- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కవిత ‘టీఆర్ఎస్’కు బ్రేకులేసిన ఈసీ.. పార్టీ పేరు మార్పు అనివార్యం?
కల్వకుంట్ల కవిత స్థాపించిన 'తెలంగాణ రక్షణ సేన' (TRS) పార్టీ పేరు మార్పుపై కేంద్ర ఎన్నికల సంఘం డెడ్‌లైన్ విధించింది.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి కల్వకుంట్ల కవిత పార్టీ పేరు చర్చనీయాంశంగా మారింది. రాజకీయ పార్టీకి పేరు అనేది కేవలం గుర్తింపు మాత్రమే కాదు.. ఆ పార్టీ చరిత్ర, భావజాలం, ఉద్యమం, నాయకత్వానికి ప్రతీక. అలాంటి పరిస్థితుల్లో కవిత స్థాపించిన తెలంగాణ రక్షణసేన(టీఆర్ఎస్) పార్టీ పేరుపై అనిశ్చితి నెలకొంటే దాని ప్రభావం రాజకీయంగానూ కనిపించే అవకాశం లేకపోలేదు. బీఆర్ఎస్ పార్టీలో ఏకంగా తండ్రి కేసీఆర్‌తో విభేదించి కవిత కొత్త పార్టీని స్థాపించారు.ర కానీ.. ఆ పార్టీ పెట్టిన సంబురం మూణ్నాళ్ల ముచ్చటగానే కనిస్తున్నది. ఆమె స్థాపించిన తెలంగాణ రక్షణ సేనపై పెద్దఎత్తున అభ్యంతరాలు వెల్లువెత్తడంతో పార్టీ భవిష్యత్ అంధకారంలో పడినట్లయింది. చివరకు కవిత పార్టీ పేరు మార్చక తప్పదా? అన్న చర్చ నడుస్తున్నది.
వేర్వేరు పేర్లు..
బీఆర్ఎస్ నుంచి బయటికి వచ్చాక కవిత ఏప్రిల్ 25న కొత్తపార్టీని ప్రకటించారు. మునీరాబాద్ ఆవిర్భావ వేడుకలో ‘తెలంగాణ రాష్ట్ర సేన’గా అనౌన్స్ చేశారు. జెండానూ ప్రదర్శించారు. ఆ తర్వాతి పరిణామాల నేపథ్యంలో ఏప్రిల్ 28న కవిత పార్టీ పేరును ‘తెలంగాణ రక్షణ సేన’(టీఆర్ఎస్)గా కేంద్రం ఎన్నికల సంఘం ప్రాథమికంగా గుర్తించింది. కేవలం మూడు రోజుల్లోనే పార్టీపేరు రెండు విధాలుగా ప్రజల్లోకి వెళ్లింది. దీంతో కవిత అభిమానుల్లో అప్పటికే అలజడి మొదలైంది. ఆ వెంటనే ఎన్నికల సంఘం ‘తెలంగాణ రక్షణ సేన’పై అభిప్రాయాలను కోరింది.
పార్టీ పేరు మార్చాల్సిందే: ఈసీ
పేరు నమోదు చేయించే సమయంలో ఇప్పటికే ఉన్న పార్టీల పేర్లతో పోలిక ఉండకూడదు. ఓటర్లలో గందరగోళం కలిగించే అవకాశం లేకుండా.. చట్టపరమైన నిబంధనలకు అనుగుణంగా పేరు మార్చుకోవాలని ఎన్నికల సంఘం షరతులు పెట్టింది. ఈ అంశాలను పరిశీలించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటుంది. కానీ, కవిత మాత్రం టీఆర్ఎస్ పేరు కలిసొచ్చేలా పార్టీని ప్రకటించడంతో రాష్ట్రవ్యాప్తంగా వెయ్యికి పైగా అభ్యంతరాలు వచ్చాయి. పొరుగు రాష్ట్రం నుంచి సైతం పలువురు అభ్యంతరం తెలిపారు. దీంతో ఎలక్షన్ కమిషన్ పార్టీ పేరు మార్చుకోవాలని తాజాగా కవితకు ఆదేశాలు జారీచేసింది. 15 రోజుల్లోగా మూడు పేర్లను పంపించాలని, లేదంటే పార్టీ దరఖాస్తును తొలగించాల్సి వస్తుందని ఈసీ స్పష్టం చేసింది.
న్యాయ పోరాటానికి కవిత సిద్ధం
ఒకవేళ ప్రతిపాదించిన పేరుకు ఎన్నికల సంఘం అంగీకారం ఇవ్వకపోతే న్యాయస్థానంలో సవాల్ చేస్తానని కవిత ప్రకటించారు. కొత్త పేర్లు ఇచ్చేది లేదని ఆమె స్పష్టం చేశారు. అయితే కవిత చెప్పినట్టు కోర్టుకు వెళ్లినంత మాత్రాన పార్టీ పేరును అలాగే కొనసాగింపునకు అనుకూలంగా తీర్పు వస్తుందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిణామాల మధ్య కవిత రాజకీయ పాత్రపైనా చర్చ మొదలైంది. పార్టీ పేరు ప్రకటించి.. ఇటీవలే రాష్ట్రవ్యాప్తంగా పార్టీ జెండాలను ఆవిష్కరిస్తూ వస్తున్నారు. ఇప్పటికే చాలా వరకు జిల్లాల్లో ఈ కార్యక్రమాలూ పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో ఒకవేళ న్యాయస్థానం సైతం కవిత వినతిని తిరస్కరిస్తే ఆమె భవితవ్యం ఏమిటన్న చర్చ మొదలైంది. ఒకవేళ కొత్తపార్టీ పేరు ప్రకటించాల్సి వస్తే ఆమె మళ్లీ ఏ పేరు తీసుకుంటారు..? ఈసీ ఏం నిబంధనలు పెట్టనుంది..? అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఒకవేళ పేరు మార్చాల్సి వస్తే జెండా, రంగులు ఎలా ఉండబోతున్నాయని ఆ పార్టీ నాయకుల్లో చర్చ కనిపిస్తున్నది.






