ఉంటుందో.. పోతుందో ? సర్‌‌ పట్ల ఓటర్ల అయోమయం

by velandi.Saikiran |

స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) మా ఓట్లు ఉంటాయో లేదో అని ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.

ఉంటుందో.. పోతుందో ? సర్‌‌ పట్ల ఓటర్ల అయోమయం
X

ఉంటుందో.. పోతుందో

=సర్‌‌ పట్ల ఓటర్ల అయోమయం

=2002సంవత్సరం జాబితాతో ఇబ్బందులు

=ఓట్లు తొలగిస్తారని భయాందోళనలు

స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) మా ఓట్లు ఉంటాయో లేదో అని ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా 2002లో తమ ఓటుకు సంబంధించిన వివరాలు నమోదు చేయాలని అధికారులు ఇచ్చిన ఫారాల్లో కోరడంతో ఆ వివరాల దొరక్క ఓటర్లు సతమతం అవుతున్నారు. 2002లో ఓటు సమాచారం తెలిసినా తమ వివరాలు తప్పులతడకగా ఉండటంతో ఏం చేయాలో తెలియని దిక్కుతోచని స్థితిలో పడ్డారు. బూత్ లెవలు అధికారులు (బీఎల్‌ఓ) ఇంటింటికి తిరిగి ఎన్యుమరేషన్ ఫారాలు పంచవలసి ఉండగా కొందరు బీఎల్ఓలు ఫారాలు పంచలేక, అవగాహన కల్పించలేక పలు డివిజన్లలో టెంట్లు వేసి కూర్చుంటున్నారు. ఇప్పటికీ 50 శాతం మాత్రమే ఫారాల పంపిణీ జరిగింది. ఇంకో 20రోజుల్లో ఫారాల స్వీకరణ గడువు ముగుస్తుండగా ఓటర్లు తికమక పడుతున్నారు.

దిశ, ఖమ్మం కార్పొరేషన్: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్.. ఓటర్ల ప్రత్యేక సవరణ.. ప్రజల గుండెల్లో దడ పుట్టిస్తున్నది. తమ ఓట్లు ఉంటాయో లేదో అన్న ఆందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా 2002లో తమ ఓటుకు సంబంధించిన వివరాలు నమోదు చేయాలని అధికారులు ఇచ్చిన ఫారాలలో కోరటంతో ఆ వివరాల దొరక్క ఓటర్లు సతమతమవుతున్నారు. ఓ వైపు సర్వర్ సమస్య.. మరోవైపు 2002 లో ఓటు సమాచారం తెలిసినా తమ వివరాలు తప్పులతడకగా ఉండటంతో ఏం చేయాలో తోచక తలలు పట్టుకుంటున్నారు. బూత్ లెవలు అధికారులు (బీఎల్‌ఓ) ఇంటింటికి తిరిగి ఎన్యుమరేషన్ ఫారాలు పంచవలసి ఉండగా ఇప్పటికీ సగం కూడా పూర్తి కాలేదు. ఇంకో 20 రోజుల్లో ఫారాల స్వీకరణ గడువు ముగుస్తుండగా ఏం చేయాలో తోచక ఓటర్లు తికమక పడుతున్నారు. ఒకచోట టెంటు వేసి బీఎల్ఓలు అందులో కూర్చుంటున్నారు. ఫారాలు ఎలా పూర్తి చేయాలో తెలవక ఓటర్లు అయోమయానికి గురికావడమే కాకుండా ఎన్నో ఏళ్లుగా తమకు ఉన్న ఓటు ఓటు హక్కు పోతుందని భయపడుతున్నారు.

స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ద్వారా..

స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్ ) ద్వారా చనిపోయిన ఓటర్లను, రెండు చోట్ల ఓటు ఉన్న ఓటర్లను తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వం సర్వే నిర్వహిస్తున్నది. అందులో భాగంగా ప్రతి ఓటరుకు ఒక ఫారం ఇచ్చి దానిని నింపిన తర్వాత తిరిగి బిఎల్ఓ లకు ఇవ్వాలని సూచించారు. అయితే ఈ ప్రక్రియలో మొదటి నుంచి బాలారిష్టాలు మొదలయ్యాయి.

