ఏడాదిన్నరలో ఎలివేటెడ్ కారిడార్లే లక్ష్యం.. రక్షణ శాఖ భూముల సేకరణపై CM స్పెషల్ ఫోకస్

by Kema Shiva Kumar |

హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు హెచ్ఎండీఏ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డెయిరీ ఫామ్, శామీర్‌పేట్ ఎలివేటెడ్ కారిడార్లపై సర్కార్ స్పెషల్ ఫోకస్ పెట్టింది.

ఏడాదిన్నరలో ఎలివేటెడ్ కారిడార్లే లక్ష్యం.. రక్షణ శాఖ భూముల సేకరణపై CM స్పెషల్ ఫోకస్
X

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ నుంచి ఔటర్ రింగ్ రోడ్డు వరకు ట్రాఫిక్ సమస్య లేకుండా హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో రెండు ఎలివేటెడ్ కారిడార్లను చేపట్టింది. ప్యారడైజ్ జంక్షన్ నుంచి డెయిరీ ఫామ్ రోడ్(జాతీయ రహదారి44 కలిపేందుకు) వరకు 5.4 కి.మీ ఎలివేటెడ్ కారిడార్, ప్యారడైజ్ నుంచి శామీర్‌పేట్ ఓఆర్‌ఆర్ జంక్షన్ వరకు (రాజీవ్ రహదారి) 18కి.మీ మరో ఎలివేటెడ్ కారిడార్ పనులపై రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. వీటికి సంబంధించిన భూసేకరణ ప్రక్రియ జరుగుతోంది. అయితే రక్షణ శాఖ నుంచి రావాల్సిన భూములపై నేరుగా సీఎం రేవంత్ రెడ్డినే పర్యవేక్షిస్తున్నారు. ఏడాదిన్నరలో రెండు ఎలివేటెడ్ కారిడార్లను పూర్తిచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ దిశగా హెచ్ఎండీఏ అధికారులు కసరత్తు చేస్తున్నారు.

డెయిరీ ఫామ్ కారిడార్ పనులు 45 శాతం

ప్యారడైజ్ నుంచి డెయిరీ ఫామ్(నేషనల్ హైవే 44) ఎలివేటెడ్ కారిడార్ ను రూ.1,487కోట్లతో 5.4 కిలోమీటర్ల నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కారిడార్ లో 3.095 కిలోమీటర్ల మేర ఎలివేటెడ్ కారిడార్ ఉంటుంది. 600 మీటర్లు బేగంపేట్ ఎయిర్‌పోర్ట్ రన్ వే కింద నుంచి‌ వెళ్తోంది. మొత్తం 3.2 కిలోమీటర్లు మిలటరీ భూముల్లోని వెళ్తోంది. ఈ కారిడార్‌లోని 90 పిల్లర్లకుగాను ఇప్పటికే 22 పిల్లర్లకు సంబంధించిన పనులు పూర్తయ్యాయి. ఆరు పిల్లర్లపై పియర్ క్యాప్స్ పూర్తి చేశారు. 33 గిడ్డర్లను తయారు చేశారు. ఏడాదిన్నరలో ఈ కారిడార్ ను పూర్తిచేయాలని హెచ్ఎండీఏ టార్గెట్‌గా పెట్టుకుందని అధికారులు చెబుతున్నారు.

రెండు ర్యాంపులు..1.5కి.మీ. ఓపెన్ అండర్‌పాస్..

డెయిరీ ఫామ్ ఎలివేటెడ్ కారిడార్‌లో రెండు ర్యాంపులను ఏర్పాటు చేయడానికి బోయిన్ పల్లి జంక్షన్ దగ్గర రెండు వైపుల రెండు లేన్ల ర్యాంపులను ఏర్పాటు చేయనున్నారు. దీంతోపాటు బాలానగర్ నుంచి మేడ్చల్ వెళ్లడానికి రెండు వైపుల ర్యాంపులను ఏర్పాటు చేయనున్నారు. వీటితోపాటు ఈ కారిడార్ లో 1.5 కిలోమీటర్ల ఓపెన్ అండర్ పాస్ ను ఏర్పాటు చేయనున్నారు. టివోలీ, జనరల్ చౌదరి, సికింద్రాబాద్ క్లబ్ జంక్షన్ల వద్ద లోకల్ ట్రాఫిక్ కోసం అండర్ పాస్ పై స్లాబ్ వేయనున్నారు. సుమారు 5మీటర్ల లోతులో ఉన్న అండర్ పాస్ లో నీళ్లు నిలిస్తే ఎప్పటికప్పుడు ఖాళీ చేయడానికి రెండు మోడ్రన్ టెక్నాలజీతో కూడిన భారీ పంపులను ఏర్పాటు చేయనున్నారు.

