రేగళ్లలో రియల్ ఎస్టేట్ కలకలం..!

by Kodari Anjali |

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం రేగళ్ల గ్రామపంచాయతీ పరిధిలోని సర్వే నంబర్–98లో జరుగుతున్నట్లు ప్రచారంలో ఉన్న వెంచర్ కార్యకలాపాలు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి.

రేగళ్లలో రియల్ ఎస్టేట్ కలకలం..!
X

దిశ, లక్ష్మీదేవిపల్లి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం రేగళ్ల గ్రామపంచాయతీ పరిధిలోని సర్వే నంబర్–98లో జరుగుతున్నట్లు ప్రచారంలో ఉన్న వెంచర్ కార్యకలాపాలు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి. డ్రాఫ్ట్ లేఅవుట్ ఆధారంగా ప్లాట్ల విక్రయాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తుండటంతో సంబంధిత శాఖల పర్యవేక్షణపై ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. డ్రాఫ్ట్ లేఅవుట్ అనేది తుది అనుమతి కాదనే విషయం ఉన్నప్పటికీ, దాని ఆధారంగా ప్రచారం నిర్వహిస్తూ కొనుగోలుదారులను ఆకర్షిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో అధికారులు ఇప్పటివరకు ఎలాంటి క్షేత్రస్థాయి తనిఖీలు నిర్వహించారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఏజెన్సీ ప్రాంతంలోని గ్రామపంచాయతీ పరిధి భూముల్లో వెంచర్ల ఏర్పాటు, ప్లాట్ల విక్రయాలు చట్టబద్ధ నిబంధనలకు అనుగుణంగా జరుగుతున్నాయా లేదా అనే అంశంపై సంబంధిత శాఖలు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని స్థానికులు కోరుతున్నారు.

తదితర శాఖలు సంయుక్తంగా విచారణ చేపట్టి...

వెంచర్‌కు సంబంధించిన తుది అనుమతులు, అభివృద్ధి పనులు, అంతర్గత రహదారులు, డ్రైనేజీ, ఓపెన్ స్పేస్‌లు, మార్ట్గేజ్ భూములు, ప్రజా వినియోగ స్థలాలు వాస్తవంగా ఉన్నాయా లేదా అన్నది క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేస్తున్నారు. జీవితకాల పొదుపులతో ప్లాట్లు కొనుగోలు చేస్తున్న సామాన్య ప్రజలు ఎలాంటి నష్టాలకు గురికాకుండా ఉండేందుకు రెవెన్యూ, పంచాయతీరాజ్, టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ తదితర శాఖలు సంయుక్తంగా విచారణ చేపట్టి వాస్తవ పరిస్థితులను వెల్లడించాలని స్థానికులు కోరుతున్నారు. ఒకవేళ విచారణలో నిబంధనల ఉల్లంఘనలు గుర్తిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని, అదే సమయంలో అన్ని అనుమతులు, అభివృద్ధి పనులు నిబంధనల ప్రకారమే ఉన్నట్లు తేలితే ప్రజలకు అధికారికంగా స్పష్టత ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. పారదర్శకతతో వ్యవహరించి ప్రతి వెంచర్‌పై నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తేనే కొనుగోలుదారుల విశ్వాసం నిలుస్తుందని, ప్రజల ప్రయోజనాల పరిరక్షణలో సంబంధిత శాఖలు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

Next Story