- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మరో మణిహారం ‘ఎర్త్ యూనివర్సిటీ’
కొత్తగూడెం కలెక్టరేట్ సమీపంలో నెలకొల్పిన ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ పనులు చివరి దశకు చేరుకున్నాయి. రేపు

దిశ, కొత్తగూడెం: రాష్ట్రంలో మరో ప్రభుత్వ యూనివర్సిటీ ప్రారంభానికి రంగం సిద్ధమైంది. దేశంలోనే మొట్టమొదటి పూర్తిస్థాయి భూవిజ్ఞాన శాస్త్ర విశ్వవిద్యాలయం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆవిష్కృతం కాబోతున్నది. డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ పేరిట నెలకొల్పిన ఈ యూనివర్సిటీ తెలంగాణకు మణిహారంలా మారనున్నది. ఏజెన్సీ విద్యార్థుల పాలిట వరం కాబోతున్నది. బొగ్గు గనులు, ఖనిజ వనరుల లభ్యత కారణంగా ఈ ప్రాంతంలో ఏర్పడిన మైనింగ్ ఇంజినీరింగ్ కాలేజీనే భూ విజ్ఞాన శాస్త్ర విశ్వవిద్యాలయంగా ప్రమోట్ చేయబడింది. భూ విజ్ఞాన శాస్త్రంలో ప్రత్యేకతను కలిగి ఉండటం, ప్రాంతీయ అవసరాలను తీర్చడం ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ ప్రత్యేకత. ఈ విశ్వవిద్యాలయంలో ప్రత్యేక విద్యా కేంద్రం ఉండటంతో పాటు జియాలజీ(భూగర్భ శాస్త్రం), జియోఫిజిక్స్(భౌతిక భూగోళ శాస్త్రం), జియోకెమిస్ట్రీ (భూ రసాయన శాస్త్రం), ఎన్విరాన్‌మెంటల్ సైన్సెస్ (పర్యావరణ శాస్త్రాలు) వంటి అనేక కోర్సులు ఉండనున్నాయి.
ఈ కోర్సులు భూ విజ్ఞాన రంగంలో లోతైన జ్ఞానం, ప్రత్యేక నైపుణ్యాలను పొందడానికి సహాయపడతాయి. కొత్తగూడెం చుట్టూ కోల్ మైన్స్ ఉండటం ఈ యూనివర్సిటీ ఏర్పాటుకు కలిసొచ్చిన అంశం. ఇది మైనింగ్, దాని అనుబంధ రంగాలకు అవసరమైన నిపుణులను తీర్చిదిద్దడంలో కీలకంగా మారనుంది. ఈ యూనివర్సిటీ ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రాంతంలో విద్యా ప్రమాణాలను పెంచడానికి దోహదపడుతుంది. ఇందులో కోర్సులు పూర్తిచేసే వారికి మైనింగ్, పెట్రోలియం, నీటి వనరులు, పర్యావరణ పరిరక్షణ, భూకంప అధ్యయనం వంటి దేశీయ, అంతర్జాతీయ రంగాల్లో ఉద్యోగాలు లభించనున్నాయి. భూకంపాలు, వరదలు, ఖనిజాల అన్వేషణ, భూగర్భ జలాలు వంటి ప్రాంతీయ సమస్యలపై పరిశోధనలు జరపడానికి ఈ వర్సిటీ బలమైన వేదికగా పనిచేస్తుంది. పరిశోధన ద్వారా లభించిన ఫలితాలు వనరుల నిర్వహణ, విపత్తు నిర్వహణలో ప్రభుత్వాలకు సహాయపడతాయి. ఈ వర్సిటీ కేవలం విద్యను అందించడమే కాకుండా రాష్ట్రం, దేశ అభివృద్ధికి దోహదపడుతుంది.
ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి
కొత్తగూడెం కలెక్టరేట్ సమీపంలో నెలకొల్పిన ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ పనులు చివరి దశకు చేరుకున్నాయి. రేపు (మంగళవారం) మధ్యాహ్నం 2గంటలకు సీఎం రేవంత్ రెడ్డి యూనివర్సిటీని ప్రారంభించి దేశానికి అంకితం చేయనున్నారు. కాగా, సీఎం పర్యటనను దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే మంత్రులు యూనివర్సిటీని సందర్శించి పనులను పరిశీలించారు. కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ ఎప్పటికప్పుడు అధికారులను సమన్వయపరుస్తూ వారం రోజులుగా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. పారిశుధ్య పనులు, వర్సిటీ అంతర్గత రోడ్లు, శిలాఫలకం, వేదిక ఏర్పాట్లు, మంచినీటి వసతి, విద్యుత్ సౌకర్యం పనులపై మున్సిపల్, పంచాయతీ, ఆర్ అండ్ బీ, నీటి పారుదల, విద్యుత్ శాఖ అధికారులకు సలహాలు, సూచనలు చేస్తూ పనులు త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. బహిరంగ సభకు సంబంధించిన భద్రతా ఏర్పాట్లను ఎస్పీ రోహిత్ రాజు పర్యవేక్షిస్తు్న్నారు.






