- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సామాన్యుడి పై “గ్యాస్” గుదిబండ
సామాన్యుడికి వంట గ్యాస్ కష్టాలు తప్పడం లేదు. అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావం వంట గ్యాస్ పై పడింది.

దిశ, తల్లాడ : సామాన్యుడికి వంట గ్యాస్ కష్టాలు తప్పడం లేదు. అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావం వంట గ్యాస్ పై పడింది. దీనిని ఆసరాగా చేసుకున్న కొంతమంది డీలర్లు గ్యాస్ కొరత సాకుతో సామాన్యులకు ఇబ్బందులు కలిగిస్తున్నారు. ఈ క్రమంలో సిలిండర్ బుక్ చేసినప్పటికీ పొందాలంటే వినియోగదారులు నానా తిప్పలు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇటీవల వరుసగా పండుగలు రావడంతో గ్యాస్ కొరత మరింత పెరిగింది.
బ్లాక్‌లో మూడు రెట్లు అధిక ధరలకు విక్రయం...
ప్రస్తుతం మార్కెట్‌లో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ అధికారిక ధర సుమారు రూ. 950. అయితే డీలర్లు స్టాక్ లేదనే సాకుతో వినియోగదారులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఇదే సమయంలో అదనపు డబ్బులు చెల్లించే వారికి గుట్టుచప్పుడు కాకుండా సిలిండర్లు సరఫరా చేస్తున్నారు. ఫలితంగా రూ. 900–950 మధ్యలో లభించాల్సిన సిలిండర్, బ్లాక్ మార్కెట్‌లో రూ. 1800 నుంచి రూ. 2800 వరకు విక్రయిస్తున్నారు. ఈ దందా ముఖ్యంగా ఖమ్మం జిల్లాలోని తల్లాడ, వైరా, కల్లూరు, ఎన్‌కూరు ప్రాంతాల్లో కొనసాగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొందరు డీలర్లు స్థానిక హోటళ్లకు డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లు సరఫరా చేస్తూ భారీగా లాభాలు పొందుతున్నారని తెలుస్తోంది.
కమర్షియల్ సిలిండర్ల పేరుతో అక్రమాలు...
హోటళ్లకు ఉపయోగించే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ (19 కిలోలు) నాన్-సబ్సిడీ ధర సుమారు రూ. 2,106.80. ఈ ధరలు అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితుల ఆధారంగా మారుతూ ఉంటాయి. కమర్షియల్ సిలిండర్లకు డొమెస్టిక్ సిలిండర్లలా కఠిన నిబంధనలు ఉండవు. హోటళ్లు, రెస్టారెంట్లు, హాస్టళ్లు తమ అవసరాలకు అనుగుణంగా నెలకు 120–130 సిలిండర్లు తీసుకునే వీలుంది. ఈ సడలింపులను ఆసరాగా చేసుకుని కొందరు డీలర్లు అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపణలు ఉన్నాయి.
నిద్రమత్తులో విజిలెన్స్ అధికారులు...
డీలర్లు అధిక ధరలకు గ్యాస్ సిలిండర్లు విక్రయిస్తున్నప్పటికీ విజిలెన్స్ అధికారులు పెద్దగా స్పందించడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటివరకు మండలంలో పెద్దగా తనిఖీలు నిర్వహించకపోవడం అనుమానాలకు తావిస్తోంది. అదేవిధంగా హోటల్ నిర్వాహకులు గ్యాస్ ధరల పెరుగుదలను కారణంగా చూపుతూ టిఫిన్ ధరలను కూడా పెంచుతున్నారు. ఒక టిఫిన్ ప్లేట్‌పై రూ. 30 నుంచి రూ. 40 వరకు అదనంగా వసూలు చేస్తున్నట్లు సమాచారం.
అధికారుల హెచ్చరిక...
కిరణ్ సివిల్ సప్లై (డీటీ) అధికారి మాట్లాడుతూ హోటళ్లలో లేదా దాబాల్లో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లు వినియోగించడం చట్టరీత్యా నేరమని తెలిపారు. అలాంటి ఘటనలు వెలుగులోకి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలో ప్రతిరోజూ సివిల్ సప్లై, ఎన్‌ఫోర్స్మెంట్ అధికారులు డ్రైవ్‌లు నిర్వహిస్తూ డొమెస్టిక్ సిలిండర్లను సీజ్ చేస్తున్నామని చెప్పారు. ఏజెన్సీ నిర్వాహకులు హోటళ్లకు డొమెస్టిక్ సిలిండర్లు విక్రయించినట్లు తెలిసినా వారి లైసెన్స్ రద్దు చేస్తామని తెలిపారు. అలాగే గ్యాస్ కొరత లేదని, ప్రజలు రూమర్లను నమ్మకుండా అవసరమైనప్పుడు మాత్రమే సిలిండర్ బుక్ చేసుకోవాలని సూచించారు.






