Accident: కారును ఢీకొట్టిన ప్రైవేటు బస్సు.. స్పాట్‌లోనే నలుగురు దుర్మరణం

by Kema Shiva Kumar |   (  Updated:2026-07-05 02:23:52  IST  )

హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై ఇవాళ తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

Accident: కారును ఢీకొట్టిన ప్రైవేటు బస్సు.. స్పాట్‌లోనే నలుగురు దుర్మరణం
X

దిశ, వెబ్‌డెస్క్: రోడ్డు ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన నల్లగొండ (Nalgonda) జిల్లాలో ఇవాళ తెల్లవారుజామున చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. చిట్యాల (Chityal) మండల పరిధిలోని పెద్దకాపర్తి (Pedda Kaparthi గ్రామ శివారులో అతివేగంగా వచ్చిన ట్రావెల్స్ బస్సు ఎదురుగా ఉన్న కారును బలంగా ఢీకొట్టింది. ప్రమాదం ధాటికి కారు పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది. దీంతో కారులో ఉన్న నలుగురు తీవ్ర క్షతగాత్రులై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

ఈ ఘటనలో కారు డ్రైవర్ తీవ్ర గాయాలతో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతుండగా గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. స్థానికుల సమాచారం మేరకు స్పాట్‌కు చేరుకున్న చిట్యాల పోలీసులు ప్రమాద తీవ్రతను పరిశీలించి, తీవ్రంగా గాయపడిన కారు డ్రైవర్‌ను చికిత్స నిమిత్తం అత్యవసరంగా సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అనంతరం మృతదేహాలను జేసీబీ సాయంతో కారులో నుంచి వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతులకు సంబంధించిన పూర్తి వివరాలు, వారు ఎక్కడి నుంచి వస్తున్నారు అనే విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ ప్రమాదంతో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై కాసేపు ట్రాఫిక్ నిలిచిపోగా, పోలీసులు వాహనాలను పక్కకు తొలగించి రాకపోకలను పునరుద్ధరించారు.

Next Story