- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తాజా వర్సెస్ మాజీ.. రచ్చకెక్కిన కాంగ్రెస్ పార్టీ విబేధాలు
భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే తెల్లం, మాజీ ఎమ్మెల్యే, ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పొదెం వీరయ్య మధ్య విభేదాలు రచ్చకెక్కాయి.

దిశ, భద్రాచలం: భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే తెల్లం, మాజీ ఎమ్మెల్యే, ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పొదెం వీరయ్య మధ్య విభేదాలు రచ్చకెక్కాయి. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పొదెం వీరయ్య పోటీ చేయగా, ప్రస్తుత ఎమ్మెల్యే వెంకట్రావు బీఆర్‌ఎస్ తరపున పోటీ చేసి, వీరయ్యపై గెలుపొందారు. ఎన్నికల అనంతరం మంత్రి పొంగులేటి అనుచరుడు అయిన వెంకట్రావు అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే తెల్లం కాంగ్రెస్ పార్టీలో చేరికను పొదెం వీరయ్య మొదట్లోనే విభేదించారు. అధిష్టానం నచ్చచెప్పడంతో వీరయ్య మిన్నకుండిపోయారు.
అయితే కాంగ్రెస్ పార్టీ విధేయుడిగా, రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి పార్టీ కష్టకాలంలోనూ కాంగ్రెస్‌ను వీడకుండా పార్టీ పటిష్టతకు కృషి చేసిన వీరయ్యకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి వర్గంలో చోటు కల్పిస్తారని అందరూ ఊహించారు. కానీ ఫారెస్ట్ డెవోలోప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చి అధిష్టానం చేతులు దులుపుకుంది. ఉప ముఖ్యమంత్రి భట్టికి విధేయుడిగా ఉన్న వీరయ్య డీసీసీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. అయితే భద్రాచలం నియోజకవర్గంలో ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావును ప్రత్యర్థిగానే చూస్తున్నారు. ఎమ్మెల్యే వెంకట్రావు, మాజీ ఎమ్మెల్యే వీరయ్య ఒకే పార్టీలో ఉన్నా... ఇద్దరూ కలిసి వేదిక పంచుకున్న దాఖలాలు లేవు. దీంతో కార్యకర్తలు పొదెం, తెల్లం వర్గాలుగా విడిపోయారు. సోషల్ మీడియా వేదికగా కార్యకర్తలు ఒక వర్గంపై మరొక వర్గానికి చెందిన వారు దూషణలకు దిగుతున్నారు.
20రోజులు క్రితం వివాదం షురూ..
20 రోజుల క్రితం పొదెం వీరయ్య దుమ్ముగూడెం మండలంలోని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ, ఎమ్మెల్యే వెంకట్రావు నిజమైన కాంగ్రెస్ నాయకుడు కాదని, అతనితో పార్టీకి నష్టం వాటిల్లుతుందని మాట్లాడారు. వీరయ్య మాటలను తెల్లం వర్గీయలు తీవ్రంగా పరిగణించారు.
రచ్చకెక్కిన రాజకీయం..
సోషల్ మీడియా వేదికగా అందరూ కలిసి పనిచేస్తే పార్టీ అభివృద్ధి చెందుతుందని కామెంట్ పెట్టినందుకు వీరయ్య వర్గీయలు తనని చంపుతామని బెదిరించారని ఎమ్మెల్యే తెల్లం అనుచరుడిగా భావిస్తున్న శ్రీను అనే వ్యక్తి భద్రాచలం పోలిస్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీనికి కౌంటర్‌గా పొదెం అనుచరులు తనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారని, ఆ కేసు నుంచి బయటపడాలంటే వీరయ్యను ఒంటరిగా కలవమని పొదెం అనుచరుడు చెప్పడంతో, తాను వీరయ్య ఇంటి వద్దకు వెళ్లగా... తనపై వీరయ్య అనుచరులతో కలిసి దాడి చేసి, గాయపరచారని, చంపేస్తాం అని బెదిరించారని శ్రీను గురువారం భద్రాచలం ఏఎస్పీకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు.
ఎమ్మెల్యే వెంకట్రావు స్వయంగా ఏఎస్పీ కార్యాలయానికి వచ్చి దాడి చేసిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఏఎస్పీని కోరారు. అయితే వర్గ రాజకీయాలు చేస్తూ, పార్టీకి నష్టం కలిగిస్తున్న వీరయ్య వైఖరిపై అధిష్టానానికి ఫిర్యాదు చేయనున్నట్లు తెల్లం పేర్కొనడంతో ఇప్పటివరకూ చాప కింద నీరులా ఉన్న వర్గ రాజకీయాలు రచ్చకెక్కాయి. అసెంబ్లీ ఎన్నికలు జరిగి రెండేళ్లు కావొస్తున్నా.... వీరయ్య, వెంకట్రావు మధ్య పొసగకపోవడంతో కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారు.






