11ఏండ్ల తర్వాత మండల పరిషత్ ఎన్నికలు.. బూర్గంపాడులో నెలకొన్న సందడి

by Ajay Maddhiboyina |

భద్రాద్రి జిల్లానే బూర్గంపాడు మండల పరిషత్ ఎన్నికలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. తెలంగాణ ఏర్పడిన తర్వాత నిర్వహించనున్న మొదటి ఎన్నికలు కావడం విశేషం. అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బూర్గంపాడు మండల పరిషత్ ఎన్నికలు నిర్వహించారు.

11ఏండ్ల తర్వాత మండల పరిషత్ ఎన్నికలు.. బూర్గంపాడులో నెలకొన్న సందడి
X

దిశ, బూర్గంపాడు: భద్రాద్రి జిల్లానే బూర్గంపాడు మండల పరిషత్ ఎన్నికలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. తెలంగాణ ఏర్పడిన తర్వాత నిర్వహించనున్న మొదటి ఎన్నికలు కావడం విశేషం. అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బూర్గంపాడు మండల పరిషత్ ఎన్నికలు నిర్వహించారు. అప్పుడు మొత్తం 18ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు ఎంపీటీసీ స్థానాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలిశాయి. దీనిపై బూర్గంపాడు మండల పరిషత్ పాలకవర్గం సభ్యులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో ఆ ఎంపీటీసీ స్థానాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే కేటాయిస్తూ అప్పట్లో కోర్టు తీర్పు వెలువరించింది. అనంతరం 2015 జులై 3న పాలకవర్గం పదవీ బాధ్యతలు చేపట్టింది. ఆ పాలకవర్గం పదవీకాలం 2020 జూలై 2తో ముగిసింది.

11 ఏండ్ల తర్వాత ఎన్నికలు...!

తెలంగాణ రాష్ట్రంలో 2019లో మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు నిర్వహించారు. కాగా అప్పటికి బూర్గంపాడు మండల పరిషత్ పాలకవర్గం పదవీకాలం పూర్తి కాకపోవటంతో అప్పుడు బూర్గంపాడులో మండల పరిషత్ ఎన్నికలు నిర్వహించలేదు. కేవలం జిల్లా పరిషత్ ఎన్నికలు మాత్రమే పూర్తి చేశారు. 2020 జులై 2 తర్వాత బూర్గంపాడు మండల పరిషత్ కు ప్రభుత్వం ప్రత్యేక అధికారిని నియమించింది. అప్పటి నుంచి నేటికీ ప్రత్యేక అధికారుల పాలనలోనే మండల పరిషత్ కొనసాగుతోంది. కాగా మధ్యలో ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేపట్టినా వివిధ కారణాలతో అవి కార్యరూపం దాల్చలేదు.

ఐదేళ్ల పాటు పాలకవర్గం లేకుండానే గడిచిపోగా తాజాగా ప్రభుత్వం ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో ఆ దిశగా ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు చేపట్టారు. బూర్గంపాడు మండలంలో జిల్లాలోనే అత్యధికంగా 50,351 మంది ఓటర్లు ఉండగా ప్రస్తుతం ఇప్పటి జనాభా ప్రాతిపాదికన 17ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. ఎస్టీలకు నాలుగు, ఎస్సీలకు మూడు, బీసీలకు ఆరు, జనరల్ నాలుగు సీట్లు కేటాయించారు. ఎన్నికలకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు 11ఏండ్ల తర్వాత మండల పరిషత్ ఎన్నికలు నిర్వహించనుండటంతో బూర్గంపాడు మండలంలోని రాజకీయ నాయకుల్లో ఎన్నికల సందడి నెలకొంది.

Next Story