డ్రగ్స్ వద్దు.. జీవితమే ముద్దు

by Batti.Sumithra |   (  Updated:2026-03-24 06:39:34  IST  )

కమ్మవారి కల్యాణ మండపంలో ఏన్కూర్ ఎస్‌ఐ సంధ్య ఆధ్వర్యంలో డ్రగ్స్ అవగాహన సదస్సు నిర్వహించారు.

డ్రగ్స్ వద్దు.. జీవితమే ముద్దు
X

దిశ, ఏన్కూర్ : చిన్నతనంలోనే జీవితాన్ని విచ్ఛిన్నం చేసుకోవద్దని, “డ్రగ్స్ వద్దు... జీవితమే ముద్దు” అని ఈగల్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ కె. హేమరాణి అన్నారు. మండల కేంద్రంలోని కమ్మవారి కల్యాణ మండపంలో ఏన్కూర్ ఎస్‌ఐ సంధ్య ఆధ్వర్యంలో డ్రగ్స్ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, డ్రగ్స్ రకరకాల మొక్కల నుండి ఉత్పత్తి అవుతాయని తెలిపారు. ఉదాహరణకు గంజాయి, కోకెయిన్, పొగాకు వంటి పదార్థాలు శుద్ధి చేసిన మొక్కల ఉత్పత్తుల నుంచే వస్తాయని వివరించారు. ఈ డ్రగ్స్‌ను యువతకు అలవాటు చేయించి, ఏజెంట్ల ద్వారా విద్యార్థులకు అమ్మకాలు జరిపి వారి జీవితాలను నాశనం చేస్తున్నారని ఆమె హెచ్చరించారు.

డ్రగ్స్ నిర్మూలన కోసం యువత నడుం కట్టాలని సూచించారు. మత్తు పదార్థాల పై పోరాటం మనతోనే ప్రారంభం కావాలని, డ్రగ్స్ నుండి మీ స్నేహితులు, కుటుంబ సభ్యులు, పాఠశాలలు, కళాశాలలు, సమాజాన్ని రక్షించేందుకు 1908 నంబర్‌కు కాల్ చేయాలని తెలిపారు. సమాచారం అందించిన వారి పేర్లు గోప్యంగా ఉంచబడతాయని ఇన్స్పెక్టర్ కె. హేమరాణి తెలిపారు. తెలంగాణ రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చేందుకు ప్రభుత్వం అన్ని వర్గాల ప్రభుత్వ సంస్థల సహకారంతో ప్రజల్లో చైతన్యం కల్పిస్తున్నదని ఆమె అన్నారు. ఇంత మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఏన్కూర్ ఎస్‌ఐ సంధ్యను ఆమె అభినందించారు. ఈ కార్యక్రమంలో విఎం బంజర్ రూరల్ సీఐ ముత్తిలింగం, ఎస్‌ఐ సంధ్య, ఎంఈఓ నాగిరెడ్డి, డాక్టర్ రాములు, ఏఓ నరసింహారావు, హెచ్‌ఎం వేము రాజు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, వివిధ పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు.

Next Story