- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆచూకీ లేని 'కంపోస్టు తయారీ'..
లక్ష్యం గొప్పదే.. కానీ ఆచరణలో అలసత్వం వహిస్తే ఇలాంటి పరిస్థితులు కచ్చితంగా వస్తాయి అని అధికారులు నిరూపించారు.

దిశ, పాల్వంచ టౌన్ : లక్ష్యం గొప్పదే.. కానీ ఆచరణలో అలసత్వం వహిస్తే ఇలాంటి పరిస్థితులు కచ్చితంగా వస్తాయి అని అధికారులు నిరూపించారు. ప్రారంభంలో అందరూ సమిష్టిగా పనిచేద్దాము.. రాష్ట్రంలోనే మన మున్సిపాలిటీ ముందంజలో ఉంచుదామని శపథం చేశారు. కానీ రాను రాను ఆ మాటను మరిచిపోయి ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరించడంతో ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన కంపోస్టు తయారీ ఇప్పుడు కనుమరుగయ్యే పరిస్థితికి చేరింది. ఎరువుల తయారీ పై అవగాహన కొరవడింది. పాల్వంచ పట్టణంలో శ్రీనివాస కాలనీలో లక్షలు పెట్టి నిర్మించిన కంపోస్టు షెడ్లు నిరుపయోగంగా మారాయి. ఇంటింటా సేకరించిన చెత్త నుంచి సేంద్రీయ ఎరువును తయారు చేయాలన్న లక్ష్యం నెరవేరడం లేదు. పట్టణ శివారుల్లో నిర్మించిన షెడ్ల నిర్వహణ లోపంతో అస్తవ్యస్తంగా తయారయ్యాయి. కొత్తగూడెం కార్పొరేషన్ పాల్వంచ డివిజన్ సిబ్బంది కూడా వీటి పై దృష్టి సారించడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.
ఎరువుల తయారీ పై కొరవడిన అవగాహన..
పాల్వంచ పట్టణంలో ఇంటింటా సేకరించిన చెత్త నుండి సేంద్రీయ ఎరువును తయారు చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం కంపోస్టు షెడ్లను నిర్మించింది. సేకరించిన చెత్త ద్వారా తయారు చేసిన ఎరువులను రైతులకు విక్రయించి పట్టణ పరిధిలో ఉన్నటువంటి వ్యవసాయ ఎరువుల కోసం ఉపయోగిస్తే ఆదాయం పెంచాలని ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. దీంతో పాటు పట్టణంలో పారిశుధ్యాన్ని, స్వచ్ఛతను మరింత మెరుగుపర్చాలని ప్రభుత్వం భావించింది. ఇందులో భాగంగానే పట్టణంలో సెగ్రిగేషన్ కేంద్రాలను మంజూరు చేసింది. షెడ్ల నిర్మాణం కంప్లీటయ్యింది కంపోస్టు షెడ్డు నిర్మాణానికి సుమారు రూ.10 లక్షల వరకు వెచ్చించారు. పట్టణ శివారుల్లో నిర్మించినప్పటికీ నిర్వహణలేక లక్ష్యం నెరవేరని పరిస్థితి ఏర్పడింది. మొదట్లో ప్రజలకు తడి, పొడి చెత్త బుట్టలను పంపిణీ చేశారు. కార్పొరేషన్ సిబ్బందికి ట్రాక్టరు సైతం అందుబాటులోకి తీసుకొచ్చారు. కంపోస్టు షెడ్ల నిర్మాణాలు పూర్తయినప్పటికీ వినియోగం ప్రశ్నార్థకంగా మారింది. నిర్వహణ లోపాలు వేధిస్తున్నాయి.
తడి లేదు.. పొడి లేదు.. అంతా మిక్సింగే..
