అతనో మోనార్క్.. ఎవరి మాటా వినడు

by Ajay Maddhiboyina |

‘నేను మోనార్క్‌ను .. ఎవ్వరి మాటా వినను’ అనే సినిమా డైలాగ్‌ను తలపించేలా ఖమ్మం వైద్య ఆరోగ్యశాఖలో ఓ అధికారి తీరు వివాదాస్పదమవుతున్నది. ఉన్నతాధికారులు చీవాట్లు పెట్టినా.. తనకుతాను ఆ శాఖకు సుపీరియర్ అన్న ఫీలింగ్‌తో సిబ్బందిని ఇబ్బంది పెట్టడమే కాకుండా వివాదాలకు కేరాఫ్‌గా నిలుస్తున్నాడు.

అతనో మోనార్క్.. ఎవరి మాటా వినడు
X

‘నేను మోనార్క్‌ను .. ఎవ్వరి మాటా వినను’ అనే సినిమా డైలాగ్‌ను తలపించేలా ఖమ్మం వైద్య ఆరోగ్యశాఖలో ఓ అధికారి తీరు వివాదాస్పదమవుతున్నది. ఉన్నతాధికారులు చీవాట్లు పెట్టినా.. తనకుతాను ఆ శాఖకు సుపీరియర్ అన్న ఫీలింగ్‌తో సిబ్బందిని ఇబ్బంది పెట్టడమే కాకుండా వివాదాలకు కేరాఫ్‌గా నిలుస్తున్నాడు. అంతేకాదు ఖమ్మం జిల్లా వాసిగా భవిష్యత్ లో పొలిటికల్ టచ్ ఇచ్చి అందరినీ ఆశ్చర్య పరుస్తానని, ఆ మేరకు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నానని చెప్పుకొస్తున్నాడు. తాజాగా జిల్లా అధికారి సెలవులో ఉండటంతో తానే ఆ స్థానానికి వస్తున్నానని అందుకు ఉన్నతాధికారులు కూడా ఓకే చేశారని చెబుతూ స్వయంగా ఓ టీంతో ఆర్డర్ కాపీ తయారు చేసి, ప్రైవేట్ ఆస్పత్రుల వెంట తిరగడం విస్మయం కలిగిస్తోంది. సొంత శాఖ సిబ్బందే ఇదేం తీరంటూ బహిరంగంగానే వ్యాఖ్యానించడం విశేషం. - దిశ, ఖమ్మం

దిశ, ఖమ్మం: ఖమ్మం జిల్లా వైద్యఆరోగ్యశాఖ ఉన్నతాధికారి ఒకరు సెలవులో ఉండటంతో తానే పూర్తిస్థాయి అధికారిగా వస్తున్నానని, అందుకు ఉన్నతాధికారులు కూడా ఓకే చేశారని, త్వరలో చార్జ్ తీసుకుంటున్నానని చెప్పుకుంటూ ఓ అధికారి చేస్తున్న హంగామా జిల్లా వైద్యశాఖలో కలకలం రేపుతోంది. అందుకు అనుగుణంగా స్వయంగా ఓ అర్డర్ కాపీ తానే తయారు చేసుకుని, అందులో తన అనుచరులతో కూడిన బృందాన్ని ఏర్పాటు చేసుకుని ప్రైవేట్ ఆస్పత్రుల తనిఖీ పేరిట చేస్తున్న వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. వైద్య ఆరోగ్యశాఖ వాట్సప్ గ్రూపుల్లో ఈ లేఖ బహిరంగం కావడంతో ఆ శాఖలో పనిచేసే సిబ్బందే ఇదేం విడ్డూరం అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఏ అధికారి పూర్తి స్థాయిలో బాధ్యతలు అప్పజెప్పకున్నా తానే బాస్ నుంటూ ఆ అధికారి చేస్తున్న విడ్డూరకర చర్యలు ప్రస్తుతం కలకలం రేపుతున్నాయి. అంతేకాదు ఈ అధికారి ఎక్కడ పనిచేసినా వివాదాలు కామనే అన్న చర్చ జరుగుతోంది.

పేర్లు మారుస్తూ.. చిన్నపిల్లల ఆస్పత్రులు తెరుస్తూ..

