- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రేషన్.. ‘కరప్షన్’!
రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్నారు. ఓవైపు డీలర్లు, మరోవైపు గోడౌన్ సిబ్బంది.. ఇలా ఎవరికి దొరికినంతవారు దోచుకొని స

రేషన్.. ‘కరప్షన్’!
ఎంఎల్ఎస్ పాయింట్ల వద్దే అక్రమాలు!
- పక్కదారి పడుతున్న సన్న బియ్యం
- లంచాలు తీసుకొని తప్పుడు నివేదికలు?
- జీపీఎస్ ను సైతం తికమక పెట్టి మోసం
- బయటపడ్డ రేషన్ అక్రమాల బాగోతం
దిశ, కొత్తగూడెం: పేదల కడుపు నింపేందుకు ప్రభుత్వం ఇస్తున్న రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్నారు. ఓవైపు డీలర్లు, మరోవైపు గోడౌన్ సిబ్బంది.. ఇలా ఎవరికి దొరికినంతవారు దోచుకొని సొమ్ము చేసుకుంటున్నారు. లబ్ధిదారులకు కేజీకి రూ. 8 నుంచి రూ. 10 చెల్లిస్తూ.. రాత్రికి రాత్రే బార్డర్ దాటిస్తున్నారు. అయితే గోడౌన్ సిబ్బంది సైతం తప్పుడు లెక్కలు చూపిస్తూ రేషన్ బియ్యాన్ని దారి దారిమళ్లిస్తున్నట్లు ఇటీవల విచారణలో వెల్లడవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
పట్టించుకోని శాఖ అధికారులు
పాల్వంచ గోడౌన్ నుంచి బియ్యాన్ని తరలిస్తున్నట్లు భావిస్తున్న ఓ లారీని ఇటీవల ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు చాకచక్యంగా పట్టుకున్నారు. లారీని స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ నెల రెండో తేదీన సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు చేసిన సాధారణ తనిఖీల్లో ఈ విషయం బయటపడింది. ఓ మేస్త్రీ ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు స్థానికంగా చర్చ జరుగుతున్నది. విచారణ కోసం హైదరాబాద్ నుంచి ఆ శాఖ కీలక అధికారులు వచ్చినట్లు తెలిసింది. ఏడుగురు రేషన్ డీలర్లను ఎంక్వయిరీ చేస్తున్నట్టు సమాచారం. ఇటీవల ఆయా షాపులను పరిశీలించిన సమయంలో.. నేరుగా ఎంఎల్ఎస్ పాయింట్ల వద్ద విధులు నిర్వహిస్తున్న సిబ్బందితో కుమ్మక్కై బియ్యాన్ని పక్క దారి పట్టిస్తున్నట్లు గుర్తించారు.
నల్లబజారుకు తరలిపోతున్న పేదల బియ్యం
జిల్లా వ్యాప్తంగా కొత్తగూడెం, పాల్వంచ, మణుగూరు, అశ్వరావుపేట, ఇల్లందు, భద్రాచలంలో స్టాక్ పాయింట్లు ఉన్నాయి. 444 రేషన్ షాపులు ఉన్నాయి. రేషన్ షాపులు, స్టాక్ పాయింట్ల ద్వారానే రేషన్ బియ్యం పక్కదారి పడుతున్నదని అధికారుల విచారణలో బయటపడింది. బహిరంగ మార్కెట్లో ఈ బియ్యాన్ని రూ. 50కి విక్రయిస్తున్నట్లు భావిస్తున్నారు. గోడౌన్ల నుంచి లారీలో రేషన్ దుకాణాలకు బియ్యం సరఫరా చేసే సమయంలో జియో ట్యాగ్ ద్వారా రవాణా వ్యవస్థను పరిశీలించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దీని ద్వారా లారీలో ఉన్న బియ్యం నేరుగా డీలర్ల వద్దకు చేరుతుందా? లేదా? అని ఎంఎల్ఎస్ పాయింట్ల వద్దనుంచే పరిశీలించవచ్చు. అయితే సిబ్బంది డీలర్లతో కుమ్మకై బియ్యం తమ వద్దే ఉంచుకొని.. రాత్రి వేళలో రహస్యంగా ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నట్లు సమాచారం. తప్పుడు వివరాలను ఎంటర్ చేయడంతో బియ్యం బార్డర్ దాటిపోతున్నా.. ఆన్ లైన్ లో అలాంటిదేమీ కనిపించకపోవడంతో ఈ విషయం ఇన్ని రోజులు బయటపడలేదు. తాజాగా అధికారులు నిర్వహించిన తనిఖీల్లో అసలు వాస్తవాలు బయటపడటంతో గుట్టు రట్టయినట్లు సమాచారం.
ఆకస్మిక దాడులు చేస్తాం
- ప్రేమ్ కుమార్, పౌరసరఫరాల శాఖ అధికారి
పౌరసరఫరాల శాఖలో అవినీతిని సహించేది లేదు. అన్ని రేషన్ దుకాణాలు, రైస్ మిల్లులు, స్టాక్ పాయింట్లలో ఆకస్మిక దాడులు నిర్వహిస్తాం. స్టాక్ రిజిష్టర్లను పరిశీలించాం. ఏమైనా తేడాలుంటే చర్యలు తీసుకుంటాం.






