ప్రజల ప్రేమానురాగాలను పొందడం మా అదృష్టం : సత్తుపల్లి ఎమ్మెల్యే

by Batti.Sumithra |

ఇంతమంది ప్రజల ప్రేమానురాగాలను పొందడం మా కుటుంబ అదృష్టమని సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ అన్నారు.

ప్రజల ప్రేమానురాగాలను పొందడం మా అదృష్టం : సత్తుపల్లి ఎమ్మెల్యే
X

దిశ, సత్తుపల్లి : ఏ జన్మ పుణ్యమో సత్తుపల్లిలో ఇంతమంది ప్రజల ప్రేమానురాగాలను పొందడం మా కుటుంబ అదృష్టమని సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ అన్నారు. శనివారం ముందుగా సత్తుపల్లి పట్టణంలోని వెంగళరావు నగర్ నుంచి రింగ్ సెంటర్ మీదుగా వేంసూర్ రోడ్డులోని ఫంక్షన్ హాల్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం రాణి సెలబ్రేషన్ ఫంక్షన్ హాల్‌లో కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయకుమార్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 50 కేజీల భారీ కేక్‌ను కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆమె మాట్లాడుతూ తమ రాజకీయ జీవిత చరిత్రలో సత్తుపల్లి యువతను పేకాట, కోడి పందాలు, బెట్టింగ్‌కు బానిసలు కాకుండా అరికడతామని, సత్తుపల్లిని సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి పోనివ్వబోమని స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కొందరు కాంగ్రెస్ పార్టీలో ఉంటూనే పార్టీకి వెన్నుపోటు పొడిచి మోసం చేసిన వారిని ఉపేక్షించబోమని తెలిపారు.

ప్రజలు త్వరలోనే వారికి తగిన బుద్ధి చెబుతారని ఆమె అన్నారు. సర్పంచ్ ఎన్నికల్లో వెన్నుపోటుదారుల పై రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రులు, టీపీసీసీ అధ్యక్షులకు నివేదిక అందించామని, వారి పై పార్టీ క్రమశిక్షణ చర్యలు తప్పకుండా తీసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. త్వరలో జరగనున్న మున్సిపల్, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో సత్తుపల్లి అడ్డాపై కాంగ్రెస్ జెండా ఎగరాలని, ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలిచేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆమె కోరారు. అనంతరం రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ దయానంద్ విజయకుమార్, జిల్లా డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ, కాంగ్రెస్ పార్టీ నాయకులు సభను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహించి, రక్తదాతలను అభినందించారు. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి, వేంసూరు, పెనుబల్లి, కల్లూరు, తల్లాడ మండలాలకు చెందిన సర్పంచులు, వివిధ మండలాల అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Next Story