- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పుష్ప’ సినిమాను మించిన స్కెచ్..
సినిమా తెరపై 'పుష్పరాజ్' లారీల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తూ పోలీసులను బురిడీ కొట్టించిన సన్నివేశాలకు ప్రేక్షకులు ఈలలు వేశారు.

దిశ, బూర్గంపాడు : సినిమా తెరపై 'పుష్పరాజ్' లారీల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తూ పోలీసులను బురిడీ కొట్టించిన సన్నివేశాలకు ప్రేక్షకులు ఈలలు వేశారు. అయితే అదే ఐడియాను నిజ జీవితంలో అమలు చేయాలని ప్రయత్నించిన ఓ స్మగ్లర్ చివరికి పోలీసులకు చిక్కిపోయాడు. ఛత్తీస్‌గఢ్ సరిహద్దు దాటించి, పోలీసుల కళ్ల ముందే కోట్ల రూపాయల విలువైన గంజాయిని తరలించాలని స్మగ్లర్లు పక్కా ప్లాన్ వేశారు. కానీ వారి ఎత్తుగడను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు చాకచక్యంగా భగ్నం చేసి, స్మగ్లింగ్ ముఠా ఆటకట్టించారు. బూర్గంపాడు మండలం సారపాక వద్ద మంగళవారం పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో భారీగా గంజాయి పట్టుబడటం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
‘పుష్ప’ స్టైల్ లో గంజాయి స్మగ్లింగ్!
నమ్మదగిన సమాచారంతో సారపాక చెక్‌పోస్ట్ వద్ద అప్రమత్తమైన బూర్గంపాడు పోలీసులు.. ఛత్తీస్‌గఢ్ వైపు నుంచి వస్తున్న ఒక భారీ కంటైనర్‌ను ఆపారు.పైకి చూస్తే అదో సాధారణ వస్తువుల రవాణా వాహనంలాగే కనిపించింది. కానీ లోపల ఏదో తేడా ఉందన్న పోలీసుల అనుమానంతో కంటైనర్‌ను క్షుణ్ణంగా పరిశీలించారు. సినిమా స్టైల్ లో కంటైనర్ లోపల ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రహస్య అరలను చూసి పోలీసులే ఆశ్చర్యపోయారు. ఆ గదులను తెరిచి చూడగా.. గుట్టలుగా అమర్చిన గంజాయి ప్యాకెట్లు బయటపడ్డాయి.
పట్టుబడిన సరుకు విలువ రూ. 3 కోట్లు!
పోలీసులు స్వాధీనం చేసుకున్న ఈ గంజాయి విలువ అంతర్జాతీయ మార్కెట్లో సుమారు రూ. 3 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. కంటైనర్‌తో పాటు గంజాయిని సీజ్ చేసిన పోలీసులు, చాకచక్యంగా తప్పించుకోవాలని చూసిన డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. ఈ భారీ స్మగ్లింగ్ వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరనే కోణంలో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఛత్తీస్‌గఢ్‌లోని ఏ ప్రాంతం నుంచి ఈ సరుకు లోడ్ అయింది? గమ్యస్థానం ఎటు? ఈ రూ. 3 కోట్ల గంజాయిని ఏ రాష్ట్రానికి లేదా ఏ మెట్రో నగరానికి తరలిస్తున్నారు? వెనుక ఉన్న ముఠా ఎవరు? ఈ నెట్‌వర్క్ వెనుక ఉన్న అంతర్రాష్ట్ర స్మగ్లింగ్ కింగ్ పిన్స్ ఎవరు?ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం రాబట్టేందుకు డ్రైవర్‌ను పోలీసులు గట్టిగా విచారిస్తున్నారు. కేసు నమోదు చేసిన బూర్గంపాడు పోలీసులు, త్వరలోనే ఈ గంజాయి ముఠా గుట్టు రట్టు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఏదేమైనా.. సినిమా ట్రిక్కులతో పోలీసుల కళ్లు కప్పాలనుకున్న స్మగ్లర్ల ఆట సారపాక వద్ద ముగియడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. కాగా జిల్లా ఎస్పీ బూర్గంపాడు చేరుకుని ఈ కేసు వివరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో బయట పడాల్సి ఉంది.






