నిత్యం మద్యం మత్తులోనే విధులకు హాజరవుతున్న పంచాయతీ కార్యదర్శి

by Kodari Anjali |

రోజూ మద్యం సేవించి, మత్తులోనే ప్రభుత్వ విధులకు హాజరవుతున్న పంచాయతీ కార్యదర్శి తీరుపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

నిత్యం మద్యం మత్తులోనే విధులకు హాజరవుతున్న పంచాయతీ కార్యదర్శి
X

దిశ, కారేపల్లి: ప్రతిరోజూ మద్యం సేవించి, మత్తులోనే ప్రభుత్వ విధులకు హాజరవుతున్న పంచాయతీ కార్యదర్శి తీరుపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కారేపల్లి మండల పరిధిలోని వెంకట్యతండా గ్రామపంచాయతీ కార్యదర్శి నిత్యం మద్యం సేవించి ప్రభుత్వ కార్యక్రమాలకు, అధికారిక విధులకు హాజరవుతున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం సుమారు 11 గంటల సమయంలో స్థానిక బిర్యానీ సెంటర్‌లో మద్యం సేవిస్తూ ఆయన స్థానికులకు కనిపించారు. స్థానికులు చిత్రీకరించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గ్రామంలోని వివిధ పనుల నిమిత్తం మహిళలు, గ్రామస్తులు నిత్యం గ్రామపంచాయతీ కార్యాలయానికి వస్తుంటారు. అయితే, పంచాయతీ కార్యదర్శి తరచూ మద్యం మత్తులో ఉండటంతో తమకు అనేక సందర్భాల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయని వారు వాపోతున్నారు. ఈ విషయంపై గతంలో స్థానికులు, పలువురు వార్డు సభ్యులు గ్రామస్తులతో కలిసి మండల ఎంపీడీవోకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అయినప్పటికీ ఆయన తీరిలో ఎలాంటి మార్పు రాలేదని పేర్కొన్నారు. నిత్యం బెల్ట్ షాపుల వద్దే కనిపిస్తూ మద్యం సేవిస్తున్నప్పటికీ సంబంధిత అధికారులు శాఖాపరమైన చర్యలు తీసుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ఉన్నతాధికారులు స్పందించి సంబంధిత పంచాయతీ కార్యదర్శిపై తగిన శాఖాపరమైన చర్యలు తీసుకుని గ్రామ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని జిల్లా కలెక్టర్ ను వేడుకున్నారు.

Next Story