- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పాల్వంచలో ఉద్రిక్తత...పోలీస్ స్టేషన్ లో బైఠాయించిన కూనంనేని
బ్యాలెట్ బాక్సుల భద్రత, పారదర్శకతపై అనుమానాలు వ్యక్తం చేస్తూ, పోలీసులు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు చేశారు.

కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల వేళ పాల్వంచ పోలీస్ స్టేషన్‌లో ఉద్రిక్తత
ఖాళీ బ్యాలెట్ బాక్సులపై తీవ్ర ఆగ్రహం… స్టేషన్ ముట్టడించిన ప్రతిపక్ష కార్యకర్తలు
పోలీస్ స్టేషన్ లో బైఠాయించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు
దిశ, పాల్వంచ: కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల వేళ పాల్వంచ పట్టణంలో రాజకీయ ఉద్రిక్తతలు మరింత ముదిరాయి. సోమవారం సాయంత్రం పాల్వంచ పోలీస్ స్టేషన్ వద్ద వందల సంఖ్యలో సీపీఐ, బీఆర్‌ఎస్, బీజేపీ పార్టీ కార్యకర్తలు చేరుకుని ముట్టడి చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఖాళీగా ఉన్న బ్యాలెట్ బాక్సులను పోలీస్ స్టేషన్‌కు ఎందుకు తరలించారో ? స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నాయకులు, కార్యకర్తలు ఘాటుగా ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్యాలెట్ బాక్సుల భద్రత, పారదర్శకతపై అనుమానాలు వ్యక్తం చేస్తూ, పోలీసులు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు చేశారు.
ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేసేలా వ్యవహరిస్తే సహించబోమని హెచ్చరించారు. “బ్యాలెట్ బాక్సులు స్టేషన్‌లో ఎందుకు ఉన్నాయి? వాటిని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఎవరికి అప్పగించాల్సింది?” అనే ప్రశ్నలు సంధిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.ఈ ఆందోళనకు సీపీఐ రాష్ట్ర నాయకులు, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సీపీఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు హాజరై కార్యకర్తలకు సంఘీభావం తెలిపారు. పోలీసుల వైఖరిపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ, ఎన్నికల సమయంలో నిష్పాక్షికంగా వ్యవహరించాల్సిన బాధ్యత పోలీసులదేనని గుర్తుచేశారు.ఇటీవల పలుచోట్ల ప్రతిపక్ష కార్యకర్తలను, అభ్యర్థులను అడ్డుకోవడం, అనవసరంగా స్టేషన్లకు పిలిపించడం వంటి చర్యలు జరుగుతున్నాయని ఆరోపించారు.
ఒక మహిళను స్టేషన్‌లో నిర్బంధించిన ఘటనపై సీపీఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా ఫోన్‌లో సర్కిల్ ఇన్స్పెక్టర్‌తో మాట్లాడగా అనుచితంగా ప్రవర్తించారని పేర్కొంటూ, సంబంధిత అధికారిపై చర్యలు తీసుకోవాలని, బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అదనపు పోలీసు బలగాలను మోహరించారు. పాల్వంచ డీఎస్పీ సతీష్ సంఘటన స్థలానికి చేరుకుని నాయకులతో చర్చలు జరిపి పరిస్థితి ని చల్లబరచేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ రాత్రి 9 గంటలు దాటినా స్టేషన్ పరిసరా ల్లో ఉద్రిక్తత కొనసాగింది.
ఎప్పుడైనా పరిస్థితి అదుపు తప్పే అవకాశం ఉందన్న ఉత్కంఠ నెలకొంది.ఈ ఘటనతో కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, నిష్పాక్షికంగా సాగాలని ప్రజలు ఆశిస్తున్న నేపథ్యంలో ఈ పరిణామాలు చర్చనీయాంశంగా మారాయి. ఇది ఇలా ఉండగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల నేపథ్యంలో చిన్న చిన్న గొడవలు మినహా, పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఇక ఈ నెల 13వ తేదీన మున్సిపల్ ఎన్నికల ఫలితాలు విడుదల అవుతాయి. ఈ మేరకు ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అటు ఈ నెల 13వ తేదీన మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఉన్న తరుణంలోనే మద్యం దుకాణాలు మూత పడతాయట.






