పడిపోతున్న పాతాళ గంగా, భద్రాద్రి కొత్తగూడెంలో ప‌రిస్థితులు దారుణం !

by velandi.Saikiran |   (  Updated:2026-05-12 22:00:59  IST  )

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భూ గర్భజలాలు నెమ్మదిగా అడుగంటుతున్నాయి.

పడిపోతున్న పాతాళ గంగా, భద్రాద్రి కొత్తగూడెంలో  ప‌రిస్థితులు దారుణం !
X

పడిపోతున్న పాతాళ గంగా

వర్షాలు తగ్గితే మరింత అడుగంటే అవకాశం

భద్రాద్రి వద్ద 3 అడుగుల మేర గోదావరి

తాగునీరు, వ్యవసాయం పై ప్రభావం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భూ గర్భజలాలు నెమ్మదిగా అడుగంటుతున్నాయి. గతేడాదితో పొలిస్తే భూగర్భజల మట్టం స్వల్పంగా పెరిగినా, ప్రస్తుతం మార్చి నెలలో జిల్లా సరాసరి భూగర్భ జల మట్టం 9.46 మీటర్లు నమోదు కాగా, మే నెల పొలిస్తే 0.5 మీటర్లు తగ్గింది. జిల్లాలోనే అత్యల్పంగా దుమ్ముగూడెం 4.24మీటర్లుగా నమోదు కాగా అత్యధికంగా కొత్తగూడెం 30.43మీటర్లుగా నమోదైంది. వ్యవసాయం అత్యధిక శాతం బోర్లు మీదే ఆధారపడి ఉండగా, ఈ పరిస్థితిలో భూగర్భ జలాలు అడుగంటితే పంటలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. మరోవైపు భద్రాద్రి వద్ద గోదావరి 3అడుగుల లోపు ప్రవహించడం ఆందోళన కలిగిస్తోంది. సుమారు 100కు పైగా గ్రామాలు తాగు నీటి కోసం గోదావరిపై ఆధారపడుతుండగా వాటి పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది.

దిశ భద్రాచలం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భూగర్భ జలాలు గత సంవత్సరం కంటే మెరుగ్గానే ఉన్నా... మార్చి నెల నుండి నెమ్మదిగా అడగంటుతున్నాయి. సమయానికి రుతుపవనాలు చేరుకొని వర్షాలు కురవకపోతే తాగునీరు, వ్యవసాయంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. భద్రాద్రి వద్ద గోదావరి 3అడుగుల లోపు ప్రవహించడం ఆందోళన కలిగిస్తుంది. తాగు నీరు కోసం గోదావరిపై ఆధారపడే గ్రామాలు సుమారు 100 కు పైనే ఉన్నాయి. 2026 ఏప్రిల్ నెల నాటికి జిల్లాలో సాధారణ వర్షపాతం 1164.0 మి.మీ. గాను 1395.67 మి.మీ.( 16.59శాతం ఎక్కువ) వర్షపాతం

నమోదైనది. ఏప్రిల్ 2026 మాసపు జిల్లా సరాసరి భూగర్భ జల మట్టం 9.96 మీటర్లుగా నమోదైనది. 2025 ఏప్రిల్ మాసం జిల్లా సరాసరి భూగర్భ జల మట్టం 10.48 మీటర్లు నమోదైనది. గత ఏడాదితో పొలిస్తే భూగర్భజల మట్టము 0.5 మీటర్లుపెరిగింది. 2026 మార్చి నెల జిల్లా సరాసరి భూగర్భ జల మట్టం 9.46 మీటర్లు నమోదు కాగా, ప్రస్తుత నెలతొ పొలిస్తే 0.5 మీటర్లు తగ్గింది. మండలాల వారిగా సరాసరి భూగర్భ జల మట్టాలు ఒకసారి పరిశీలిస్తే.. అత్యల్పంగా దుమ్ముగూడెం 4.24 మీటర్లుగా నమోదు కాగా అత్యధికంగా కొత్తగూడెం 30.43 మీటర్లుగా నమోదైనది.

6,59,743 ఎకరాల్లో వ్యవసాయం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 6,59,743 ఎకరాల్లో రైతులు వ్యవసాయం చేస్తున్నారు.. ఇందులో 2.25లక్షల ఎకరాల్లో పత్తి, లక్ష ఎకరాల్లో మొక్కజొన్న, 1.75 లక్షల ఎకరాల్లో వరి సాగుచేస్తుండగా, మిగిలిన భూమిలో మిర్చి, ఇతర పంటలు పండిస్తున్నారు. వ్యవసాయం అత్యధిక శాతం బోర్లు మీదే ఆధారపడి పంటలు పండిస్తున్నారు. ఈ పరిస్థితిలో భూగర్భ జలాలు అడుగంటితే వ్యవసాయం పై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.

ఎలా కొలుస్తారంటే..

భూగర్భ జలాల పర్యవేక్షణకు జిల్లా భూగర్భ జలశాఖ అధికారులు ప్రతి నెల జిల్లాలో 79 ఫిజో మీటర్లు, 19 అబ్జర్వేషన్ బావుల నుంచి భూగర్భ జల మట్టాలు కొలతలు తీసి జల మట్టాలు హెచ్చు తగ్గులు లెక్కిస్తారు.

Next Story