- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్లాట్లు చేయ్.. అమ్మేయ్
ఖమ్మం నగరంలో ఇండస్ట్రియల్ వ్యాపార సముదాయం భూములు అక్రమార్కుల చేతుల్లోకి వెళ్తున్నాయి.

దిశ, ఖమ్మం టౌన్: ఖమ్మం నగరంలో ఇండస్ట్రియల్ వ్యాపార సముదాయం భూములు అక్రమార్కుల చేతుల్లోకి వెళ్తున్నాయి. 1978లో అప్పటి ప్రభుత్వం ఇండస్ట్రియల్ వ్యాపార సముదాయాలకు భూమి కేటాయించగా కానీ నేడు కొందరు నాయకులకు అధికారులు తోడవడంతో అడ్డూ అదుపు లేకుండా ఇండస్ట్రియల్ భూమిని ప్లాట్లుగా మార్చి లక్షల్లో సొమ్ము చేసుకుంటున్నారు. రూ.కోట్లు విలువ చేసే భూమిని ఎవరికివారు దోచుకో దాచుకో అన్నట్లుగా భూమిని ప్లాట్లుగా చేసి విక్రయిస్తున్నారు. ప్లాట్లు కొనుక్కున్న వారికి ఎలాంటి గ్యారెంటీ లేదని బాధితులు తలలు పట్టుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా ఇండస్ట్రియల్ అధికారులు కనీసం కన్నెత్తి చూడకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.
ఖమ్మం నగరంలో ఇండస్ట్రియల్ వ్యాపార సముదాయం కొంతమంది రాజకీయ నాయకుల చేతిలో చిక్కి చిందర వందరమవుతోంది. ప్రభుత్వం 1978లో ఇండస్ట్రియల్ వ్యాపార సముదాయాలకు భూమి కేటాయించింది. కానీ నేడు కొందరు నాయకులకు అధికారులు తోడవడంతో అడ్డూ అదుపు లేకుండా ఇండస్ట్రియల్ భూమిని ప్లాట్లుగా మార్చి లక్షల్లో సొమ్ము చేసుకుంటున్నారు. కోట్ల విలువైన భూమిని ఎవరికివారు దోచుకో దాచుకో అన్నట్లుగా భూమిని ప్లాట్లుగా చేసి విక్రయిస్తున్నారు.
మంత్రి పేరు పెడతాం...
ప్రభుత్వ భూమిని ఆక్రమించింది కాక తెలంగాణ రాష్ట్ర మంత్రి మాకు అండగా ఉన్నాడని, మా భూముల జోలికి వస్తే మంత్రి, ఆయన తనయుడి వద్దకు వెళ్లి వేడుకుంటామని మిగిలి ఉన్న ప్రభుత్వ భూమిని సైతం ఆక్రమించి మా కాలనీకి మంత్రి పేరు పెట్టుకుంటామని ఆక్రమణదారులు చెబుతుండటం గమనార్హం. ప్రభుత్వ భూములను కాపాడాల్సిన వారే వారికి అండగా ఉన్నారంటూ ప్రచారం చేసుకోవడం విస్మయానికి గురిచేస్తుంది. దీనిపై మంత్రి, ఆయన తనయుడు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. ప్లాట్లుగా మార్చుతూ..
అన్యాక్రాంతమవుతున్న ఇండస్ట్రియల్ భూముల్లో ఇప్పటికే కొంతమంది గత టీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు, ప్రస్తుత అధికార పార్టీకి చెందిన కాంగ్రెస్ నాయకులు ప్లాట్లుగా మార్చి లక్షలు కూడబెట్టుకుంటున్నారు. ఇప్పటికే ఈ విషయమై దిశ పత్రికలో కథనాన్ని గతంలో ప్రచురించగా సంబంధిత అధికారులు, జిల్లా కలెక్టర్ ఇటీవల కొంత భూమి సర్వే చేసినట్లు సమాచారం. ఇండ్లు నిర్మించుకున్న వారికి సైతం నోటీసులు ఇస్తామని అధికారులు పేర్కొన్నా ఎలాంటి చర్యలు ఏమి తీసుకోకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లా కేంద్రంలో కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని ముక్కలు చేస్తున్నా అధికారులు మంత్రులకు తెలియదంటే అతిశయోక్తి లేదు.
కానరాని ఇండస్ట్రియల్ అధికారులు..
జిల్లా కేంద్రంలో కోట్ల రూపాయలు విలువ చేసే భూమి అన్యాక్రాంతం అవుతున్నా ఇండస్ట్రియల్ అధికారులు కనీసం కన్నెత్తి చూడకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. దిశ పత్రికలో వచ్చిన కథనాలతో ఇప్పటికే కొంతమంది నిర్మించుకున్న ఇండ్లను అమ్మకాలు జరిపి వేరే ప్రాంతాలకు వెళ్లిపోయారు. కొనుక్కున్న వారికి ఎలాంటి గ్యారెంటీ ఇవ్వకపోవడంతో వారు ఎందుకు కొన్నామంటూ తలలు పట్టుకుంటున్నారు. ఇండస్ట్రియల్ కార్యాలయంలో కొంతమంది ఉద్యోగుల సహకారంతో ఇండస్ట్రియల్ భూములు ముక్కలుగా మారుతున్నాయని పలువురు చర్చించుకుంటున్నారు.
ఈ విషయమై ఇండస్ట్రియల్ మేనేజర్‌ను వివరణ కోరెందుకు దిశ ప్రయత్నం చేయగా స్పందన లేదు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఇండస్ట్రియల్ భూములను కాపాడి, వ్యాపార సముదాయాలకు స్థలం లేని నిరుపేదలను గుర్తించి వారికి కేటాయించాలని పలువురు కోరుతున్నారు.