బీఎల్‌ఓల ద్వారా పారాల పంపిణీ

బూత్ లెవల్ అధికారులు (బీఎల్‌ఓ) ద్వారా ప్రతి ఇంటికి తిరిగి ఓటర్లకు ఫారాలు అందజేయాల్సి ఉంటుంది. క్షేత్రస్థాయిలో ఈ పని జరగట్లేదు. ఉదాహరణకి ఖమ్మం నియోజకవర్గం తీసుకుంటే ఈ నియోజకవర్గంలో 355 పోలింగ్ బూతులు ఉండగా 355 మంది బీఎల్‌ఓలను నియమించారు. ఒక్కో పోలింగ్ కేంద్ర పరిధిలో సుమారు 500 నుంచి 700 మంది ఓటర్లు ఉండగా వారందరికీ ఈ బీఎల్‌ఓలు ఫారాలు పంచాల్సి ఉంది. అయితే బీఎల్ఓలుగా నియమించిన వారిలో పలువురికి తీవ్ర అనారోగ్య సమస్యలున్నాయి. తాము ఈ విధులు నిర్వహించలేమని మొత్తుకున్నా వారికి బలవంతంగా విధులు అంటగట్టారు. పలువురికి చదువు రాకపోయినా బాధ్యతను అప్పగించారు. దీంతో అందరికీ ఫారాలు పంచ లేక వారాలపై అవగాహన కల్పించలేక పలు డివిజన్లలో టెంట్లు వేసి కూర్చుంటున్నారు. ఇప్పటికీ 50 శాతం మాత్రమే ఫారాల పంపిణీ జరిగింది.

2002 ఓటర్ల జాబితా ఒక ప్రహసనం

ఓటర్ల ప్రత్యేక సవరణ కార్యక్రమంలో భాగంగా 2002లో ఓటు హక్కు వివరాలను ఫారంలో కచ్చితంగా నమోదు చేయాల్సి ఉంది. అయితే 2002 ఓటర్ల జాబితా ఒక ప్రహసనంగా మారింది. అప్పటి ఓటర్ల పేర్లు తప్పులు తడకగా మారాయి. పూర్తి పేరులో సగం ఉండటం, ఇంటి పేరులో కొన్ని అక్షరాలు మాయం అవ్వడం జరిగింది . దీంతో ఆ వివరాలను రాస్తే తమ ఓటు హక్కు పోతుందని ఓటర్లు భయపడుతున్నారు. 2002 ఓటర్లు జాబితాలో వివరాలు లేకుంటే తమ తల్లిదండ్రులు తాతయ్య అమ్మమ్మలకు ఓట్లు ఉంటే వారి వివరాలు పెట్టాలని చెప్పటం హాస్యాస్పదంగా మారింది. వారి వివరాలు ఇప్పుడు ఎక్కడ దొరుకుతాయని పలువురు ఓటర్లు ప్రశ్నిస్తున్నారు . ఇక ఆన్లైన్లో ఫారాలు పూర్తి చేయాలని అధికారులు ఇచ్చినప్పటికీ ఆన్లైన్ పనిచేయక ఓటర్లు ఇబ్బందులు పడుతున్నారు. 2002లో తమ పేరు ఓటర్ల జాబితా లేకుంటే 11పత్రాలు దాఖలు చేయాలని అధికారులు సూచిస్తుంటే అసలు ఆ పత్రాలు నిరక్షరాస్యులకు ఉండే అవకాశం లేదు. ఇక తక్కువ విద్యార్హత ఉన్నవారికి ఆ పత్రాలు లభించే అవకాశం లేదు.

ఎవరు ఆందోళనకు గురికావొద్దు : ఎలక్షన్ సెల్ ఆర్ఐ కొండలరావు

ఫారాలు పూర్తి చేసే విషయంలో ఎవరూ ఆందోళన చెందవద్దు. తమ వద్ద ఉన్న వివరాలు ఫారంలలో పూర్తిచేసి బీఎల్ఓలకు అందజేయాలి. అందులో తప్పులు ఉంటే మళ్లీ నోటీసు ఇచ్చి అధికారులు సరిచేస్తారు. 2002 ఓటర్లు జాబితాలో వివరాలు ఉంటే ఫారంలో పూర్తి చేయాలని లేకుంటే తమ వద్ద ఉన్న ఏదో ఒక ఆధారం దానికి జత చేయాల. ఫారం 8 ద్వారా సవరణలు చేసుకోవచ్చని, ఎవరి ఓటు తొలగించరు.

Next Story