ఏజెన్సీ ప్రాంత వైద్యంపై ప్రభుత్వం చిన్న చూపు: సిపిఐ ఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ

by Kodari Anjali |

భద్రాచలం ఆసుపత్రిని ముఖ్యమంత్రి సందర్శించాలని సిపిఐ ఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ డిమాండ్ చేశారు.

ఏజెన్సీ ప్రాంత వైద్యంపై ప్రభుత్వం చిన్న చూపు: సిపిఐ ఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ
X

దిశ, భద్రాచలం: భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా సందర్శించి ఇక్కడ అందుతున్న వైద్యాన్ని చూడాలని సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ డిమాండ్ చేశారు. బుధవారం సిపిఐ ఎం రాష్ట్ర, జిల్లా, పట్టణ బృందం ప్రభుత్వ ఏరియా హాస్పిటల్‌ని సందర్శించారు. ఈ సందర్భంగా పలువురు రోగులతో మాట్లాడిన జాన్ వెస్లీ వారికి అందుతున్న వైద్యంపై ఆరా తీశారు. అనంతరం ఏరియా హాస్పిటల్ ఇంచార్జ్ సూపర్డెంట్ డాక్టర్ రాజశేఖర్ రెడ్డితో మాట్లాడి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలపై చర్చించారు. అనంతరం పాత్రికేయులతో మాట్లాడిన జాన్ వెస్లీ ఏజెన్సీ వైద్యంపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందని ఆరోపించారు. నాలుగు రాష్ట్రాలకు సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న భద్రాచలం ఆసుపత్రికి ప్రతిరోజు 400 నుండి 600 వరకు రోగులు వస్తున్నారని అన్నారు. ఆ స్థాయిలో రోగులువస్తున్న ఆసుపత్రికి కేవలం 19 మంది వైద్యులే ఉండటం శోచనీయమని అన్నారు. 55 మంది ఉండాల్సిన నర్సింగ్ సిబ్బందికి కేవలం 15 మంది మాత్రమే ఉన్నారని అన్నారు. సగానికి పైగా ఖాళీలు ఉంటే వాటిని పూరించాల్సిన పాలకులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు.

చాలీచాలని వేతనాలు సకాలంలో అందటం లేదు..

అత్యాధునిక వైద్య పరికరాలు ఉన్నప్పటికీ పూర్తిస్థాయిలో వైద్య సిబ్బంది లేక పేదవాడికి ప్రభుత్వ వైద్యం అందని ద్రాక్షల మిగిలిపోతుందని జాన్ వెస్లీ ఆవేదన వ్యక్తం చేశారు. ఆస్పత్రిలో పారిశుద్ధ్య పనులు నిర్వహించే శానిటేషన్ కార్మికులకు సైతం చాలీచాలని వేతనాలు సకాలంలో అందటం లేదని అన్నారు. కనీస వేతనం రు.26,000 ఇవ్వాల్సి ఉండగా, కేవలం రు.11,000 మాత్రమే ఇవ్వటం దుర్మార్గమని ఆ వేతనం కూడా మూడు నాలుగు నెలలకు ఒకసారి విడుదల చేయటం కార్మికుల పొట్ట కొట్టడమేనని జాన్ వెస్లీ ధ్వజమెత్తారు. ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఈ ప్రాంత ప్రజలకు వ్యాపించే సీజనల్ వ్యాధులకు కావలసిన అన్ని రకాల మందులు కూడా అందుబాటులో లేవని అన్నారు. జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నా భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి సందర్శించిన పాపాన పోలేదని జాన్ వెస్లీ విమర్శించారు.

చొరవ తీసుకొని పరిష్కారం చూపకపోతే..

సిపిఐ ఎం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ వైద్యం పై అధ్యయనం చేస్తున్నామని ప్రభుత్వాసుపత్రిలో నెలకొన్న సమస్యలపై ఆగస్టు మాసంలో హైదరాబాదులో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రత్యేకించి భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో నెలకొన్న సిబ్బంది కొరతపై త్వరలోనే సిపిఐ ఎం బృందం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళుతుందని తెలిపారు. ప్రధానంగా భద్రాచలంలో నెలకొన్న సిబ్బంది కొరత ముఖ్యమంత్రి చొరవ తీసుకొని పరిష్కారం చూపకపోతే భవిష్యత్తులో తీవ్రమైన ఉద్యమం ఎదుర్కోక తప్పదని జాన్ వెస్లీ ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బండారు రవికుమార్, రాష్ట్ర కమిటీ సభ్యులు ఏజే రమేష్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎంబీ నర్సారెడ్డి, పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి, జిల్లా కమిటీ సభ్యులు బండారు శరత్ బాబు, సున్నం గంగా పట్టణ కార్యదర్శి, వర్గ సభ్యులు ఎర్రంశెట్టి వెంకట రామారావు, డి సీతాలక్ష్మి, సంతోష్ 20వ వార్డు నెంబర్ ఇరుప అనసూర్య, పట్టణ నాయకులు నాదెల లీలావతి, కొలగాని రమేష్, దొనకొండ రాఘవయ్య, కనక శ్రీ చట్ట శ్రీనివాసరావు, కోరాడ శ్రీను, సంద్ర ఉపేంద్ర కుంజా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Next Story