ఏ జెండా అయినా గెలుపే నా ఎజెండా

by Disha Web Desk 1 |
ఏ జెండా అయినా గెలుపే నా ఎజెండా
X

ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి

దిశ, అశ్వారావుపేట/దమ్మపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం దమ్మపేట మండల కేంద్రంలో సోమవారం బీఆర్ఎస్ పార్టీ ధిక్కార నేత ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అభిమానుల నియోజకవర్గ స్థాయి ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు. నియోజకవర్గంలోని ఐదు మండలాల నుంచి భారీ సంఖ్యలో శీనన్న అభిమానులు అనుచరులు హాజరయ్యారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన కొందరు ప్రజా ప్రతినిధులు నాయకులు బహిరంగంగా పొంగిలేటికి మద్దతును తెలిపారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ పొంగులేటి ప్రసంగిస్తూ బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపారు. ప్రభుత్వంతో నిరుద్యోగులకు, గిరిజనులకు, ఏజెన్సీ గ్రామాల్లో ఉన్న గిరిజనేతరులకు, ఇల్లు లేని వారికి ఎలాంటి లాభం చేకూర లేదని, అక్కడక్కడ పది, పదిహేను ఇల్లులు కట్టి భూతద్దంలో చూపించి మోసం చేశారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన కార్యక్రమాల గూర్చి ప్రభుత్వం ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు. పోడు భూములకు, ఏజెన్సీలోని గిరిజనేతలకు భూములకు పట్టాలిస్తామని, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ ఊసే ఎత్తకపోవడం బాధాకరమన్నారు. కనీసం గ్రామ పంచాయతీలకు నిధులు ఏర్పాటు చేయకపోవడం, పెండింగ్ బిల్లులు విడుదల చేయకపోగా, మళ్లీ ఒక్కో పంచాయతీకి రూ.10లక్షలు, మున్సిపాలిటీకి రూ.30 లక్షలు ఇస్తామని చెప్పడం హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు. సర్పంచ్ లు తమ భార్యల మెడలో ఉన్న బంగారాన్ని తాకట్టు పెట్టి పంచాయతీలకు ఖర్చు పెట్టాల్సిన దుస్థితి నెలకొందన్నారు.

రాజకీయ విమర్శలపై కౌంటర్ ఎటాక్

శీనన్నకు బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం ఉందా అని కొందరు అంటున్నారు. కళ్లు ఉండి చూడలేని కబోదుల్లా ఈ ప్రశ్న అడుగుతున్న వాళ్లే తిరిగి ప్రశ్నించుకోవాలని ఆయన తెలిపారు. పార్టీ పెద్దలు ఒకప్పుడు నా దగ్గరకు వచ్చి ప్రాధేయపడి జడ్పీటీసీ, ఎంపీటీసీలకు నా సిఫార్సుతో ఓట్లు వేయించుకొన్న నాడు నాకు బీఆర్ఎస్ సభ్యత్వం ఉందో లేదో తెలియదా అని ప్రశ్నించారు. నా పార్టీ మార్పు గురించి ఇతర పార్టీలు మదన పడుతున్నాని, నాకు లేని దురద, టెన్షన్ మీకెందుకు.. మీ పార్టీలో మీ స్థానం ఏంటో మీ గెలుపు ఏంటో చూసుకొమ్మని సెలవిచ్చారు. దూరదృష్టి ఉంది కాబట్టే రాబోయే ఎన్నికలకు నా తరఫు అభ్యర్థులను ప్రకటిస్తున్నానని తెలిపారు.

పార్టీ మార్పు ఖాయం.. అందుకు తొందర లేదు

పార్టీ మారడంపై పొంగులేటి క్లారిటీ ఇచ్చారు. తాను పార్టీ మారడం ఖాయమని.. ఎవరో కంగారు పెడితేనో.. రెచ్చగొడితేనో, ఇబ్బందులకు గురి చేస్తేనో తొందరలో నిర్ణయం తీసుకునే ప్రసక్తే లేదు. మీడియాలో పార్టీ మార్పుపై రోజుకో కథనం వస్తుందన్నారు. కొందరు పార్టీ మారడానికి తేదీలు ముహూర్తాలు చూసుకుంటారు. నేను మాత్రం నన్ను నమ్ముకున్న నా ప్రజలకు మంచి జరిగే రోజే నిర్ణయం తీసుకుంటాను. అది ఏ పార్టీ అయినా ఏ జెండా అయినా గెలుపే ఎజెండాగా ఉంటుంది.

ప్రభుత్వ అధికారులకూ వార్నింగ్..

దమ్మపేట ఆత్మీయ సమ్మేళనంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ప్రభుత్వ అధికారులకు పొంగులేటి వార్నింగ్ ఇచ్చారు. మీరు ప్రభుత్వ ఉద్యోగులు ఎంపీ ఎమ్మెల్యేలు మంత్రుల సిఫార్సులతో పోస్టింగులు తెచ్చుకొని ఉండొచ్చు. వారి మాటలు విని ప్రలోభాలకి లొంగి నాతో పయనించే నన్ను అభిమానించే గౌరవించే ఏ ఒక్క నాయకుని ప్రజాప్రతినిధులు ఓటర్లను గాని ఇబ్బంది పెట్టాలని చూస్తే అధికారం ఎవరి సొత్తు కాదని హెచ్చరించారు. దానికి ప్రతిఫలం అసలు వడ్డీ చక్ర వడ్డీతో సహా చెల్లిస్తానన్నారు. మీరు న్యాయం పనిచేయాలన్నారు. ముఖ్యంగా కొంతమంది పోలీసులు నా వెంట నడిచే వారిని బెదిరిస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. వారిని వేదిక మీద నుంచి సున్నితంగా హెచ్చరిస్తున్నానన్నారు.


Next Story

Most Viewed