- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సీతమ్మకే ఆదాయం..పంచాంగంలో రామయ్య రాజపూజ్యం తక్కువే
భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో గురువారం శ్రీరామనవమి తిరుకళ్యాణ బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభం అయ్యాయి.

సీతమ్మకే ఆదాయం
- పంచాంగంలో రామయ్య రాజపూజ్యం తక్కువే
- భద్రాద్రిలో ఘనంగా మొదలైన బ్రహ్మోత్సవాలు
- కళ్యాణానికి సీఎంను ఆహ్వానించిన అధికారులు
దిశ, భద్రాచలం/తెలంగాణ బ్యూరో: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో గురువారం శ్రీరామనవమి తిరుకళ్యాణ బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభం అయ్యాయి. మొదటిరోజు శ్రీ పరాభవ నామ సంవత్సరాది ఉగాది పండుగను పురస్కరించుకొని ఉదయం ఉగాది ప్రసాద వితరణ గావించారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక అభిషేకం నిర్వహించి, ఉత్సవాంగీకార సూచికంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అయితే గత 70ఏళ్లుగా తొమ్మిది రోజులపాటు నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా.. మొదటిరోజు గురువారం ఉదయం నిత్యవిధి అనన్తరం ప్రత్యేకంగా పవిత్ర గౌతమీనది నుంచి మంగళ వాద్యములతో తీర్థబిందె తీసుకువచ్చి అలంకార ఆరాధన జరిపారు. అనంతరం భక్తులు శ్రీస్వామివారి అనుజ్ఞ తీసుకున్నారు. తర్వాత శ్రీ విశ్వక్సేన ఆరాధన, సకల ద్రవ్య, స్థల, వాహనాది శుద్ధి నిమిత్తం వాసుదేవ పుణ్యాహవచనం జరుపుకుని పరిషత్పార్ధన పూర్వకంగా ఆచార్యాది ఋత్విగ్వరణం నిర్వహించారు.
ప్రత్యేక పూజలు
గురువారం సాయంత్రం 6గంటలనుంచి స్థానిక గోవిందరాజస్వామి ఆలయం (తాతగుడి) వద్దకు శ్రీస్వామివారిని, విశ్వక్సేనులు, గరుత్మంతుడు, శ్రీసుదర్శనస్వామి, ఆంజనేయస్వామిని ఊరేగింపుగా తీసుకెళ్లి మృత్సంగ్రహణ కార్యక్రమం నిర్వర్తించారు. అనంతరం సంస్కరించబడిన మృత్తికా పాత్రలతో సహా ఆలయంకు వచ్చి యాగశాలలో అంకురారోపణ, అఖండస్థాపన, శాలాపూజలు నిర్వర్తించి నాందీ దేవతారాధనము, వాస్తుపూజా కార్యక్రమములు పూర్తిచేశారు. యాగశాల కోణంలలో ఉన్న ఉపవేదికలందు వరుసగా అఖండము, వాస్తుమండలము, నాందీకలశము, పాలికలు స్థాపించి నివేదనా, మంగళా శాసనములతో నిర్వహించారు. స్వామివారికి కల్పవృక్ష వాహనంపై తిరువీధి సేవ జరిపారు. ఆ తర్వాత నూతన పంచాంగ శ్రవణం గావించారు. చివరగా ఉత్సవాల అంకురార్పణ కొరకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. బ్రహ్మోత్సవాల మొదటిరోజే భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.
రామయ్య ఆదాయం తక్కువే
శ్రీ పరభవ నామ సంవత్సర పంచాంగ శ్రవణం రామాలయంలో ఆలయ స్థానాచార్యులు స్థలాశాయు గావించారు. పంచాంగం ప్రకారం ఈ సంవత్సరం రామయ్య ఆదాయం కంటే సీతమ్మ వారిదే ఎక్కువగా ఉంది. శ్రీరాముని కర్కాటక రాశీ ఫలాలు ఆదాయం 2, వ్యయం 11 ఉండగా, సీతమ్మ వారి కన్యారాశీ ఫలం ప్రకారం అమ్మవారికి ఆదాయం 8 కాగా వ్యయం 11 ఉంది. అలాగే రామయ్య రాజపూజ్యం 4 కాగా, అవమానం 7గా ఉండగా, అమ్మవారికి రాజపూజ్యం 3, అవమానం 3గా ఉంది.
సీఎంకు ఆహ్వానం
ఈనెల 27న భద్రాచలంలో జరిపించే సీతారాముల కళ్యాణానికి రావాల్సిందిగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని భద్రాచల శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానం తరపున మంత్రి కొండా సురేఖ, దేవాదాయ శాఖ డైరెక్టర్ హనుమంతరావు, ఈవో దామోదర్ రావు, ఆలయ అర్చకులు ఆహ్వానించారు. నెల 27న రూ.300కోట్లతో జరిగే దేవాలయ అభివృద్ధి పనులకు సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. దీంతో అధికారులు ఇందుకు సంబంధించిన పనుల్లో అప్రమత్తం అవుతున్నారు. అలాగే మార్చి 19 నుంచి ఏప్రిల్ 2 వరకు శ్రీరామనవమి తిరుకళ్యాణ బ్రహ్మోత్సవాలు జరగనుండగా మొదటిరోజు కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, ఎంపీ వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు పాల్గొన్నారు. 27న భద్రాచల శ్రీ సీతారామచంద్రస్వామి వారి తిరుకళ్యాణ మహోత్సవం జరగనుండగా.. దేవాలయ అభివృద్ధి పనులపై ఉన్నతాధికారులతో డిప్యూటీ సీఎం, మంత్రులు సమీక్షించి కీలక ఆదేశాలు జారీ చేయనున్నారు. భద్రాచలం దేవాలయాన్ని దేశంలోనే ప్రముఖ ఆలయంగా తీర్చిదిద్దాలని నిర్ణయించగా నిధులు కేటాయించారు. మరికొంత భూ సేకరణ జరగాల్సి ఉంది.






