విధి నిర్వహణలో నిజాయితీ చాటిన కండక్టర్.. ప్రయాణికుడి విలువైన ఫోన్ అప్పగింత

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-10-26 07:46:06  IST  )

సత్తుపల్లి డిపో బస్సులో ప్రయాణికుడు పోగొట్టుకున్న రూ.45 వేలు విలువచేసే vivo ఫోన్‌ను కండక్టర్ నాగుల్ మీరాభి తిరిగి అప్పగించారు.

విధి నిర్వహణలో నిజాయితీ చాటిన కండక్టర్.. ప్రయాణికుడి విలువైన ఫోన్ అప్పగింత
X

దిశ, సత్తుపల్లి: సత్తుపల్లి డిపో బస్సులో ప్రయాణికుడు పోగొట్టుకున్న రూ.45 వేలు విలువచేసే vivo ఫోన్‌ను కండక్టర్ నాగుల్ మీరాభి తిరిగి అప్పగించారు. శనివారం TS 04 UD 1819 నెంబర్ గల బస్సు సత్తుపల్లి నుండి వి ఎం బంజర వెళుతున్నది. అయితే ఆ బస్సులో ఖమ్మంకు చెందిన దేవాదాయ శాఖ ఉద్యోగి పి వెంకటేశ్వరరావు ప్రయాణం చేస్తున్న సమయంలో తన వద్ద ఉన్న రూ.45 వేలు విలువ చేసే మొబైల్ మర్చిపోయి వి.యం బంజర్‌లో దిగి వెళ్లిపోయాడు. తర్వాత ప్రయాణికులకు టికెట్లు ఇచ్చేందుకు వెనక్కు వెళ్ళిన కండక్టర్‌కు సీటు కింది భాగంలో మొబైల్ కనిపించింది. కండక్టర్ దానిని తీసుకుని తన వద్ద ఉంచారు. మొబైల్ పోగొట్టుకున్న విషయాన్ని గమనించిన వెంకటేశ్వరరావు వేరే మొబైల్ ద్వారా తన నెంబర్‌కు కాల్ చేయగా ఫోను ఆన్సర్ చేసిన కండక్టర్.. మొబైల్ తన వద్దనే ఉన్నది అని సత్తుపల్లి వచ్చి తీసుకొని వెళ్లవలసిందిగా చెప్పారు. దాంతో సదరు ప్రయాణికుడు సత్తుపల్లి వెళ్లి తన వద్ద ఉన్న ఆధారాలు చూపించడంతో మొబైల్‌ను తిరిగి స్టేషన్ మేనేజర్ ఆనందం, సెక్యూరిటీ కానిస్టేబుల్ చెన్నారావు సమక్షంలో ఆదివారం అప్పగించారు. పోగొట్టుకున్న మొబైల్ తిరిగి దొరుకుతుందని అనుకోలేదని సత్తుపల్లి డిపో కండక్టర్ నిజాయితీతో విలువైన తన మొబైల్‌ను అప్పగించడం పట్ల ఆర్టీసీ యాజమాన్యానికి, సత్తుపల్లి డిపో మేనేజర్ ఊటుకూరి సునీతకి, కండక్టర్ నాగుల్ మీరాబికి ప్రయాణికుడు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.

Next Story