Dump Yard : లక్షలు ఖర్చు చేశారు.. వదిలేశారు?

by Thanuru Gopichand |   (  Updated:2025-11-22 04:24:09  IST  )

మణుగూరులో లక్షలు ఖర్చు చేసి అన్నారం ఏరియాలో డంప్ యార్డ్‌ను నిర్మించినా అది నిరుపయోగంగా మారింది.

Dump Yard : లక్షలు ఖర్చు చేశారు.. వదిలేశారు?
X

దిశ, మణుగూరు : మణుగూరులో లక్షలు ఖర్చు చేసి అన్నారం ఏరియాలో డంప్ యార్డ్‌ను నిర్మించినా అది నిరుపయోగంగా మారింది. పట్టణం నుంచి సుమారు 12కిలో మీటర్ల దూరంలో ఈ డంపింగ్ యార్డును నిర్మించడంతో అక్కడికి చెత్త తరలించే వాహనాలు వెళ్లే పరిస్థితి లేకుండా పోయింది. ఆ వాహనాలన్నీ కార్యాలయంలో మూలనపడ్డాయి. లక్షలు వెచ్చించి నిర్మించిన ఈ డంప్ యార్డు వినియోగించకపోవడంతో పట్టణంలో సేకరించిన చెత్తను ప్రధాన రహదారి పక్కనే డంపు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఫలితంగా ఈ ప్రాంతమంతా దుర్వాసన వెదజల్లుతున్నది. స్థానికులు, రోడ్డు వెంబడి వెళ్లే వాహనదారులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. రోగుల బారిన పడే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు. ఏమాత్రం ఆలోచింకుండా డంప్ యార్డు నిర్మించారని అధికారులపై విమర్శలు వస్తున్నాయి.

వాహనదారులకు కంపు

మణుగూరుకు డంప్ యార్డ్ కరువైంది. గతంలో లక్షలు ఖర్చు చేసి అన్నారం ఏరియాలో డంప్ యార్డ్‌ను నిర్మించారు. కానీ ఇప్పుడు ఆ డంప్ యార్డును ఉపయోగించిన పాపాన పోలేదు. చేసేది ఏమి లేక ప్రధాన రహదారి పక్కనే సేకరించిన చెత్తను డంపు చేస్తున్నారు. ఆ ప్రాంతం అంతా కంపు వాసన కొడుతోంది. ప్రయాణికులకు, వాహనదారులకు కంపుతో మణుగూరుకు స్వాగతం పలుకుతుంది. ఓ వైపు రోడ్డుపై వచ్చే దుమ్మూ, ధూళి మరోవైపు కంపుతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మున్సిపాలిటీ అధికారుల నిర్లక్ష్యంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఫలితంగా రోగాల బారిన పడే ప్రమాదం ఉంది. పన్నులు వసూలు చేయడంలో ఉన్న శ్రద్ధ మున్సిపల్ అధికారులకు ప్రజారోగ్యంపై లేదని ప్రజలు మండిపడుతున్నారు. అంతేకాకుండా ఎంతో డబ్బు ఖర్చు చేసి కొన్న వాహనాలు మణుగూరు మున్సిపాలిటీ కార్యాలయంలో మూలనపడ్డాయి. అంత ఖర్చు చేసి కొన్న వాహనాలకు మరమ్మత్తులు చేయించకపోవడంతో ఆ వాహనాలు కార్యాలయంలో తుప్పుపట్టి పోతున్నాయి.

డంపింగ్ యార్డుకు సుమారు 12 కిలోమీటర్లు

మణుగూరు మున్సిపాలిటీ పరిధిలో లక్షల ఖర్చు చేసి ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డ్ పట్టణం నుండి సుమారు 12 కిలో మీటర్ల దూరంలో ఏర్పాటు చేశారు. దీంతో ఒక్క వాహనానికి డంపింగ్ యార్డుకు వెళ్లి వచ్చేందుకు రూపాయలు 500 వరకు డీజిల్ ఖర్చు అవుతుంది. ఇదేమి ఆలోచించకుండా ఇంత దూరంలో డంపింగ్ యార్డు నిర్మించడంతో చెత్త వాహనాలు అక్కడికి వెళ్లే పరిస్థితి లేదు. లక్షలు పోసి నిర్మించినా ఎందుకు నిరుపయోగంగా మారిన పరిస్థితి నెలకొందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో చేసేది ఏమీ లేక రోడ్ల పక్కనే చెత్తను పడేస్తున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి డంపింగ్ యార్డ్ వాడకంలోకి తీసుకురావాలని, ప్రధాన రహదారిపై వేసిన చెత్తను తొలగించి శుభ్రపరచాలని ప్రజలు కోరుతున్నారు.

Next Story