శామీర్‌పేట్ ఎలివేటెడ్ కారిడార్‌లో..

ప్యారడైజ్ నుంచి శామీర్‌పేట్ ఎలివేటెడ్ కారిడార్‌లో మూడు ర్యాంపులు, ఒక వెహికిలర్ అండర్ పాస్‌ను ఏర్పాటు చేయనున్నారు. కార్ఖాన, తిరుమలగిరి, అల్వాల్ ప్రాంతాలను కారిడార్‌ను ఎక్కడానికి, దిగడానికి ర్యాంపులను ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. ప్యారడైజ్ నుంచి శామీర్‌పేట్ ఓఆర్ఆర్ జంక్షన్ వరకు రూ.4,263కోట్లతో చేపట్టిన 18.14కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్ పనులు ఆగస్టులో ప్రారంభంకానున్నాయి. ఇప్పటికే భూసేకరణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ కారిడార్ 9.8 కిలోమీటర్లు రక్షణశాఖకు సంబంధించిన భూముల నుంచి పోతుంది. మరో 450 మీటర్ల వరకు టన్నెల్ మార్గంలో హకీంపేట్ ఎయిర్ ఫోర్స్ ఎయిర్ పోర్టు నుంచి నిర్మించాల్సి ఉంది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన రక్షణ శాఖ భూములను ఇప్పటికే 40శాతం హెచ్ఎండీఏ స్వాధీనం చేసుకున్నది. ఆగస్టు వరకు భూసేకరణ పనులను పూర్తిచేయడంతోపాటు కారిడార్ నిర్మాణ పనులను ప్రారంభించినున్నట్టు అధికారులు చెబుతున్నారు.

భూసేకరణపై స్పెషల్ ఫోకస్..

ఎలివేటెడ్ కారిడార్లు, మూసీ పునరుజ్జీవనం ప్రాజెక్టులకు సంబంధించిన రక్షణ భూముల సేకరణ అంశాన్ని నేరుగా సీఎం రేవంత్ రెడ్డినే పర్యవేక్షిస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. రెండు కారిడార్లకు సంబంధించి 165.587ఎకరాల రక్షణ భూములకుగాను ఇప్పటికు 91.79 ఎకరాల భూములను హెచ్ఎండీఏ స్వాధీనం చేసుకున్నది. మరో 73.79ఎకరాల భూములను స్వాధీనం చేసుకోవాల్సి ఉంది. దీంతో పాటు రక్షణ శాఖకు సంబంధించి కాంపౌండ్ వాల్స్, ఇతర నిర్మాణాల కోసం ఇప్పటి వరకు రూ.56 కోట్లు ఖర్చు చేసినట్టు అధికారులు చెబుతున్నారు. బాలమ్ రాయ్ దగ్గర కంటోన్మెంట్ బోర్డుకు సంబంధించిన సంపు, పంప్ హౌస్ ను మోడ్రన్ టెక్నాలజీతో హెచ్ఎండీఏ నిర్మిస్తోంది. బోయిన్ పల్లిలో కూడా సంపును పూర్తిచేశారు. డెయిరీ ఫామ్ కారిడార్ లో 36 రక్షణ శాఖ నిర్మాణాలకుగాను 29నిర్మాణాల పనులు పురోగతిలో ఉన్నాయి. శామీర్ పేట్ కారిడార్ లో 91నిర్మాణాలకుగాను ఐదింటిని పూర్తి చేశారు. 79పనులు టెండర్ దశలో ఉన్నాయి. మరో 6పనులు ప్రారంభం కావాల్సి ఉంది.

ప్రీ కాస్టింగ్ విధానంలోనే…

రెండు కారిడార్లకు సంబంధించిన పనులు ప్రీకాస్టింగ్ విధానంలో చేపడుతున్నారు. డెయిరీ ఫామ్ కారిడార్ నిర్మాణ సంస్థ అయితే ఎంవీఆర్ సంస్థ తన కాస్టింగ్ కండ్లకోయలో ఏర్పాటు చేసింది. అక్కడే పియర్ క్యాప్స్ తయారు చేస్తోంది. దీంతోపాటు శామీర్ పేట్ కారిడార్‌కు సంబంధించిన నిర్మాణ సంస్థ బెకెమ్ ఏజెన్సీ హకీంపేట్‌లో కాస్టింగ్ ఏర్పాటు చేసుకుంది. దీంతోపాటు రెండు ఎలివేటెడ్ కారిడార్‌లను పర్యవేక్షించడానికి, క్వాలిటీ చెక్ చేయడానికి ఆర్వీ కన్సల్టెన్సీని నియమించారు. ఎప్పటికప్పుడు చెక్ చేయడానికి మోడ్రన్ టెక్నాలజీతో కూడిన క్వాలిటీ ల్యాబ్ కూడా ఏర్పాటు చేశారు.

Next Story