ఈ అధికారి ఓ జిల్లా అధికారిగా ఉన్నప్పుడు వివిధ పేర్లతో చిన్నపిల్లల ఆస్పత్రులు ఏర్పాటు చేశాడనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఎంబీబీఎస్ పూర్తిచేసిన ఈ డాక్టర్ డిప్లొమా ఇన్ చైల్డ్ హెల్త్ కోర్సు చేయకుండానే చేసినట్లు ఆస్పత్రులు నిర్వహించినట్లు ఆరోపణలు కూడా వచ్చాయి. చదవని కోర్సుకు బోర్డు పెట్టుకుని వివిధ ప్రాంతాల్లో వివిధ పేర్లతో ఆస్పత్రులు నిర్వహించినట్లు టాక్. దీంతో నిఘా పెట్టిన ఉన్నతాధికారులు డీసీహెచ్ కోర్సు చేసినట్లు రికార్డుల్లో లేదని గమనించి అప్పటి ఉన్నతాధికారులకు కూడా ఫిర్యాదుల అందాయి. విచారణ చేపట్టిన అధికారులు స్టేట్ మెడికల్ కౌన్సిల్ కు సమాచారం అందించి ఆరా తీసినట్లు తెలిసింది. దాంతో మెడికల్ కౌన్సిల్ కూడా తమవద్ద ఎలాంటి ఎన్‌రోల్ మెంట్ లేదని తేల్చడంతో పాటు ప్రజారోగ్యశాఖకు విషయాన్ని తెలిపి అక్కడి నుంచి బదిలీ చేశారు.

జిల్లాల్లో ఆరోపణలు సరేసరే..

వివాదాస్పద అధికారిగా పేరు తెచ్చుకుని ప్రస్తుతం ఖమ్మంలో విధులు నిర్వహిస్తున్న అధికారి తన పనిచేసిన పాత జిల్లాల్లో అనేక వివాదాల్లో మునిగితేలారు. వైద్యుని పోస్టు నియామకం కోసం డబ్బులు తీసుకున్నాడని స్వయంగా రాష్ట్ర సహకార వినియోగదారుల ఫోరం చైర్మన్ ఆరోపించిన సంఘటన అప్పట్లో కలకలం రేపింది. అంతేకాదు అప్పట్లో ఉన్నతాధికారులతో, రాజకీయ నాయకులతో ఉన్న సంబంధాలతో వివాదాలు వచ్చినా అక్కడి నుంచి బదిలీ అయినా తిరిగి హోదా కల్ల పోస్టుల్లోనే కొనసాగడం ఈయనకు వెన్నెతో పెట్టిన విద్యగా చెప్పుకుంటారు. ప్రైవేట్ ఆస్పత్రులు ఎక్కువగా ఉన్న జిల్లాలో పోస్టింగ్ పొందడం, ప్రైవేట్ ఆస్పత్రుల లోపాలపై తూతూమంత్రంగా తనిఖీలు నిర్వహించడం, అవినీతికి పాల్పడడంలాంటి ఆరోపణలు శరామామూలయ్యాయి.

‘దిశ’ కథనంతో..

మూడు రోజుల క్రితం ఖమ్మం వైద్యఆరోగ్యశాఖ నుంచి ఓ అధికారి ప్రైవేట్ ఆస్పత్రుల తనిఖీల పేరిట ఓ కమిటీ ఏర్పాటు చేస్తూ సొంత సంతకంతో ఆర్డర్ కాపీ విడుదల చేసి వివాదాలకు కారణమైన ఆ అధికారి వ్యవహారశైలిని ‘దిశ’ వెలుగులోకి తెచ్చింది. దీంతో సదరు అధికారి డీఎంహెచ్ ఓ హోదా లేకుండానే వాట్సాప్ గ్రూపుల్లో మరో మెస్సేజ్ జారీ చేశాడు. హైదరాబాద్లోని డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఇచ్చిన సూచనల మేరకు జిల్లాలోని ఐహెచ్ఐపీ పోర్టల్‌లో నమోదు చేసిన 639 ప్రైవేట్ఆస్పత్రుల్లో 37ఆస్పత్రులు ఇప్పటి వరకు వివరాలను అప్ డేట్ చేయలేదని, వివరాలు కోరినా స్పందించడం లేదని వాటిని స్థితిని పరిశీలించడానికి సూచనలు అందడంతో తనిఖీలు నిర్వహించామన్నారు. అందులో భాగంగానే బృందాలను ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహించామని చెప్పుకొచ్చారు. ఆర్థిక లావాదేవీలు, స్వప్రయోజనాలు ఇందులో లేవని, పరిపాలన పరమైన చర్యల్లో భాగంగా తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అయితే ఏ హోదాతో ఆర్డర్ రిలీజ్ చేశారు, పూర్తి బాధ్యతలు అఫీషియల్‌గా ఉన్నతాధికారులు మీకు ఇచ్చారా? ఆ మేరకు ఆర్డర్ కాపీ రిలీజ్ అయ్యిందా? అంటే మాత్రం సదరు అధికారి నుంచి సరైన సమాధానం లేకపోవడం గమనార్హం.

Next Story