెల్లించిన నెంబర్ ను ఈ మట్కా దందా నిర్వహకులు ప్రకటిస్తే రూపాయికి ఎనిమిది రెట్లు, ఆదే పానా(నెంబర్)కు సింగిల్ అయితే రూ.1500, డబుల్ పానా అయితే రూ.3వేలు నగదు వచ్చి జేబులో చేరుతుంది. లేకపోతే అసలుకే మోసం వస్తుంది.
వ్యసనానికి బానిసై అప్పులపాలవుతున్న కుటుంబాలు
దాదాపుగా ప్రతీరోజు రోజువారీ పనులు చేసుకునేవారు, చిరువ్యాపారులు, కొంతమంది ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగులు ఈ మట్కా బారినపడుతున్నారు. అనేక మంది ఈ నెంబర్ల దాందాపై అదృష్టాన్ని పరీక్షించుకుంటూ బానిసలవుతున్నారు. ఒక్క రోజైన నెంబర్ తగలకపోతుందా..? అనే ఆశతో ప్రతీరోజు వందల రూపాయలు బుకీలకు చెల్లిస్తున్నారు. గంటల వ్యవధిలోనే కళ్యాణి, శ్రీదేవి, టైమ్ బజార్, మెయిన్ బజార్ మట్కా దందా నిర్వాహకులు నెంబర్లను విడుదల చేస్తుండటంతో ఒక్కోక్కరి జీవితాలు తలక్రిందులవుతున్నాయి. ప్రతీరోజు వందల రూపాయల నగదును బుకీలకు చెల్లిస్తూ నెల తిరిగేసరికి వేలరూపాయల అప్పులుగా మిగిలిపోతున్నాయి. ఈ మట్కాకు బానిసైన వారు అందినకాడికి యాప్ల ద్వారా రుణాలు, ఇతరుల వద్ద నుంచి చేబదులు, వడ్డీలకు నగదును తీసుకుంటూ అప్పుల ఊబిలో చిక్కుకుంటూ విలవిల్లాడుతున్నారు. కొత్తగూడెంలోనే దాదాపు ప్రతీ రోజు రూ.50లక్షల నుండి కోటి రూపాయల దందా కొనసాగుతుందంటే ఆశ్చర్యం వేయకమానదు.
*కాసులు వెనకేసుకుంటున్న బుకీలు..
కళ్యాణి, శ్రీదేవి, టైమ్ బజార్, మాయబజార్ల పేర్లతో మట్కా దందాను కొనసాగిస్తున్న నిర్వహకులు వివిధ ప్రాంతాలలో బుకీలను ఏర్పాటు చేసుకొని వారికి కమిషన్ రూపంలో పెద్దమొత్తంలో చెల్లిస్తున్నారు. గతంలో సుమారు మూడుదశాబ్దాలు ఏకచత్రాధిపత్యంగా ఈ దందాను నడిపిన ఓ బుకీ ఆర్ధికంగా బాగానే ఆర్జించి విలువైన ఆస్తులను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆ వ్యక్తి ఈ మట్కా నుంచి వీడ్కోలు పలుకగా, అతనిని ఆదర్శంగా తీసుకున్న కొంతమంది బుకీలు పట్టణంలోని పెద్దల అండదండలతో దీనిని మూడుపూవ్వులు ఆరుకాయలుగా ఆర్జిస్తూ మధ్యతరగతి ప్రజల రక్తాన్ని తాగుతున్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాలలో ఈ దందాను కొనసాగించేందుకు నిర్వహకులకు బుకీలను ఏర్పాటు చేసుకొని తమ దందాను రాత్రింబవళ్ళు అడ్డుఅదుపులేకుండా కొనసాగించుకుంటున్నారు.
మట్కా దందాపై నిఘా పెంచి అరికట్టాలి..
కొత్తగూడెం పట్టణంలో ఎంజీ రోడ్ లోని ఓ ఫ్యాన్సీ షాపు నిర్వహకుడు, ఓ బ్యాగుల దుకాణంలో పనిచేసే వర్కర్, ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి పరిధిలో, రైతుబజార్ సమీపంలో, బూడిదగడ్డలో, ఎంజీ రోడ్, మేదరబస్తీలో, సఫాయిబస్తీలో, పాతకొత్తగూడెం, లక్ష్మీదేవిపల్లి మండలంలో లక్ష్మీదేవిపల్లి, చాతకొండ, హమాలీకాలనీలలో బుకీలుగా నియమించుకొని భయంకరమైన దందాను నిర్భయంగా కొనసాగిస్తున్నారు. ఇది ఇలాగే కొనసాగితే మధ్యతరగతి ప్రజలు నెంబర్ గేమ్ మత్తులో పడి పీకల్లోతు అప్పుల్లోకి కూరుకుపోయి కుటుంబాలు రోడ్డునపడే అవకాశాలు లేకపోలేదని, పోలీస్ అధికారులు మట్కా దందాపై నిఘా పెంచి అరికట్టి మధ్యతరగతి ప్రజలను రక్షించాలని, నిర్వహకులు, బూకీలకు అడ్డుకట్ట వేసి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.






