దిశ ఎఫెక్ట్​...బాల్య స్నేహితుడి ఇంటికి ఎమ్మెల్యే జారే

by Disha Web Desk 15 |
దిశ ఎఫెక్ట్​...బాల్య స్నేహితుడి ఇంటికి ఎమ్మెల్యే జారే
X

దిశ, దమ్మపేట : మరోసారి ఎమ్మెల్యే జారే ఆదినారాయణ తన మంచిమనస్సు ను చాటుకున్నారు. అయ్యో పాపం అనే శీర్షికతో దిశ కథనం ఇప్పుడు మండలంలో సంచలనంగా మారింది. అయ్యో పాపం కథనం వెలువడిన నాటినుండి అధికారులు, దాతలు ఆ కుటుంబానికి సాయంగా ఉండేందుకు ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల కథనాలు వెలువడిన రోజు బాధిత కుటుంబ వివరాలు తీసుకున్న ఎమ్మెల్యే జారే ఆదినారాయణ మంగళవారం స్వయంగా ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు దమ్మపేట మండల కేంద్రంలోని డబుల్ బెడ్ రూం కాలనీలోని దాగం రామాచారి నివాసానికి చేరుకోగా అక్కడ ఆపదలో ఉన్నది తన బాల్య స్నేహితుడు అని గుర్తించారు.

వెంటనే చెమర్చిన కళ్లతో అక్కున చేర్చుకున్నారు. అన్నివిధాలుగా సాయంగా ఉంటా అనే హామీ ఇచ్చారు. అలానే తనతో ఉన్న చిన్ననాటి అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. స్నేహితుడి దీనస్థితిపై విచారం వ్యక్తం చేస్తూ వారం రోజుల్లో మరోసారి తనవద్దకు వస్తానని తాను మరలా వచ్చే సమయానికి తనలో మార్పు చూడాలని ఆకాంక్షించారు. అలానే తక్షణ సహాయం కింద బుధవారం సాయంత్రంలోగా రేకులతో కూడిన తాత్కాలిక నివాసం ఏర్పాటు చేస్తానని అలానే ఆడబిడ్డల చదువుల కోసం తగిన ఏర్పాట్లు చేస్తానని, రామాచారి భార్య మహాలక్ష్మిని హైదరాబాద్ ఆస్పత్రికి తరలించి వైద్యం చేయిస్తానని హామీ ఇచ్చారు. వరుస కథనాలతో ఓ కుటుంబ జీవన స్థితగతులను మార్చేందుకు ముందుకు వచ్చిన దిశను ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు.

నిత్యావసర సరుకులు అందజేత

ఎర్రుపాలెం మండలం రామన్నపాలెం గోసవీడు జిల్లా ఉన్నత పరిషత్ పాఠశాల 1997-98 సంవత్సరానికి చెందిన 10వ తరగతి పూర్వ విద్యార్థులు, దిశ దినపత్రికలో ప్రచురితమైన అయ్యో పాపం కథనం సోషల్ మీడియాలో వైరల్ అవటంతో స్పందించి నిరుపేద కుటుంబానికి సహాయంగా సుమారు 6000 రూపాయల విలువ చేసే బియ్యం, నిత్యావసర సరుకులు, వస్తువులు భద్రపరచుకునేందుకు పెట్టెను మంగళవారం ఉదయం నిరుపేద కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరుపేద కుటుంబంలో వారి ఆర్థిక పరిస్థితిని గమనించి సహాయ సహకారాలు అందించడం జరిగిందని, ప్రతి ఒక్కరూ మానవతా దృక్పథంతో వారికి సహాయం చేయాలని కోరారు.


Next Story

Most Viewed