- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
యూనియన్ కొమురయ్య భవన్ ప్రారంభించిన ఎమ్మెల్యే కునంనేని
సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) ఆధ్వర్యంలో అమరజీవి కామ్రేడ్ మనుబోతుల కొమురయ్య వర్ధంతి సందర్భంగా

దిశ, కొత్తగూడెం : సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) ఆధ్వర్యంలో అమరజీవి కామ్రేడ్ మనుబోతుల కొమురయ్య వర్ధంతి సందర్భంగా నాయకులు, కార్మికులు పెద్ద ఎత్తున నివాళులర్పించారు. ఈ సందర్భంగా అన్ని బావుల డిపార్ట్‌మెంట్లలో యూనియన్ కొమురయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి కార్మికులు ఘన నివాళులర్పించారు. రుద్రంపూర్‌లో కొత్తగా నిర్మించిన ఏఐటీయూసీ కార్యాలయం యూనియన్ కొమురయ్య భవన్ ను కొత్తగూడెం శాసనసభ్యుడు కామ్రేడ్ కునంనేని సాంబశివరావు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే కునంనేని సాంబశివరావు మాట్లాడుతూ... అమరజీవి యూనియన్ కొమురయ్య కార్మిక వర్గానికి చేసిన సేవలను కొనియాడారు. ప్రజల హక్కుల కోసం కమ్యూనిస్టులపై తీవ్ర నిర్బంధాలు, కనిపించిన వెంటనే కాల్చివేతలు ఉన్న రోజుల్లో కూడా, మనుబోతుల కొమురయ్య శ్రమదోపిడీకి గురవుతున్న సింగరేణి బొగ్గుగని కార్మికుల దీన పరిస్థితిని చూసి చలించిపోయారని గుర్తుచేశారు.
అందుకే, వారి కోసం 1940లో సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్‌ను స్థాపించి ఎన్నో పోరాటాలు చేసి అనేక హక్కులను సాధించారని అన్నారు. అనాడు కమ్యూనిస్టు నాయకులైన దేవూరి శేషగిరి రావు, మక్దుం మొయినుద్దీన్, రాజ్ బహద్దూర్ గౌర్, కె.ఎల్. మహేంద్ర వంటి యోధులతో కలిసి అనేక పోరాటాలు చేసి, కార్మికుల కోసం ప్రభుత్వంతో పోరాడి అనేక చట్టాలు సాధించారని తెలిపారు. చట్టాలపై పూర్తి అవగాహనతో వాటిని అమలుపరిచే విధంగా పోరాడేవారని కొనియాడారు. కొమురయ్య ఒక్క పిలుపు ఇస్తే బొగ్గుబాయిల నుండి ఒక్క బొగ్గు పెల్ల కూడా బయటకు రాకుండా కార్మికులు సమ్మె చేసి సమస్యలను పరిష్కరించుకునేవారని అన్నారు. నిజాం పాలన విముక్తి కోసం పోరాడిన ఆయనను కాల్చివేయడానికి నిజాం సైన్యం గాలిచిందని, అయినప్పటికీ తన జీవితమంతా కార్మిక వర్గ పోరాటాలు చేస్తూ బొగ్గుగని కార్మికుల హక్కుల కోసం ధారపోసిన మహానాయకుడు కొమురయ్య అని ఎమ్మెల్యే కునంనేని సాంబశివరావు పంచుకున్నారు. తాను కూడా ఆయనతో కలిసి అనేక పోరాటాలలో పనిచేసిన అనుభవాలను కార్మికులతో పంచుకున్నారు. ఏఐటీయూసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య మాట్లాడుతూ... కొమురయ్య కార్మిక సంఘానికి సుమారు 40 సంవత్సరాలు ప్రధాన కార్యదర్శిగా ఉండి అనేక హక్కులు సాధించారని తెలిపారు.