నిత్యం ట్రాక్టర్ల ద్వారా తడి, పొడి చెత్తను సేకరించి డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. కంపోస్టు షెడ్లలో వ్యర్థాలను వేరు చేసే పనులు జరగడం లేదు. వచ్చినది వచ్చినట్లే కుప్పగా ఒకే చోట పోయడంతో షెడ్లలో వేర్వేరు అవసరాల కోసం నిర్మించిన స్థలాలు ఖాళీగా ఉంటున్నాయి. పట్టణంలో తడి చెత్త నుంచి వర్మీ కంపోస్టు తయారు చేస్తుండగా... పొడి చెత్తలో లభించే ప్లాస్టిక్, గాజు, ఇనుము, ఇతరత్రా వాటిని వేరు చేయడంలో సిబ్బంది విఫలమవుతున్నారు. పట్టణంలో సేకరించిన చెత్తను ఊరు బయట డంప్ చేస్తున్నారు. కంపోస్టు షెడ్లలో చెత్తను వేరు చేయడం లేదు. మరికొన్ని చోట్ల డంపు చేసిన చెత్తకు నిప్పు అంటిస్తున్నారు. అంటుకున్న నిప్పుతో రోజుల తరబడి మంటలు, పొగలు వ్యాపిస్తున్నాయి. పట్టణ దూరంలో డంప్ చేస్తున్న చెత్త గాలికి కొట్టుకుపోయి సమీప పొలాల్లోకి చేరుతుంది. దీంతో ఇబ్బందులు నెలకొంటున్నాయని రైతులు చెబుతున్నారు.
కార్పొరేషన్ కు ఆదాయం సమకూరేనా ?
పట్టణంలో కార్పొరేషన్ కు అదనపు ఆదాయం సమకూర్చేలా సేంద్రియ ఎరువుల తయారీ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇళ్లలోని తడి, పొడిచెత్తను సేకరించిన పారిశుధ్య సిబ్బంది కంపోస్టు షెడ్లకు తరలిస్తారు. అక్కడ తడి, పొడి చెత్తను వేరు చేయాలి. తడి చెత్తలో సేంద్రియ ఎరువును తయారు చేయాలి. పొడి చెత్తలోని ప్లాస్టిక్, ఇనుము తదితర వస్తువులను వేరు చేసి విక్రయించడం ద్వారా ఆదాయం పెంచుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఎందుకూ పనికి రాకుండా ఉన్న వస్తువులను డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. ఇలా వ్యర్థాలతో పంచాయతీలకు అదనపు ఆదాయం వచ్చే విధంగా చూడాలి. వీటి నిర్వహణ లోపంతో చెత్త సేకరణకే పరిమితమయ్యాయి. సేంద్రియ ఎరువులు తయారు చేస్తేనే కార్పొరేషన్ కు అదనపు ఆదాయం చేకూరే అవకాశం ఉంటుంది. కానీ ఎక్కడా ఈ ప్రక్రియ జరుగుతున్నట్లు కనిపించడం లేదు.
పాల్వంచ పట్టణం కార్పొరేషన్ కు అదనపు ఆదాయం వచ్చేలా చర్యలు..
ఎరువుల తయారీ అయ్యేలా చర్యలు తీసుకుంటున్నాం. నూతన విధానంతో కంపోస్టు ఎరువులు తయారీకి శ్రీకారం చుడుతున్నాము. తడి, పొడి చెత్త వేరు చేయాలని పట్టణంలో సిబ్బందికి సూచిస్తున్నాము. చెత్తను ఎక్కడ పడితే అక్కడ డంపు చేయొద్దు. చెత్త నుంచి ప్లాస్టిక్, ఇనుమును వేరు చేసి సమీప డీలరుకు విక్రయించేలా పట్టణ అధికారులకు సూచిస్తున్నారు. పట్టణ కంపోస్టు షెడ్లు పూర్తయ్యాయి. వీటిని వినియోగంలోకి తీసుకురావడం లేదు. పట్టణంలో డంపింగ్ యార్డుల్లో తయారు చేసిన సేంద్రియ ఎరువును మొక్కలకు వినియోగిస్తే బాగుంటుందని పట్టణ ప్రజలు కోరుతున్నారు.






