క్రాకర్స్ విక్రయం మాటున తయారీ.. జనావాసాల్లో ఉండటంతో భయాందోళన

by Ajay Maddhiboyina |

పాల్వంచ పట్టణంలో క్రాకర్స్ వ్యాపారం పేరుతో జరుగుతున్న కార్యకలాపాలపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికారికంగా క్రాకర్స్ విక్రయాలకు మాత్రమే అనుమతులు ఉన్నా.. కొన్ని ప్రాంతాల్లో తయారీ జరుగుతోందని తెలుస్తున్నది.

క్రాకర్స్ విక్రయం మాటున తయారీ.. జనావాసాల్లో ఉండటంతో భయాందోళన
X

దిశ, పాల్వంచ టౌన్: పాల్వంచ పట్టణంలో క్రాకర్స్ వ్యాపారం పేరుతో జరుగుతున్న కార్యకలాపాలపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికారికంగా క్రాకర్స్ విక్రయాలకు మాత్రమే అనుమతులు ఉన్నా.. కొన్ని ప్రాంతాల్లో తయారీ జరుగుతోందని తెలుస్తున్నది. ఈ విషయానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు బయటకు రావడంతో ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ జిల్లా వేట్లపాలెంలో జరిగిన ఘోర పేలుడు ఘటనలో 21 మంది కార్మికులు ప్రాణాలు విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ నుంచి బాణాసంచా తయారీలో అనుభవం ఉన్న కొందరు వ్యక్తులు, తయారీకి అవసరమైన సామగ్రి ఇక్కడికి తీసుకొస్తున్నారని, స్థానిక వ్యాపారులతో కుమ్మక్కై నిబంధనలకు విరుద్ధంగా తయారీ జరుగుతోందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పట్టణంలో జనావాసాల సమీపంలో లేకుండా పేలుడు పదార్థాలు నిల్వ చేయడం లేదా తయారీ చేయడం పట్ల పెద్ద ప్రమాదానికి దారితీసే అవకాశం ఉందని స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు, అగ్నిమాపక శాఖ, రెవెన్యూ శాఖ, పేలుడు పదార్థాల నియంత్రణ విభాగం సంయుక్తంగా ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలని స్థానికులు కోరుతున్నారు. లైసెన్స్ షరతులు పాటిస్తున్నారా? నిల్వలు నిబంధనల ప్రకారమే ఉన్నాయా? ఎక్కడైనా అనుమతి లేకుండా తయారీ జరుగుతోందా? భద్రతా ప్రమాణాలు అమలవుతున్నాయా? అనే అంశాలపై క్షేత్రస్థాయిలో తనిఖీలు జరపాలని డిమాండ్ చేస్తున్నారు.

తయారు చేస్తున్నట్లు తెలిస్తే చర్యలు తీసుకుంటాం

పాల్వంచ పట్టణ ఎస్సై నాగరాజు

పాల్వంచ శ్రీ వెంకటేశ్వర క్రాకర్స్ షాప్ లో నాటు మందుగుండి సరుకు తయారీ పై వచ్చిన ఆరోపణలను పరిశీలిస్తున్నాం. మా పరిశీలనలో పాత సరుకు ఒత్తులు ఊడి పోయిన వాటికి తిరిగి ఒత్తులు అమర్చుతున్నట్లు తెలిసింది. నిజంగా అక్కడ తయారు చేస్తున్నట్లు దొరికితే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. నిఘాను పటిష్టం చేశాం.

Next Story