వేతన కమిటీలో శాశ్వత సభ్యుడిగా ఉండి కార్మికులకు మెరుగైన జీతాలు, సౌకర్యాల కోసం పోరాడి సాధించారని పేర్కొన్నారు. పదవీ విరమణ పొందిన తరువాత ఎటువంటి ఆధారం లేని సింగరేణి కార్మికులకు పెన్షన్ సాధించారని, కోల్‌ఇండియా కార్మికుల కంటే సింగరేణి కార్మికులకు రఘురామరెడ్డి అవార్డు ద్వారా అదనంగా ఒక ఇంక్రిమెంట్‌ను ఇప్పించారని గుర్తుచేశారు. కార్మికుల పిల్లలకు వారసత్వ ఉద్యోగాలు, కాంట్రాక్టు కార్మికులకు పర్మినెంట్ హోదా కల్పించిన మహానాయకుడు కొమురయ్య అని అన్నారు. యూనియన్ ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్‌కుమార్ మాట్లాడుతూ... సింగరేణిలో నేడు కార్మికులు అనుభవిస్తున్న హక్కులు అన్నీ తమ సంఘం ఏఐటీయూసీ నాయకులు పోరాడి, ప్రాణత్యాగాలు చేసి సాధించినవేనని తెలిపారు. కొమురయ్య కృషి సింగరేణి ఉన్నంత కాలం కార్మికుల గుండెల్లో పదిలంగా ఉంటుందని, ఒక సామాన్య ఉద్యోగి (టర్నర్)గా మెయిన్ వర్క్‌షాప్‌లో చేరి, కార్మికుల కష్టాలను చూసి చలించిపోయి ప్రాణ త్యాగానికి కూడా సిద్ధపడి ప్రభుత్వాలతో, యాజమాన్యంతో కొట్లాడి అనేక ఉద్యమాలు చేసి హక్కులు సాధించారని పేర్కొన్నారు.
చివరికి ఆరోగ్యం బాగోకపోయినా నిరాహార దీక్షకు సిద్ధపడి తుదిశ్వాస విడిచారని, ఆయన ఆశయాలను ముందుకు తీసుకువెళ్తామని తెలిపారు. బ్రాంచ్ కార్యదర్శి మల్లికార్జున్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో కేంద్ర కార్యదర్శి వంగ వెంకట్, కార్పొరేట్ బ్రాంచ్ కార్యదర్శి రమణ మూర్తి, కేంద్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి వీరాస్వామి, బ్రాంచ్ సహాయ కార్యదర్శి గట్టయ్య,సత్తుపల్లి బ్రాంచ్ కార్యదర్శి సుధాకర్,కొత్తగూడెం వైస్ ప్రెసిడెంట్ కతర్ల రాములు, శేషగిరి రావు, సందేబోయిన శ్రీనివాస్, ఎస్. నాగేశ్వర రావు, గుమ్మడి వీరయ్య, హీరాలాల్, పీవీకే పిట్ కార్యదర్శి హుమాయూన్, వర్క్‌షాప్ పిట్ కార్యదర్శి మధు కృష్ణ, ఏరియా స్టోర్ పిట్ కార్యదర్శి శ్రీనివాస్ కమల్, జీకేఓసీ ఇన్‌ఛార్జి పిట్ కార్యదర్శి ఎం.ఆర్.కే. ప్రసాద్, ఆర్‌సీహెచ్‌పీ సహాయ పిట్ కార్యదర్శి సురేందర్ తదితర కార్మిక సంఘం నాయకులు, సత్తుపల్లి బ్రాంచ్ వైస్ ప్రెసిడెంట్ భీమయ్య, నాయకులు బ్రాంచ్ సహాయ నాయకులు సూర్యప్రకాశ్, జాయింట్ కార్యదర్శి భరణి, జె వి ఆర్ ఒక పిట్ కార్యదర్శి నరసింహ రావు, కిష్టారం ఓసీ పిట్ కార్యదర్శి కిషోర్ కుమార్, కార్మికులు, సానుభూతిపరులు పాల్గొన్నారు.






